AP Politics: ఈ మూడు పార్టీల్లో ఇప్పుడిదే ఎడతెగని చర్చ..!

ABN , First Publish Date - 2023-08-02T19:27:18+05:30 IST

సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అన్ని పక్షాల్లో పోటీచేసే అభ్యర్థులు ఎవరనేది విషయమై నేతలకు కంటి మీద కునుకు లేదు. ఎన్నికల పొత్తులపై టీడీపీ, జనసేన ఎడతెగని ఉత్కంఠ దీనికితోడు ఏ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారనేది సస్పెన్స్‌ నెలకొంది. ఇరు పార్టీల్లోనూ పరస్పర ప్రకటనలు, అయోమయం, ఒకింత గందరగోళం కనిపిస్తున్నాయి. అధికార వైసీపీలోనూ కనీసం ఐదుగురు సిట్టింగ్‌ల మార్పులు, చేర్పులు ఉంటాయనే ఊహాగానాలు ఫ్యాన్‌ కింద వేడిగాలి పుట్టిస్తున్నాయి.

AP Politics: ఈ మూడు పార్టీల్లో ఇప్పుడిదే ఎడతెగని చర్చ..!

పొత్తుపై టీడీపీ, జనసేన వర్గాల అటెన్షన్‌

వైసీపీలో కొత్త ముఖాల కలవరం

గోదావరి తీరాన అప్పుడే ఎన్నికల బెట్టింగ్‌లు

అన్ని పార్టీల్లో ఇప్పుడిదే ఎడతెగని చర్చ

సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అన్ని పక్షాల్లో పోటీచేసే అభ్యర్థులు ఎవరనేది విషయమై నేతలకు కంటి మీద కునుకు లేదు. ఎన్నికల పొత్తులపై టీడీపీ, జనసేన ఎడతెగని ఉత్కంఠ దీనికితోడు ఏ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారనేది సస్పెన్స్‌ నెలకొంది. ఇరు పార్టీల్లోనూ పరస్పర ప్రకటనలు, అయోమయం, ఒకింత గందరగోళం కనిపిస్తున్నాయి. అధికార వైసీపీలోనూ కనీసం ఐదుగురు సిట్టింగ్‌ల మార్పులు, చేర్పులు ఉంటాయనే ఊహాగానాలు ఫ్యాన్‌ కింద వేడిగాలి పుట్టిస్తున్నాయి.

(ఏలూరు-ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :

తెలుగుదేశం, జనసేన ఎన్నికల పొత్తుపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇరు పార్టీల పొత్తులపై ఒక స్పష్టతతో కూడిన విధాన ప్రకటన ఏదీ చేయకపోయినా స్థానిక నేతలు ఒకవేళ పొత్తు కుదిరితే పలానా నియోజకవర్గాలు తమ పార్టీకి, మిగతా నియోజకవర్గాలన్నీ సదరు పొత్తు పెట్టుకోబోయే పార్టీకి కేటాయిస్తారంటూ విశ్లేషిస్తూనే ఉన్నారు. ఈ పరిణామాలే ఇరు పార్టీల్లోనూ గందరగోళానికి దారితీస్తున్నాయి. వారాహి పర్యటనలో భాగంగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తణుకు బహిరంగ సభలో తమ అభ్యర్థిని గెలిపించాలంటూ అభ్యర్థించారు. పశ్చిమ పర్యటనలో ఈ పరిణామం ఇరుపార్టీలను ఉలిక్కిపడేలా చేసింది. దీనిపై స్పందించకుండా ఇరుపార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరించాయి. తణుకు నియోజకవర్గం చివరికి ఎవరికి కేటాయిస్తారనే దానిపై సస్పెన్స్‌ అందరినీ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మిగతా నియోజకవర్గాలపై ఇలాంటి ప్రభావమే పడింది.

