IND vs SL Final: చరిత్ర సృష్టించిన మహ్మద్ సిరాజ్.. బద్దలైన రికార్డులివే!

ABN , First Publish Date - 2023-09-17T18:57:12+05:30 IST

శ్రీలంకతో జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ విశ్వరూపం చూపించాడు. ఒకే ఓవర్‌లో 4 వికెట్లు తీసి శ్రీలంకను చావు దెబ్బ తీశాడు.

IND vs SL Final: చరిత్ర సృష్టించిన మహ్మద్ సిరాజ్.. బద్దలైన రికార్డులివే!

కొలంబో: శ్రీలంకతో జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ విశ్వరూపం చూపించాడు. ఒకే ఓవర్‌లో 4 వికెట్లు తీసి శ్రీలంకను చావు దెబ్బ తీశాడు. మొత్తంగా 21 పరుగులు మాత్రమే 6 వికెట్లు తీసి శ్రీలంకను 50 పరుగులకే ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో సిరాజ్ పలు రికార్డులను కూడా అందుకున్నాడు. ఒకే ఓవర్లో 4 వికెట్లు తీసిన మొదటి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో సిరాజ్ 16 బంతుల్లోనే 5 వికెట్లు తీశాడు. దీంతో వేగంగా 5 వికెట్లు తీసిన భారత బౌలర్‌గా సిరాజ్ రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో సిరాజ్ 21 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీశాడు. దీంతో భారత బౌలర్ల పరంగా వన్డేల్లో ఇవి నాలుగో అత్యుత్తమ గణాంకాలు కావడం గమనార్హం.


సిరాజ్ విధ్వంసం సాగిందిలా..

సిరాజ్ వేసిన రెండో ఓవర్‌లో ఒక పరుగు కూడా రాలేదు. దీంతో ఆ ఓవర్ మెయిడెన్ అయింది. ఇక 4వ ఓవర్‌లో విశ్వరూపం చూపించాడు. ఆ ఒక్క ఓవర్‌లోనే ఏకంగా 4 వికెట్లు పడగొట్టి లంకేయులు నడ్డి విరిచాడు. తాను వేసిన 4వ ఓవర్‌లో వరుసగా నిసాంక(2), సదీర సమరవిక్రమ(0), చరిత అసలంక(0), దనుంజయ డిసిల్వాను(4) పెవిలియన్ చేర్చాడు. దీంతో అతిథ్య జట్టు శ్రీలంక 12 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. సిరాజ్ వేసిన నాలుగో ఓవర్ మొదటి బంతికే నిసాంక ఇచ్చిన క్యాచ్‌ను రవీంద్ర జడేజా అద్భుతంగా అందుకున్నాడు. రెండో బంతి డాట్ అయింది. మూడో బంతికి సమర విక్రమ లెగ్‌బైస్‌లో ఔట్ అయ్యాడు. నాలుగో బంతికి అసలంక ఇచ్చిన క్యాచ్‌ను ఇషాన్ కిషన్ అందుకున్నాడు. ఐదో బంతి ఫోర్ వెళ్లింది. ఆరో బంతికి డి సిల్వా ఇచ్చిన క్యాచ్‌ను వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ అందుకున్నాడు. దీంతో ఈ ఓవర్‌లో సిరాజ్ ఏకంగా 4 వికెట్లు పడగొట్టాడు. ఈ ఓవర్‌ సిరాజ్ బంతి వేస్తే వికెట్ అన్నట్టుగా సాగింది. సిరాజ్ కెరీర్‌లోనే ఇది డ్రీమ్ స్పెల్‌గా నిలిచిపోయింది. ఆరో ఓవర్‌లో మరోసారి చెలరేగిన సిరాజ్.. శ్రీలంక కెప్టెన్ దసున్ శనకను డకౌట్ చేశాడు. శనక క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 12 పరుగులకే శ్రీలంక 6 వికెట్లు కోల్పోయింది. కాగా సిరాజ్ 10 బంతుల వ్యవధిలోనే 5 వికెట్లు పడగొట్టాడు. 12వ ఓవర్‌లో మరోసారి చెలరేగిన సిరాజ్ క్రీజులో కుదురుకున్న కుశల్ మెండీస్(17)ను క్లీన్ బౌల్డ్ చేశాడు.

ఆసియా కప్ విజేత భారత్

ఆసియా కప్ 2023 విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్‌ మ్యాచ్‌లో శ్రీలంక 50 పరుగులకే ఆలౌటైంది. భారత పేసర్ల ధాటికి కేవలం 15.2 ఓవర్లు మాత్రమే ఆ జట్టు బ్యాటింగ్ చేయగల్గింది. 51 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా 6.1 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా ఛేదించింది. దీంతో 43.5 ఓవర్లు మిగిలి ఉండగానే 10 వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. కాగా 7 సంవత్సరాల తర్వాత టీమిండియా మళ్లీ ఆసియా కప్ గెలిచింది. భారత జట్టు చివరి సారిగా 2016లో ఆసియా కప్ గెలిచింది. మొత్తంగా టీమిండియా ఆసియా కప్ గెలవడం ఇది 8వ సారి. దీంతో అత్యధిక సార్లు ఆసియా కప్ గెలిచిన రికార్డును భారత్ మరింత మెరుపరచుకుంది. అలాగే రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్జు ఆసియా కప్ గెలవడం ఇది రెండో సారి. రోహిత్ శర్మ కెప్టెన్సీలో 2016లో కూడా భారత జట్టు ఆసియా కప్ గెలిచింది.

Updated Date - 2023-09-17T18:57:12+05:30 IST