Delhi Liquor Scam : సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎప్పుడేం జరిగింది.. పిన్ టూ పిన్ వివరాలివిగో..!

ABN , First Publish Date - 2023-03-08T12:05:01+05:30 IST

ఢిల్లీ లిక్కర్ స్కామ్.. ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఎక్కడ చూసినా.. ఎక్కడ విన్నా ఇదే పేరు వినిపిస్తోంది. ఇందులో పెద్ద తలకాయలు ఉండటంతో మరింత హాట్ టాపిక్‌గా మారింది..

Delhi Liquor Scam : సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎప్పుడేం జరిగింది.. పిన్ టూ పిన్ వివరాలివిగో..!

ఢిల్లీ లిక్కర్ స్కామ్.. (Delhi Liquor Scam) ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఎక్కడ చూసినా.. ఎక్కడ విన్నా ఇదే పేరు వినిపిస్తోంది. ఇందులో పెద్ద తలకాయలు ఉండటంతో మరింత హాట్ టాపిక్‌గా మారింది. ఈ కుంభకోణం బయటికి రావడం పెను సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అసలేం జరిగిందని నిగ్గు తేల్చేందుకు ఒకేసారి సీబీఐ (CBI), ఈడీ (ED) దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. ఈ స్కామ్‌లో నిందితులు, అనుమానితులను అదుపులోనికి తీసుకుని ఈడీ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఇక్కడే అసలు సీన్ మొదలైంది.. అసలు లిక్కర్ పాలసీ ఏంటి..? ఇది కాస్త స్కామ్‌గా ఎలా మారింది..? ఇందులో ఎవరెవరు ఉన్నారు..? ఇందులో సూత్రధారులెవరు..? పాత్రధారులెవరు..? అనే విషయాలన్నీ ఒక్కొక్కటిగా బయటికొచ్చాయి. సీన్ కట్ చేస్తే.. విజయ్ నాయర్‌ అరెస్ట్‌తో మొదలైన ఈ వ్యవహారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు (BRS MLC Kavitha) నోటీసులివ్వడం వరకూ వచ్చింది. ఈ స్కామ్‌లో ఎవరి ప్రమేయం ఎంత..? ఎవరికెన్ని ముడుపులు అందాయి..? ఇప్పటి వరకూ ఎన్ని అరెస్టులు జరిగాయి..? ఎవరెవరికి నోటీసులు ఇచ్చారు..? ఎంతమందిని అరెస్ట్ చేశారు..? అనే విషయాలన్నీ A to Z ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..

ఈడీకి ఎమ్మెల్సీ కవిత లేఖ..

ఫిబ్రవరి 9న విచారణకు హాజరు కావాలంటూ ఈడీ జారీ చేసిన నోటీసులపై ఎమ్మెల్సీ కవిత అధికారులకు లేఖ రాశారు. ప్రస్తుతం విచారణకు సమయం లేదని ఈడీని లేఖ ద్వారా కోరారు. ఈ నెల 15 తరువాత విచారణకు హాజరవుతానని వెల్లడించారు. ఢిల్లీలో ధర్నాకు ఏర్పాట్లు పూర్తయ్యాయని.. ఈ నెల 10న ఢిల్లీలో ధర్నా ఉందని.. అందుకే హాజరుకాలేకపోతున్నట్లు లేఖలో కవిత పేర్కొన్నారు. కాగా కవితపై 177 /A 120/ B , 7of PC Act కింద ఈడీ కేసులు నమోదు చేసింది. 17 ఆగస్టు 2022 లో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా కవితను అధికారులు విచారించనున్నారు.

కవిత ఇంటి వద్ద భారీ భద్రత..

ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఇంటి వద్ద భారీ భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. కవిత ఇంటికి వెళ్ళే రెండు రహదారులను బ్యారికేడ్లతో మూసివేశారు. కవిత ఇంటికి కార్యకర్తలు ఎవరు రావద్దని ఆదేశాలు జారీ చేశారు. జాగృతి కార్యకర్తలను బారికేడ్ల వద్దే పోలీసులు అడ్డుకుంటున్నారు. కాగా.. ఎల్లుండి జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద ఎమ్మెల్సీ కవిత నిరహార దీక్ష చేస్తారా? లేదా? అనే దానిపై ఓ క్లారిటీ వచ్చింది. ఆమె దీక్ష చేయనున్నారు. ఈ దీక్షను సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechuri) ప్రారంభించనున్నారు. దీక్షా కార్యక్రమంలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ పలు విపక్ష పార్టీలకు చెందిన నేతలు పాల్గొనున్నారు. కవిత దీక్షకు జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) హాజరుకానున్నారు. దీక్ష ముగింపునకు సీపీఐ కార్యదర్శి డి రాజా హాజరుకానున్నారు. కవిత దీక్షకు సంఘీభావంగా దేశంలోని 18 పార్టీలకు చెందిన నేతలు ఆయా పార్టీల బృందాలు పాల్గొననున్నాయి. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి దీక్షలో వివిధ మహిళా సంఘాలు, మహిళా హక్కుల కోసం పోరాడుతున్న సంస్థలు పాల్గొననున్నాయి. కవిత దీక్షకు ప్రత్యేకంగా రాజ్యసభ సభ్యుడు సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ హాజరుకానున్నారు.

కవిత ఢిల్లీలో ధర్నా డౌటే..

గురువారం నాడు కవిత ఢిల్లీలో చేపట్టనున్న ధర్నా జరగడం కష్టమేనని తెలుస్తోంది. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ల కోసం కవిత నిరాహార దీక్ష చేయనున్నారు. ఈ క్రమంలోనే మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం మార్చి10న జంతర్ మంతర్ వద్ద ధర్నాకు కవిత పిలుపునిచ్చారు. భారత జాగృతి ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంది. కవితకు ఈడి నోటీస్‌ల నేపథ్యంలో ధర్నా పై డైలమా చోటు చేసుకుంది.

నోటీసులపై కవిత రియాక్షన్..

రాజకీయ రంగంలో తగిన ప్రాతినిధ్యం కల్పించడానికి సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్నది మా డిమాండ్. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు మహిళా సంఘాలతో కలిసి భారత్ జాగృతి ఈ నెల 10న జంతర్ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్షను తలపెట్టింది. ఈ క్రమంలోనే మార్చి 9న ఢిల్లీలో విచారణకు రావాల్సిందిగా ఈడీ నాకు నోటీసులు జారీ చేసింది. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా నేను దర్యాప్తు సంస్థలకు పూర్తిస్థాయిలో సహకరిస్తాను. కానీ ధర్నా, ముందస్తు అపాయింట్‌మెంట్ల రీత్యా విచారణకు హాజరయ్యే తేదీపై న్యాయ సలహా తీసుకుంటాను. ఇలాంటి చర్యలతో బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీఎం కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని లొంగ తీసుకోవడం కుదరదని బీజేపీ తెలుసుకోవాలి. సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగాడుతూనే ఉంటాము. దేశ అభ్యున్నతి కోసం గొంతెత్తుతాము. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి తెలంగాణ ఎప్పటికీ తలవంచబోదని ఢిల్లీలో ఉన్న అధికారకంక్షపరులకు గుర్తుచేస్తున్నాను. ప్రజల హక్కుల కోసం ధైర్యంగా పోరాటం చేస్తాముఅని ప్రకటనలో కవిత తెలిపారు,

ప్రగతి భవన్‌కు కవిత..

నోటీసులు అందాక ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రగతి భవన్‌కు వెళ్లారు. ఈడీ నోటీసులు, విచారణపై సీఎం కేసీఆర్‌తో చర్చించనున్నారు. జంతర్ మంతర్ వద్ద ధర్నా నేపథ్యంలో ఈ సాయంత్రమే ఢిల్లీకి కవిత వెళ్లాల్సి ఉంది. కవిత అరెస్టుపై బీఆర్ఎస్‌లో ఊహాగానాలు వస్తున్నాయి. అరెస్టు అయితే ఢిల్లీ, తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు తెలిపేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

కవితకు నోటీసులు..

  • ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు

  • సీబీఐ FIR సెక్షన్స్ 477A, 120B, 7 of PC ACT కింద కేసులు

  • 2022 ఆగస్టు 17న సీబీఐలో నమోదైన FIR ఆధారంగా ఈడీ దర్యాప్తు

  • గతంలో కవితను విచారించిన సీబీఐ

  • 160 CRPC కింద సీబీఐ నోటీసులు

  • సీబీఐ FIR ఆధారంగా ECIR నమోదు చేసిన ఈడీ

***************************

ఇది కూడా చదవండి..

అవును కవిత బినామీలమే.. 420 కోట్లలో సగం ఆప్‌కు..!

***************************

చార్జిషీట్‌లో కవిత గురించి కీలక విషయాలు..

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha)కు నోటీసులు అందడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో తొలుత సమీర్ మహేంద్రు (Sameer Mahendru) అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి వరుసగా ఇప్పటి వరకూ 11 మంది అరెస్ట్ అయ్యారు. కాగా.. సమీర్ మహేంద్రు అరెస్ట్ సమయంలో ఈడీ ఛార్జ్ షీట్‌లో కీలక అంశాలు ప్రస్తావించింది. ఇప్పుడు అవి తెగ వైరల్ అవుతున్నాయి. లిక్కర్​ స్కాం ఈడీ చార్జ్ షీట్‌లో అరుణ్​ పిళ్లై (Arun Pillai) పాత్రపై కీలక సమాచారం ఉంది. కవిత తరుపున అరుణ్​ పిళ్లై అన్నీ తానై చూసుకున్నారని ఈడీ పేర్కొంది. అరుణ్‌తో వ్యాపారం చేస్తే తనతో చేసినట్లేనని కవిత పేర్కొనడం జరిగింది. దక్షిణాది నుంచి వందకోట్లు ముడుపులు ముట్టజెప్పారని ఈడీ పేర్కొంది. సమీర్​మహేంద్రుపై దాఖలు చేసిన చార్జీషీట్‌లో ఈడీ కవిత పేరును 28 సార్లు ప్రస్తావించింది. సౌత్​ గ్రూప్​ ప్రతినిధులుగా అరుణ్​ పిళ్లై, అభిషేక్​, బుచ్చిబాబు ఉన్నారు. పిళ్లై సూచనలతో ఇండో స్పిరిట్స్​ నుంచి ఆంధ్రప్రభ పబ్లికేషన్స్‌కు కోటి రూపాయలు, ఇండియా ఎహెడ్​సంస్థకు 70 లక్షల బదిలీ అయ్యాయి. ఇండో స్పిరిట్​ వ్యవహారాల్లో కవిత ప్రయోజనాలకు అరుణ్​ పిళ్లై ప్రాతినిధ్యం వహించారు. తమ తరుపున వాస్తవంగా పెట్టుబడి పెడుతున్నవారు కవిత, శరత్​ రెడ్డి, మాగుంట అని సమీర్​ మహేంద్రుకు అరుణ్​ పిళ్లై చెప్పారు.

ఇండోస్పిరిట్‌లో కవిత ఆసక్తి చూపుతున్నారని, ఆమె తరుపున తాను ప్రాతినిధ్యం వహిస్తున్నానని సమీర్‌కు అరుణ్​ పిళ్లై వెల్లడించారు. 2021లో ఢిల్లీలోని తాజ్​ మాన్​ సింగ్​ హోటల్‌లో విందు జరిగింది. అరుణ్​ పిళ్లై ద్వారా, ఫేస్​ టైంలో సమీర్​ మహేంద్రు, కవిత మాట్లాడుకున్నారు. ఇండో స్పిరిట్​ ఎల్1 దరఖాస్తు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అరుణ్​ పిళ్లై ద్వారా కవితతో సమీర్​ మహేంద్రు మాట్లాడారు. అరుణ్ తన కుటుంబ సభ్యుడు లాంటి వారని, అరుణ్​తో వ్యాపారం చేస్తే తనతో చేసినట్లేనని కవిత చెప్పారు. ఈ సంబంధాన్ని అనేక రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున విస్తరిస్తామని కవిత వెల్లడించారు.