టీడీపీ ఇప్పటికే నియోజకవర్గాల వారీగా తన కేడర్‌ను అప్రమత్తం చేసి ఎన్నికల రంగంలో నిలిచే వీలుగా పార్టీ కార్యక్రమాలను ముమ్మరం చేసి ప్రజల వద్దే నేతలు, కార్యకర్తలు ఉండేలా జాగ్రత్తలు పడుతోంది. ఈ పరిస్థితిపై చాలా కాలం నుంచే రకరకాల వ్యూహాగానాలు, ప్రచారాలకు తోడు పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులపైన పొడచూపుతుంది. ఇలాంటి గందరగోళ పరిస్థితిని తట్టుకోలేకపోతున్నామని నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఇంకొంత కాలం ఓపిక పట్టాలని పదేపదే కోరుతుండడంతో సీనియర్‌ లీడర్లు సైలెంట్‌గా ఉన్నారు. ఏలూరులో రెండు నియోజకవర్గాల్లో, పశ్చిమ గోదావరిలో మూడింటిలో ఈ పొత్తు సస్పెన్స్‌ వేడెక్కించి కార్యకర్తలను కిర్రెక్కిస్తోంది. జనసేన, టీడీపీతోపాటు బీజేపీ పొత్తు ఉంటుందా, లేదా అనే దానిపై అధిష్టానాలు నిర్ణయించాల్సి ఉన్నా స్థానికంగా ఎవరి లెక్కలు వారేసుకుంటున్నారు. కైకలూరు వంటి నియోజకవర్గాల నుంచి ఇప్పటికే అన్ని పార్టీల్లోనూ అంతర్గత చర్చోపచర్చలు సాగుతూనే ఉన్నాయి.


ఫ్యాన్‌ కింద వేడి గాలి..

ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని అధికార వైసీపీలో కొందరి సీట్లు మారుస్తారనే ప్రచారం ఆ పార్టీలో అంతర్గత వేడి పుట్టిస్తోంది. ఓ వైపు తెలుగుదేశాన్ని బలంగా ఢీకొంటామని పైకి చెబుతున్నా అధికార పార్టీలో లోలోపల మాత్రం ఒకింత భయమే కనిపిస్తోంది. ఈ రెండు జిల్లాల్లోనూ పార్టీ పనితీరుపై ఈ మధ్యనే ఐప్యాక్‌ నివేదించినట్టు సమాచారం. ఎమ్మెల్యేలు కొందరిపై వ్యతిరేకత ఉన్నందున మార్పులు, చేర్పులు అవసరమన్నట్టు ఇప్పటికే ప్రచారం సాగుతోంది. డెల్టాలోని ఉండి నుంచి ఎప్పటి మాదిరిగానే పీవీఎల్‌ నరసింహరాజును కార్యరంగంలోకి దింపుతారా ? లేదా ? మరెవరినైనా కొత్త ముఖాన్ని ఎంపిక చేయబోతున్నారా ? అనే దానిపై తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఈ నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా ఉండడంతో గత సాధారణ ఎన్నికల్లోనూ వైసీపీ ఓటమి తప్పించు కోలేకపోయింది. ఈసారైనా అక్కడ పాగా వేసేందుకు ఎత్తుకు పైఎత్తులకు దిగు తుంది.

నిన్నమొన్నటి వరకు పాలకొల్లు నియోజకవర్గ కన్వీనర్‌గా ఉన్న జడ్పీ మాజీ చైర్మన్‌ కవురు శ్రీనివాస్‌ను పక్కకు తప్పించి ఆయన స్థానంలో కొద్ది రోజుల్లోనే వేరొకరిని నియమించబోతున్నారు. ఆయననే వచ్చే ఎన్నికల్లోనూ అభ్యర్థిగా రంగంలోకి దింపబోతున్నట్టు ఇప్పటికే పార్టీ వర్గాలు దాదాపు గుర్తించాయి. అధికారికంగా ఈ విషయాన్ని పార్టీ సమన్వయకర్త మిధున్‌రెడ్డిని అధికారికంగా ప్రకటించే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఈ విషయం పాలకొల్లు నియోజకవర్గం లోనూ కాక రేపింది. ఆచంటలోనూ దాదాపు ఇదే పరిస్థితి. అక్కడ ప్రస్తుత సిట్టింగ్‌ ఎమ్మెల్యే రంగనాథరాజును కొనసాగిస్తారా లేదా ఆయన పోటీ చేసేందుకు వీలుగా వేరే స్థానం కేటాయించి ఆచంటలో మరొకరికి అవకాశం ఇవ్వబోతున్నారా అనేది పార్టీలో ప్రచారం సాగుతూనే ఉంది.

మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలపైన రసవత్తర చర్చ నడుస్తోంది. వీరిద్దరిలో ఒకరిని ఎంపీ స్థానానికి రంగంలోకి దింపుతారని కొందరు, లేదు లేదు.. యథావిధిగా వారిద్దరే సిట్టింగ్‌ స్థానాల్లో పోటీ చేస్తారని ఇంకొందరు పరస్పర ప్రచారాలకు దిగుతున్నారు. ఈ పరిస్థితుల్లో వైసీపీకి సీనియర్లు ఎటూ తేల్చుకోలేక ప్రస్తుతానికి సైలెంట్‌గా ఉంటూ అంతా జగన్‌ దయ అంటూ లోలోన కామెంట్లు చేస్తున్నారు. ఏలూరు నుంచి ఆళ్ల నాని పోటీపై ఇదే రకమైన సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఈ రెండు జిల్లాల్లోనూ కొందరికి స్థానభ్రంశం తప్పదంటూ సాగుతున్న ప్రచారం వైసీపీలో కాక పుట్టిస్తోంది. ఒకవేళ టీడీపీ, జనసేనకు పొత్తు కుదిరితే ఏ రకమైన వ్యూహం అమలు చేయాలి, కొందరు బలమైన అభ్యర్థులను రంగంలోకి దించి ప్రస్తుత సిట్టింగ్‌లను కొందరిని పక్కకు తప్పిస్తారా అనే కోణంలోనూ ప్రచారం ఊపందుకుంది. భీమవరం నియోజకవర్గం నుంచి జనసేనాధిపతి పవన్‌ పోటీ చేస్తే యథావిధిగా ఆయనపై పోటీకి గ్రంధి శ్రీనివాస్‌ను రంగంలో కి దింపుతారా, లేక ఇంకెవరినైనా ఆలోచిస్తారా అనేదానిపైనా ఊహా గానాలు లేకపోలేదు. గోదావరి జిల్లాల్లో ఎన్నికల పొత్తును, ప్రధాన పార్టీల వ్యూహాలను మరింతగా మార్చే అవకాశాలు కనిపిస్తూనే ఉన్నాయి.

పందేలే.. పందేలు..

ఇప్పుడు ఎలాగూ కోడి పందేలు లేవు. ఈ మధ్యనే ఐపీఎల్‌ పోటీలు ముగిశాయి. ఇప్పుడు కొత్తగా ఎన్నికల పొత్తు అంటూ కుదిరితే ఏ నియోజకవర్గాలు ఏ ఏ పార్టీలు దక్కించుకుంటాయనే దానిపైనే కొందరు బెట్టింగ్‌లకు దిగుతున్నారు. ఇది కూడా అడ్వాన్స్‌ బెట్టింగ్‌లు కావడం విశేషం. పొత్తు కుదురుతుందని కొందరు, కుదరదని ఇంకొందరు లెక్కకట్టి మరీ బెట్టింగ్‌లకు దిగుతున్నారు. పశ్చిమగోదావరి నుంచి జనసేన అధినేత పవన్‌ పోటీ చేస్తారా, చేయరా అనేది కొందరు, జనసేన-టీడీపీ పొత్తులో ఉంటాయా, బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందా అని ఇంకొందరు, కాదుకాదు.. జనసేన-బీజేపీ మాత్రమే రంగంలోకి దిగబోతున్నాయంటూ మరికొందరు ఎవరికి తోచినట్టు వారు పందేలకు దిగుతున్నారు.

Updated Date - 2023-08-02T19:27:26+05:30 IST