Gulf News: అయ్యో పాపం.. మృతదేహాల గుర్తింపు కూడా కష్టమే.. ఎన్నారై కుటుంబం సజీవదహనం కేసులో..!

ABN , First Publish Date - 2023-08-29T12:19:59+05:30 IST

సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ తెలుగు కుటుంబం సజీవదహనం అయిన సంగతి అందరికీ తెలిసిందే. వీరి మృతదేహాలు కూడా పూర్తిగా కాలిపోయాయి. అతి కష్టం మీద కొన్ని ఎముకలను మాత్రం సౌదీ పోలీసులు సేకరించగలిగారు. అయితే ఈ ఎముకలు ఎవరివి.? అన్నది కూడా గుర్తించేందుకు సౌదీ అరేబియా అధికారులకు ఇబ్బందిగా మారుతోంది.

Gulf News: అయ్యో పాపం.. మృతదేహాల గుర్తింపు కూడా కష్టమే.. ఎన్నారై కుటుంబం సజీవదహనం కేసులో..!

సౌదీలో రోడ్డు ప్రమాదం

నలుగురు తెలుగు ప్రవాసీయుల సజీవదహనం

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ తెలుగు కుటుంబం అంతా సజీవదహనం అయిన సంగతి అందరికీ తెలిసిందే. వీరి మృతదేహాల గుర్తింపులో కొత్త సమస్య తలెత్తింది. కారు మొత్తం అగ్నికి ఆహుతి అయిపోవడంతో మృతదేహాలు కూడా పూర్తిగా కాలిపోయాయి. అతి కష్టం మీద కొన్ని ఎముకలను మాత్రం సౌదీ పోలీసులు సేకరించగలిగారు. అయితే ఈ ఎముకలు ఎవరివి.? అన్నది కూడా గుర్తించేందుకు సౌదీ అరేబియా అధికారులకు ఇబ్బందిగా మారుతోంది. పూర్తివివరాల్లోకి వెళ్తే..

​అన్నమయ్య జిల్లా కలకడ మండలానికి చెందిన 35 ఏళ్ల దండు గౌస్ బాషా కువైత్‌లోని అమెరికన్ విశ్వవిద్యాలయంలో పని చేస్తుంటారు. ఇటీవల ఆయన కొత్తగా ఓ కారును కొనుగోలు చేశారు. పది రోజుల క్రితం అదే కారులో తన భార్య తబారక్ సర్వార్(31), నాలుగెళ్ళ కుమారుడు ఏహాన్, 8 నెలల కొడుకు దామీల్‌తో కలిసి కువైత్ నుంచి విజిట్ వీసాపై సౌదీకి వచ్చారు. మక్కా, మదీన పుణ్య క్షేత్రాలను కుటుంబమంతా కలిసి సందర్శించారు. ఆగస్టు 25వ తారీఖున శుక్రవారం నాడు సౌదీ నుంచి కువైట్‌కు వీరు అదే కారులో తిరుగు ప్రయాణమయ్యారు.

తిరిగి వేళ్లే క్రమంలో వీళ్లు ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఆ వాహనం ఢీకొట్టిన వెంటనే వీరు ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగాయి. దీంతో వీరిలో ఏ ఒక్కరూ కూడా తప్పించుకునే వీలు లేకుండా పోయింది. భార్యా పిల్లలంతా కారులోనే సజీవదహనం అయ్యారు. సౌదీ అరేబియాలో ఉండగానే జరిగిన ఈ ఘోర ప్రమాదంలో వీరి మృతదేహాల ఆనవాలు కూడా దొరక్కుండా పోయింది. అతి కష్టం మీద కొన్ని ఎముకలు మాత్రం కారులో లభ్యమయ్యాయి.

కాగా, మృతదేహాలు పూర్తిగా కాలిపోవడం.. కొన్ని ఎముకలు మాత్రమే లభ్యమవడంతో.. ఆ అస్తికలు ఎవరివో కూడా తేల్చడం సమస్యగా మారింది. ​మృతుల కుటుంబీకుల నుంచి బయోలజికల్ నమూనాలను సేకరించి డి.యన్.ఏ పరిక్ష ద్వారా వీరిని గుర్తించడానికి సౌదీ అరేబియా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ ఏలాంటి పత్రాలు సమర్పించడం లేదు. ఇదిలా ఉండగా, ప్రమాదం జరిగిన స్థలాన్ని ఏపీ ఎన్నార్టీ కో ఆర్డినేటర్, తెలుగు ప్రవాసీ సంఘం సాటా ప్రధాన కార్యదర్శి ముజ్జమ్మీల్, మలయాళీ సామాజిక సేవకుడు సిద్దీఖ్ సందర్శించారు.

Updated Date - 2023-08-29T12:24:19+05:30 IST