Raipur Oneday: భారత్ ఘన విజయం.. సిరీస్ మనదే

ABN , First Publish Date - 2023-01-21T18:44:35+05:30 IST

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌(New Zealand)తో ఇక్కడి షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో

Raipur Oneday: భారత్ ఘన విజయం.. సిరీస్ మనదే

రాయ్‌పూర్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌(New Zealand)తో ఇక్కడి షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 109 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 20.1 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.

కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) అర్ధ సెంచరీతో రాణించాడు. 50 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలవగా, మరో ఓపెనర్ శుభమన్ గిల్(Shubman Gill) 40 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కోహ్లీ 11 పరుగులు చేసి అవుటయ్యాడు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్.. టీమిండియా బౌలర్ల దెబ్బకు విలవిల్లాడారు. ముఖ్యంగా మహ్మద్ షమీ 3 వికెట్లతో న్యూజిలాండ్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. హార్దిక్ పాండ్యా (Hardik Pandya) రెండు వికెట్లుతో తనవంతు పాత్ర పోషించాడు. కివీస్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్ చేసిన 36 పరుగులే అత్యధికం కాగా, బ్రేస్‌వెల్ 22, శాంట్నర్ 27 పరుగులు చేశాడు. 8 మంది ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కూడా దాటలేకపోయారు.

ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ 2-0తో భారత్ సొంతమైంది. చివరి వన్డే ఈ నెల 24న ఇండోర్‌లోని హోల్కార్ క్రికెట్ స్టేడియంలో జరగుతుంది. ఆ తర్వాత మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం అవుతుంది.

Updated Date - 2023-01-21T19:10:23+05:30 IST