Share News

Virat Kohli: సచిన్ 100 సెంచరీల రికార్డును కోహ్లీ బ్రేక్ చేయడం కష్టం.. ఎందుకో చెప్పిన క్రికెట్ లెజెండ్

ABN , First Publish Date - 2023-12-07T10:47:33+05:30 IST

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బఠాణీలు తిన్నంత సునాయసంగా రికార్డులను సాధిస్తుంటాడు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ క్రికెట్‌లో కింగ్ కోహ్లీ ఇప్పటివరకు అనేక రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు.

Virat Kohli: సచిన్ 100 సెంచరీల రికార్డును కోహ్లీ బ్రేక్ చేయడం కష్టం.. ఎందుకో చెప్పిన క్రికెట్ లెజెండ్

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బఠాణీలు తిన్నంత సునాయసంగా రికార్డులను సాధిస్తుంటాడు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ క్రికెట్‌లో కింగ్ కోహ్లీ ఇప్పటివరకు అనేక రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు. ముఖ్యంగా ఇటీవల ముగిసిన ప్రపంచకప్ సెమీ ఫైనల్‌లో సెంచరీ కొట్టడం ద్వారా వన్డే ఫార్మాట్‌లో 50 సెంచరీలను కూడా పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో సచిన్ 49 సెంచరీలు రికార్డును బ్రేక్ చేశాడు. ఇదే క్రమంలో సచిన్ సాధించిన 100 సెంచరీల రికార్డును కూడా కోహ్లీ బ్రేక్ చేస్తాడని పలువురు అంచనా వేస్తున్నారు. కానీ వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియన్ లారా మాత్రం ఈ విషయంతో ఏకీభవించడం లేదు. సచిన్ రికార్డును కోహ్లీ బ్రేక్ చేయడం కష్టమన్నాడు. దానికి కారణమెంటో కూడా చెప్పాడు. తాను కోహ్లీ బ్యాటింగ్‌కు పెద్ద అభిమానిని అని చెప్పిన లారా.. అతను సచిన్ రికార్డును అందుకోవాలంటే మరో 20 సెంచరీలు కావాలన్నాడు. కానీ వయసురీత్యా కోహ్లీ మరో నాలుగేళ్లు మాత్రమే ఆడొచ్చని, అప్పుడు ఏడాదికి 5 సెంచరీల చొప్పున కొట్టాల్సి ఉంటుందని చెప్పాడు. కాబట్టి ఇది చాలా కఠినమైనదని లారా అభిప్రాయపడ్డాడు. ఓ క్రీడా పత్రికతో మాట్లాడిన లారా ఈ వ్యాఖ్యలు చేశాడు.


‘‘ప్రస్తుతం కోహ్లీ వయసు 35 సంవత్సరాలు. కోహ్లీ ఇప్పటివరకు 80 సెంచరీలు చేశాడు. అతనికి ఇంకా 20 సెంచరీలు కావాలి. ఏడాదికి 5 సెంచరీల చొప్పున చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును అందుకోవడానికి కోహ్లీకి మరో 4 సంవత్సరాలు పడుతుంది. అంటే అప్పటికీ కోహ్లీ వయసు 39 సంవత్సరాలు. కాబట్టి ఈ వయసులో ఏడాదికి 5 సెంచరీల చొప్పున కొడుతూ సచిన్ రికార్డును అందుకోవడం కోహ్లీకి చాలా కఠినమైన పని. క్రికెట్ దృక్కోణంలో ఇది లాజికల్‌గా అనిపించడం లేదు. కాబట్టి సచిన్ రికార్డును కోహ్లీ బ్రేక్ చేస్తాడని నేను కచ్చితంగా చెప్పలేను. నేనే కాదు ఎవరూ చెప్పలేరు. టెండూల్కర్ 100 సెంచరీల రికార్డును కోహ్లి బ్రేక్ చేస్తాడని చెబుతున్నవారు క్రికెట్ లాజిక్‌ను పరిగణనలోకి తీసుకోరు. 20 సెంచరీలు చాలా దూరంలో ఉన్నాయి. చాలా మంది క్రికెటర్లు తమ కెరీర్ మొత్తంలో కూడా అన్ని సెంచరీలు చేయలేరు. కాబట్టి నేను సాహసం చేయను. కోహ్లీ చేస్తాడని చెప్పలేను. వయసు ఎవరికీ ఆగదు. రానున్న రోజుల్లో కోహ్లీ మరెన్నో రికార్డులను బద్దలు కొడతాడు. కానీ 100 సెంచరీలు చేయడం మాత్రం చాలా కష్టంగా అనిపిస్తుంది. అయితే ఒక వేల ఎవరైనా చేయగలరా? అంటే అది కోహ్లీనే అని చెప్పడం మరిచిపోవద్దు. కోహ్లీ మాత్రం దగ్గరికి రాగలడు. నేను కోహ్లీ క్రమ శిక్షణ, అంకితభావానికి పెద్ద అభిమానిని. అయితే కోహ్లీకి నా బెస్ట్ విషెస్ ఉంటాయి. అతను టెండూల్కర్ లాగా 100 సెంచరీలు సాధించగలిగితే నేను చాలా సంతోషిస్తాను. సచిన్ నాకు ప్రియమైన స్నేహితుడు. ముందే చెప్పినట్టు నేను కోహ్లీకి పెద్ద అభిమానిని’’ అని లారా అన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-07T10:50:04+05:30 IST