ఎవరెవరు ఎప్పుడు అరెస్ట్ అయ్యారు..?

01. సెప్టెంబర్- 28న సమీర్ మహేంద్రు, ఇండో స్పిరిట్స్ సంస్థ యజమాని

02. నవంబర్- 11న పి. శరత్ చంద్రారెడ్డి, అరబిందో గ్రూప్ - ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్

03. నవంబర్- 11న బినొయ్ బాబు, పెర్నార్డ్ రిచర్డ్ కంపెనీ

4. నవంబర్- 13న అభిషేక్ బోయినపల్లి

5. నవంబర్- 13న విజయ్ నాయర్

6. నవంబర్- 29న అమిత్ అరోరా, బడ్డీ రిటెయిల్ సంస్థ డైరక్టర్

7. ఫిబ్రవరి- 8న గౌతమ్ మల్హోత్రా

8. ఫిబ్రవరి- 9న రాజేష్ జోషి, చారియట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్

9. ఫిబ్రవరి-11న మాగుంట రాఘవ

10. మార్చి- 2న అమన్ దీప్ దల్ సింగ్

11. మార్చి-6న అరుణ్ రామచంద్ర పిళ్ళై

ఈ ఏడాదిలో ఇలా...!

:- జనవరి 06 2023న స్పెషల్ కోర్టులో రెండో చార్జిషీట్‌ను దాఖలు చేసిన ఈడీ

:- ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేరును ప్రస్తావించి సమీర్ మహేంద్రుతో మాట్లాడినట్లు తేలింది..

:- ఫిబ్రవరి 08న ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును అరెస్టు చేసిన సీబీఐ.

:- ఫిబ్రవరి 25న సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్, దినేష్ అరోరా, అరుణ్ రామచంద్రన్ పిళ్ళై, అమిత్ అరోరా తదితరులను ఆస్తులను జప్తు చేసిన ఈడీ.

:- ఫిబ్రవరి 26న ఢిల్లీలో హైడ్రామా. మనీష్ సిసోడియాను 8 గంటలపాటు హెడ్ క్వార్టర్స్‌లో సుదీర్ఘంగా విచారించిన సీబీఐ. అదే రోజు సాయంత్రానికి అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటన.

పాలసీ ఎలా వచ్చింది..?

:- సెప్టెంబర్ 4, 2020 న కొత్త లిక్కర్ పాలసీ తయారీ కోసం ఎక్సైజ్ కమినర్ నేతృత్వంలోని కమిటీకి డిప్యూటీ సీఎం ఆదేశాలు.

:- జనవరి 5, 2021న లిక్కర్ పాలసీ పై సీఎం కేజ్రీవాల్ అధ్యక్షతన కేబినెట్ భేటీ. సిసోడియా, సత్యేంద్రజైన్, కైలాశ్ గెహ్లాట్‌తో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌ ఏర్పాటుకు నిర్ణయం.

:- మార్చి 22, 2021న రెండు నెలల తర్వాత నివేదికను సిద్ధం చేసిన కమిటీ. కేబినెట్ మీటింగ్‌లో సమర్పించడంతో దీని ప్రకారమే 2021-22 పాలసీ తయారు చేయాలని ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌కు కీలక ఆదేశాలు.

:- మే 21, 2021న కొత్త లిక్కర్ పాలసీకి కేజ్రీవాల్ కేబినెట్ ఆమోదం

ఇక్కడ్నుంచే అసలు కథ మొదలు..

:- నవంబర్ 8, 2021న ఫారిన్ లిక్కర్ ధరల విషయంలో సంబంధిత అథారిటీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే కేజ్రీవాల్ సర్కార్ నిర్ణయం తీసుకుందని లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సెనా ఆరోపణ.

:- జులై 20, 2022న పాలసీలో అన్నీ అవకతవకలు ఉన్నాయని.. ఇదంతా ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగేంచేలా నిర్ణయాలు ఉన్నాయని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు లెఫ్టినెంట్ గవర్నర్ లేఖ.

