Swastika symbol: 'స్వస్తిక్‌' గుర్తు తెచ్చిన తంటా.. సౌదీలో కటకటాల వెనక్కి తెలుగోడు..!

ABN , First Publish Date - 2023-05-19T07:35:51+05:30 IST

తెలుగు వారి ఇళ్లలో పూర్ణ కలశం, మామిడి ఆకుల తోరణం, స్వస్తిక్‌ గుర్తు సర్వసాధారణంగా కనిపిస్తాయి.

Swastika symbol: 'స్వస్తిక్‌' గుర్తు తెచ్చిన తంటా.. సౌదీలో కటకటాల వెనక్కి తెలుగోడు..!

ఇంటి గుమ్మంపై స్వస్తిక గుర్తు గీసినందుకు సౌదీలో జైలు పాలయిన ఆంధ్రుడు

నాజీ చిహ్నంగా జాతి దురంహకర కేసు నమోదు

ధార్మిక చిహ్నం, శుభానికి గుర్తుగా తెలియజేసే ప్రయత్నాలు

విడిపించేందుకు యత్నిస్తున్న సామాజిక కార్యకర్త ముజమ్మీల్‌

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి): పూర్ణ కలశకం, మామిడి ఆకుల తోరణం, స్వస్తిక్ గుర్తు ఉంటేనే కదా ఇల్లు.. ఇల్లుగా కనిపించేది. ఇంటి ప్రధాన ద్వారానికి స్వస్తిక్ గుర్తు గీయడం వలన వాస్తు, దిశ దోషాలు తొలగిపోవడంతో పాటు సకాలంలో అన్ని కోరికలు పూర్తవుతాయనేది ప్రగాఢ విశ్వాసం.. అందునా నూతనంగా విదేశాలకు వచ్చి ఉద్యోగంలో చేరిన వారికి ఇది మరింత అవసరం. కానీ, ఈ కారణంగా గల్ఫ్‌లో ఒక తెలుగు ఇంజినీర్ కటకటాలపాలయ్యాడు.

గుంటూరుకు నగరానికి చెందిన ఒకరు ఇటీవలే సౌదీ అరేబియాలో ఒక ప్రముఖ కంపెనీలో మెకానికల్ ఇంజినీర్‌గా ఉద్యోగంలో చేరారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఆయన అల్ ఖోబర్ నగరంలో ఒక ఫ్లాట్‌ను అద్దెకు తీసుకోని ఇప్పుడిప్పుడే నూతన దేశంలో సంసారాన్ని దిద్దుతున్నారు. శుభ సూచకంగా తన ఫ్లాటు ద్వారానికి ఆయన స్వస్తిక్ గుర్తును వేసారు. అయితే, అదే అపార్ట్‌మెంట్ నివసిస్తున్న ఒక స్ధానిక అరబ్బు జాతీయుడి దృష్టి దానిపై పడింది.

జర్మనీలో నాజీల గుర్తుగా అని పొరపాటుపడ్డ సదరు అరబ్బు దాన్ని తొలగించవల్సిందిగా కొత్తగా వచ్చిన కుటుంబాన్ని కోరాడు. తమకు నాజీ, హిట్లర్‌ల భావజాలంతో ఏలాంటి సంబంధం లేదని, ఇది తమ ధార్మిక చిహ్నమని వారు సమాధానం చెప్పారు. అయినా, సంతృప్తి చెందని అరబ్బు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆదివారం అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించి విచారిస్తున్నారు. ఇక అతని భార్య సహాయం కోసం అభ్యర్ధించిన వెంటనే తెలుగు సామాజిక కార్యకర్త, సాటా ప్రధాన కార్యదర్శి ముజమ్మీల్ శేఖ్ హుటాహుటిన 400 కిలో మీటర్ల దూరంలో ఉన్న అల్ ఖోబర్ నగరానికి చేరుకొని సాటా దమ్మాం శాఖ అధ్యక్షుడ తేజశ్వర రావు, ఐనాల అవినాష్, దిలీప్ కుమార్‌ల సహాయంతో ఆ కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. ప్రముఖ భారతీయ సామాజికసేవకుడు నాజ్ కూడా వీరికి సహయపడుతున్నారు. మరో రెండు రోజులలో అరెస్టయిన ఇంజినీర్ విడుదల కానున్నట్లుగా వారు పేర్కొన్నారు.

భారతీయ సంస్కృతి, హిందూ సంప్రదాయల గూర్చి తెలియని అరబ్బులు దీన్ని నాజీ చిహ్నంగా పొరపాటుబడుతారు. జాతి వివక్షకు సంబంధించే ఏ రకమైన చిహ్నాలు ప్రదర్శన సౌదీతో సహా గల్ఫ్ దేశాలన్నింటిలోనూ ‘మాదీ సామీయా’ ప్రకారం నేరం. హిట్లర్ పార్టీ చిహ్నాంగా ఉన్న స్వస్తిక్ గుర్తుకు మరియు భారతీయ సంప్రదాయ స్వస్తిక్ గుర్తకు 45 డిగ్రీల వ్యత్యాసం ఉన్నా దీన్ని సాధారణంగా ఎవరు గమనించరు. ఈ విషయమై గతంలో అనేక సార్లు పాశ్చత్య దేశాలలో పొరపాట్లు కూడా జరిగాయి. కానీ సౌదీ అరేబియాలో మాత్రం ఇది మొదటిసారి.

Telugu Techie Mysterious Death: అగ్రరాజ్యంలో ఘోరం.. ఆఫీస్‌కు వెళ్లి అదృశ్యమైన తెలుగు యువతి.. పక్క రాష్ట్రంలో శవంగా కనిపించింది!


Updated Date - 2023-05-19T10:41:42+05:30 IST