Jasprit Bumrah: బుమ్రాపై మదన్‌లాల్ షాకింగ్ కామెంట్స్

ABN , First Publish Date - 2023-03-03T20:49:41+05:30 IST

గాయంతో జట్టుకు దూరమైన టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)పై మాజీ

Jasprit Bumrah: బుమ్రాపై మదన్‌లాల్ షాకింగ్ కామెంట్స్

ఇండోర్: గాయంతో జట్టుకు దూరమైన టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)పై మాజీ క్రికెటర్ మదన్‌లాల్(Madan Lal) సంచలన కామెంట్స్ చేశాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(WTC) ఫైనల్‌లో పేసర్ల గురించి ‘స్పోర్ట్స్ తక్’తో మాట్లాడుతూ.. బుమ్రా గురించి ఇప్పటికైతే మర్చిపోవాల్సిందేనని వ్యాఖ్యానించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ముగ్గురు పేసర్లు, ఒక స్పిన్నర్‌తో భారత జట్టు బరిలో దిగాల్సి ఉంటుందన్నాడు. కాబట్టి ఉమేశ్ యాదవ్‌(Umesh Yadav)ను తీసుకోవాల్సిందేనన్నాడు. బుమ్రాను ఇప్పటికైతే మర్చిపోవాల్సిందేనన్నాడు. సమీకరణం నుంచి అతడిని పక్కపెట్టడమే మంచిదని పేర్కొన్నాడు.

‘‘బుమ్రా తిరిగి జట్టులోకి వస్తే అప్పుడు చూద్దాం. ఇప్పటికైతే ఏది అందుబాటులో ఉందో దానినే ఉపయోగించుకోవాలి. అతడు ఏడాది, ఏడాదిన్నర తర్వాత వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అతడు చాలాకాలంగా ఆడలేదు. దీనిని బట్టి అతడి గాయం ఎంత తీవ్రమైనదో అర్థం చేసుకోవచ్చు’’ అని మదన్‌లాల్ చెప్పుకొచ్చాడు. బుమ్రా కోసం సెలక్షన్‌ ప్యానెల్ మరికొంత కాలం ఓపిగ్గా వేచి చూడక తప్పదన్నాడు.

సాధారణంగా గాయం మానడానికి గరిష్టంగా మూడు నెలలు పడుతుందని, సెప్టెంబర్ నుంచి బుమ్రా ఆడడం లేదని మదన్‌లాల్ గుర్తు చేశాడు. హార్దిక్ పాండ్యా కూడా వెన్ను సర్జరీ నుంచి కోలుకోవడానికి నాలుగు నెలలు పట్టిందన్నాడు. బుమ్రా ఆరు నెలలుగా ఆడడం లేదని, కాబట్టి అప్పటి బుమ్రా, ఇప్పటి బుమ్రా ఒకటేనని ఎలా అనుకుంటారని ప్రశ్నించాడు. మళ్లీ ఒకప్పటి బుమ్రాను చూడాలంటే చాలా సమయమే పడుతుందన్నాడు. ఇండియా కనుక డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరితే అప్పుడు ఉమేశ్ యాదవ్ మంచి ఆప్షన్ అవుతాడన్నాడు.

Updated Date - 2023-03-03T20:49:41+05:30 IST