:- జులై 22, 2022న లేఖ పరిగణనలోనికి తీసుకుని సీబీఐ దర్యాప్తునకు కేంద్ర హోం శాఖ ఆదేశాలు.

:- ఆగస్టు 19, 2022న 15 పేర్లతో సీబీఐ ఎఫ్ఐఆర్.. ఇదే రోజు డిప్యూటీ సీఎం సిసోడియాతో పాటు 25 చోట్ల సోదాలు.

:- ఆగస్టు 22 న ఈడీ ఎంట్రీ, కేసు ఫైల్

:- సెప్టెంబర్ 6న లిక్కర్‌ స్కామ్‌లో ఆరోపణలు రావడంతో హైదరాబాద్‌లో ఉన్న అరుణ్ రామచంద్రన్ పిళ్లైకు చెందిన రాబిన్ డిస్టలరీస్, రాబిన్ డిస్ట్రిబ్యూటర్స్ కంపెనీలు.. నివాసంపైనా మొత్తం ఆరుచోట్ల ఈడీ సోదాలు

:- సెప్టెంబర్ 17న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు పర్సనల్ ఆడిటర్‌గా పనిచేసిన గోరంట్ల బుచ్చిబాబు నివాసం, ఆఫీసులో ఈడీ సోదాలు

:- సెప్టెంబర్ 22న మనీలాండరింగ్ ఆరోపణలపై అరబిందో ఫర్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డినిపై ఈడీ ప్రశ్నల వర్షం.

:- అక్టోబర్ 7న ముత్తా గౌతమ్‌ విచారణ, సంబంధింత ఆఫీసుల్లో సోదాలు

:- అక్టోబర్ 10న లిక్కర్ స్కామ్‌లో సంబంధాలున్నాయని బోయిన్‌పల్లి అభిషేక్‌ను అదుపులోనికి తీసుకున్న సీబీఐ.. అదే రోజు అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటన.

:- అక్టోబరు 12న ముత్తా గౌతమ్‌ అరెస్ట్

:- అక్టోబరు 17న డిప్యూటీ సీఎం సిసోడియాను ప్రశ్నించిన సీబీఐ అధికారులు.

:- నవంబరు 10న అరబిందో ఫార్మా శరత్‌చంద్రారెడ్డిని అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు.

:- నవంబరు 14న ఆప్‌కు చెందిన విజయ్ నాయర్, బోయిన్‌పల్లి అభిషేక్‌ అరెస్ట్.

:- నవంబరు 16న దినేశ్​ అరోరా అప్రూవర్‌గా మారడానికి ప్రత్యేక కోర్టు అనుమతి.

:- నంబర్ 25న ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో తొలి చార్జిషీట్‌ను మొత్తం10 వేల పేజీలతో సమర్పించిన సీబీఐ.

:- నవంబరు 26న లిక్కర్ కేసులో మనీ లాండరింగ్ ఉల్లంఘనల ఆరోపణలపై ఈడీ మొదటి చార్జిషీట్‌ ఫైల్.

:- నవంబరు 29న సౌత్ గ్రూపు కీలక పాత్ర పోషించినట్లు అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న ఈడీ.

:- నవంబర్ 29న తొలిసారి వెలుగులోకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు.. రెండు వేర్వేరు నెంబర్లతో మొత్తం పది మొబైల్ ఫోన్లను మార్చారని.. డిజిటల్ ఆధారాలు ధ్వంసం చేసినట్లు ఆరోపణలు

:- డిసెంబరు 6న విచారణకు రావాలని కవితకు సీబీఐ నోటీసు.

:- డిసెంబరు 11న కొన్ని అనివార్య కారణాలతో సీబీఐ విచారణకు హాజరుకాని కవిత.. అదే రోజున CRP 191 కింద మరో నోటీసు జారీ.

:- డిసెంబర్ 11న ఉదయం నుంచి సాయంత్రం వరకు కవిత నివాసంలోనే 6గంటలపాటు సీబీఐ విచారణ. సీబీఐ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని మీడియాకు వివరణ.

Updated Date - 2023-03-08T13:48:52+05:30 IST