Share News

NRI: భారీ పెట్టుబడులే లక్ష్యంగా పియూష్ గోయెల్ సౌదీ పర్యటన.. మంత్రిని కలిసిన తెలుగు ప్రవాసీ ప్రతినిధులు

ABN , First Publish Date - 2023-10-25T12:00:33+05:30 IST

కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు మరియు పెట్టుబడుల వ్యవహారాల మంత్రి పియూష్ గోయెల్ రెండు రోజుల పర్యటన కొరకు సౌదీ అరేబియా వెళ్లారు.

NRI: భారీ పెట్టుబడులే లక్ష్యంగా పియూష్ గోయెల్ సౌదీ పర్యటన.. మంత్రిని కలిసిన తెలుగు ప్రవాసీ ప్రతినిధులు

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు మరియు పెట్టుబడుల వ్యవహారాల మంత్రి పియూష్ గోయెల్ రెండు రోజుల పర్యటన కొరకు సౌదీ అరేబియా వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి.. మరో దావోస్‌గా రూపుదిద్దుకొంటున్న రియాధ్ వార్షిక పెట్టుబడుల సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సులో పాల్గొనడానికి వెళ్లిన ఆయన సౌదీ అరేబియా రాజు కుమారుడు, పెట్రోలియం మంత్రి అయిన ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్, పెట్టుబడుల వ్యవహారాల మంత్రి ఖాలీద్ ఫల్హెలతో భేటీ అయ్యారు. అలాగే సౌదీ మరియు ఇతర ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వివిధ వ్యాపార దిగ్గజ్జాలతోనూ సమావేశమయ్యారు. ఇలా అధికారిక కార్యకలాపాలలో పూర్తిగా నిమగ్నమై ఉన్నా పియూష్ గోయెల్ మంగళవారం సాయంత్రం రియాధ్‌లోని భారత ఎంబసీ అవరణలో ప్రవాసీయులతో సమావేశమయ్యారు. సౌదీ అరేబియా రాజకుటుంబీకులు, ఇతర మంత్రులు భారతీయుల ఔన్నత్యం గురించి ప్రశంసిస్తుంటే గర్వంగా ఉందని, భారతీయుల ప్రతిష్ఠను ఇనుమడింపజేసిన ప్రధాని నరేంద్ర మోదీని కొనియాడారు.

Piyush-Goyal.jpg

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పియూష్ గోయెల్‌ను తెలుగు ప్రవాసీ సంఘం 'సాటా' ప్రతినిధులు ముజ్జమ్మీల్ శేఖ్, రంజీత్ చిట్లూరి, సుచరిత, శ్రీదేవి, గీతా శ్రీనివాస్ తదితరులు మర్యాదపూర్వకంగా కలుసుకుని అభినందించారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత సౌదీ అరేబియాతో సహా అంతర్జాతీయంగా రెట్టింపు అయిన భారతీయ ప్రతిష్ఠ రాజకీయాలకు అతీతంగా అందరికి గర్వకారణమని రంజీత్ చిట్లూరి అన్నారు. చిత్తూరు జిల్లా సోమల మండలానికి చెందిన రంజీత్ ఒక ప్రముఖ సంస్ధలో పని చేస్తున్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతానికి చెందిన తనలాంటి యువతకు విదేశాలలో సగర్వంగా పనిచేసే ఆవకాశం రావడానికి, గౌరవం దక్కడానికి గల అనేక కారణాలలో ప్రధాని మోదీ సమర్ధవంత విదేశాంగ విధానం చాలా ప్రధానమైనదని ఆయన అభిప్రాయపడ్డారు.

Updated Date - 2023-10-25T12:00:33+05:30 IST