Pawan Kalyan : వైసీపీకి ఊహించని షాక్.. జనసేనలో చేరిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు.. ఇలా జరిగిందేంటి..!?

ABN , First Publish Date - 2023-03-12T19:48:17+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే నేతలు జంపింగ్‌లు షురూ చేసేశారు. తమకు ఏ పార్టీలో అయితే అనుకూలంగా ఉంటుందో ఆ పార్టీ కండువాలు కప్పేసుకుంటున్నారు...

Pawan Kalyan : వైసీపీకి ఊహించని షాక్.. జనసేనలో చేరిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు.. ఇలా జరిగిందేంటి..!?

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే నేతలు జంపింగ్‌లు షురూ చేసేశారు. తమకు ఏ పార్టీలో అయితే అనుకూలంగా ఉంటుందో ఆ పార్టీ కండువాలు కప్పేసుకుంటున్నారు. ముఖ్యంగా టికెట్ ఇస్తామని పార్టీ భరోసా ఇస్తే సరే లేకుంటే.. ఏ పార్టీలో అయితే తమకు టికెట్ దక్కుతుందో ఆ గూటికి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే అధికార పార్టీ నుంచి పలువురు ముఖ్య నేతలు ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీలో (Telugudesam) చేరిపోతున్నారు. మరోవైపు.. బీజేపీ, కాంగ్రెస్ (BJP, Congress) నుంచి కూడా పలువురు కీలక నేతలు, ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నేతలు పసుపు కండువా కప్పుకుంటున్నారు. మరోవైపు జనసేనలో కూడా ఈ మధ్య చేరికలు మొదలయ్యాయి. తాజాగా ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan kalyan) సమక్షంలో కండువాలు కప్పుకున్నారు. ఇంతకీ వారెవరు..? వారి బ్యాగ్రౌండ్ ఏంటి..? అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

Janasena.jpg

ఇంతకీ ఎవరా మాజీ ఎమ్మెల్యేలు..!?

ఒంగోలు మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు (Edara Haribabu), కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు (TV Rama Rao) ఇద్దరూ పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వీరితో పలువురు ద్వితియ శ్రేణి నాయకులు కూడా జనసేన కండువా కప్పుకున్నారు. ఈదర హరిబాబు సీనియర్‌ నేత. తెలుగుదేశం స్థాపించిన తర్వాత పార్టీలో చేరి సుదీర్ఘకాలం పార్టీ కోసం అహర్నిశలు కృషిచేశారు. 1994లో ఒంగోలు (Ongole) నుంచి టీడీపీ తరఫున పోటీచేసిన ఆయన 19వేల 879 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత 2014లో ప్రకాశం జిల్లా జడ్పీ చైర్మన్‌గా పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరమైన ఈదర.. ఇప్పుడు మళ్లీ అభిమానులు, కార్యకర్తలు, అనుచరుల కోసం క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని భావించి.. జనసేన తీర్థం పుచ్చుకున్నారు. హరిబాబు చేరికతో నియోజకవర్గంలో జనసేనకు మంచిరోజులు వచ్చినట్లేనని.. పార్టీ మరింత బలోపేతం అవుతుందని కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. రానున్న ఎన్నికల్లో ఈయన ఎమ్మెల్యే టికెట్(MLA Ticket) ఇస్తానని పవన్ హామీ కూడా ఇచ్చారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Edara-Haribabu.jpg

జగన్ పట్టించుకోకపోవడంతో..!

ఇక టీవీ రామారావు విషయానికొస్తే..తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు (Kovvuru) నియోజకవర్గంలో ఓ వెలుగు వెలిగారీయన. 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసిన రామారావు గెలుపొందారు. 2014 ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆశించారు కానీ అధిష్టానం కనికరించలేదు. మళ్లీ 2019 ఎన్నికల్లో అయినా సీటు దక్కుతుందేమో అని ఆశపడ్డారు కానీ.. అవన్నీ అడియాసలే అయ్యాయి. టీడీపీ అధిష్టానంపై ఆగ్రహంతో ఇక సైకిల్‌కు టాటా చెప్పేసి వైసీపీ తీర్థం (YSRCP) పుచ్చుకున్నారు. 2019 ఎన్నికల్లో తానేటి వనితను (Taneti Vanitha) (ప్రస్తుతం జగన్ కేబినెట్‌లో హోం మంత్రి) గెలిపించుకుని వస్తే ఆశించిన పదవి ఇస్తానని మాటిచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. (YS Jagan Mohan Reddy) అధికారంలోకి వచ్చిన తర్వాత అస్సలు పట్టించుకోలేదట. అధికార పార్టీలో కొందరికే పదవులు కట్టబెడుతున్నారని.. తీవ్ర అసంతృప్తికి లోనైన టీవీ రామారావు ఇటీవలే వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. అభిమానులు, కార్యకర్తలతో సమావేశమైన ఆయన.. జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం నాడు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. అయితే టీడీపీ, వైసీపీలో జరిగిన అన్యాయం గురించి పవన్‌కు చెప్పడంతో రానున్న ఎన్నికల్లో కచ్చితంగా ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని హామీ ఇచ్చారని.. ఆ తర్వాతే రామారావు జనసేన తీర్థం పుచ్చుకున్నారని టాక్ నడుస్తోంది. ఈయన రాకతో కొవ్వూరులో జనసేన బలోపేతం అవుతుందని అధిష్టానం భావిస్తోంది.

Tv-Rama-Rao.jpg

మొత్తానికి చూస్తే.. జనసేనలో కూడా చేరికలు ఊపందుకుంటున్నాయి. ఈ చేరికలతో అటు వైసీపీ పెద్దలు.. ఇటు టీడీపీ పెద్దలు ఇలా జరిగిందేంటి..? అని ఆలోచనలో పడ్డారట. రానున్న రోజుల్లో టీడీపీ, వైసీపీ నుంచి టికెట్లు రావనుకునే సిట్టింగ్‌లు, మాజీలు కూడా తమ పార్టీలో చేరతారని అధిష్టానం ధీమాతో ఉందని తెలుస్తోంది. నాయకులు రావడం ఓకే.. కండువాలు కప్పడమూ ఓకే మరి వారికి ఏ మాత్రం ప్రాధాన్యత ఉంటుంది..? టికెట్లు ఇచ్చే పరిస్థితి ఉంటుందనే అసలు పాయింట్. రానున్న ఎన్నికల్లో పార్టీలో చేరిన వారికి జనసేన ఏ మాత్రం టికెట్ ఇస్తుందో వేచి చూడాల్సిందే మరి.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

KCR Health Condition : సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాల కీలక ప్రకటన.. సమస్యేంటో చెప్పిన డాక్టర్లు..

******************************

Big Breaking : సీఎం కేసీఆర్‌కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు.. అసలేం జరిగిందంటే..!


******************************

Breaking : సీఎం కేసీఆర్ సతీమణికి అస్వస్థత.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు

******************************
MLC Kavitha ED Enquiry : ఈడీ ఆఫీసు నుంచి కవిత ఎలా వచ్చారో చూడండి.. ఆమెను చూసి అంతా ఒక్కసారిగా.. ఫొటోలు వైరల్..!


******************************

Delhi Liquor Scam Case : ఇంకా అయిపోలేదు.. మళ్లీ రావాలంటూ కవితకు ఈడీ నోటీసులు..!


******************************

Updated Date - 2023-03-12T19:58:39+05:30 IST