Indian Embassy: కువైత్‌లోని భారతీయ నర్సులకు ఎంబసీ కీలక సూచన.. అలా చేయకపోతే పరాయి దేశంలో తిప్పలు తప్పవని హెచ్చరిక!

ABN , First Publish Date - 2023-10-06T07:54:53+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్‌లోని భారతీయ నర్సింగ్ స్టాఫ్‌కు రాయబార కార్యాలయం తాజాగా కీలక సూచనలు చేసింది. వాటిని పాటించకపోతే మాత్రం పరాయి దేశంలో తిప్పలు తప్పవని హెచ్చరించింది కూడా.

Indian Embassy: కువైత్‌లోని భారతీయ నర్సులకు ఎంబసీ కీలక సూచన.. అలా చేయకపోతే పరాయి దేశంలో తిప్పలు తప్పవని హెచ్చరిక!

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్‌లోని భారతీయ నర్సింగ్ స్టాఫ్‌ (Indian Nursing Staff) కు రాయబార కార్యాలయం తాజాగా కీలక సూచనలు చేసింది. వాటిని పాటించకపోతే మాత్రం పరాయి దేశంలో తిప్పలు తప్పవని హెచ్చరించింది కూడా. భారత ఎంబసీ (Indian Embassy) సూచన ప్రకారం నర్సింగ్/మెడికల్ సిబ్బంది అందరూ తప్పనిసరిగా ఉద్యోగ కాంట్రాక్టుకు సంబంధించిన రాతపూర్వక డాక్యుమెంట్‌ను కలిగి ఉండాలి. అది కూడా కువైత్ ఆరోగ్యమంత్రిత్వ శాఖ (Kuwait Ministry of Health) తో పాటు మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ అటెస్టేషన్ కలిగి ఉండాలి. అలాగే దానిపై భారత ఎంబసీ ఆమోదిత ముద్ర తప్పనిసరి అని సూచించింది. అంతేగాక ఆ కాంట్రాక్ట్ తాలూకు ఇంగ్లీష్ కాపీని ఎల్లప్పుడూ నర్సింగ్ స్టాఫ్ తమతో పాటు ఉండేలా చూసుకోవాలని తెలిపింది.

భారత రాయబార కార్యాలయం మరికొన్ని సూచనలు..

* వీసా-18లో ఉద్యోగం చేస్తున్న ప్రవాసులు వారి సివిల్ ఐడీలు/కాంట్రాక్ట్‌లలో ఉద్యోగ హోదా ప్రకారం మాత్రమే విధులు నిర్వహించాలి. మీరు ఏదైనా ఇతర పని చేయమని బలవంతం చేస్తే, పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్‌పవర్ (PAM)కి ఫిర్యాదు చేయాలని ఎంబసీ తెలిపింది.

* మీరు పనిలో చేరే హాస్పిటల్/క్లినిక్ అనేది చెల్లుబాటయ్యే ఆరోగ్యమంత్రిత్వ శాఖ (MoH) లైసెన్స్, నర్సింగ్ స్టాఫ్ కోసం MoH/PAM కోటా కలిగి ఉందని నిర్ధారించుకున్న తర్వాతే ఒక నిర్ణయానికి రావాలని పేర్కొంది.

* కువైత్‌లోని ఏదైనా నర్సింగ్ (అసిస్టెంట్ నర్సులు మొదలైన వాటితో సహా) ఉద్యోగానికి కువైత్ ఆరోగ్యశాఖ జారీ చేసిన చెల్లుబాటు అయ్యే నర్సింగ్ లైసెన్స్ తప్పనిసరి. ఈ లైసెన్స్ లేకుండా నర్సింగ్ సంబంధిత ఉద్యోగాన్ని అంగీకరించడం కువైత్ అధికారుల నుండి శిక్షార్హమైన చర్యను ఆహ్వానించినట్టే.

* మీ వృత్తికి సంబంధించిన విధులను మాత్రమే నిర్వహించండి. యజమాని/హాస్పిటల్/క్లినిక్ మీ వృత్తి ప్రకారం అధీకృతం కాని ఏవైనా ఇతర విధులను నిర్వహించమని మిమ్మల్ని బలవంతం చేస్తే, వెంటనే పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్‌పవర్ (PAM)కి ఫిర్యాదు చేయండి. అలాగే ఎంబసీ వాట్సాప్ (Whatsapp) హెల్ప్‌లైన్ (+965-65501769)ని కూడా సంప్రదించవచ్చు.

ఈ మేరకు బుధవారం ఇండియన్ ఎంబసీ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో సలహాను భారత ప్రవాసుల కోసం ప్రత్యేకంగా ప్రచురించడం జరిగింది. వీటిని పాటిస్తే పరాయి గడ్డపై ఎలాంటి ఇబ్బందలు లేకుండా సాఫీగా ఉద్యోగం చేసుకోవచ్చని కూడా తెలిపింది. ఇదిలాఉంటే.. సెప్టెంబర్ 12వ తేదీన కువైత్ సిటీలోని ఓ ప్రముఖ క్లినిక్‌పై సెక్యూరిటీ అధికారులు చేసిన తనిఖీలలో 34 మంది భారతీయ నర్సులను అదుపులోకి తీసుకున్నారు. ఈ 34 మంది భారత నర్సులను కువైత్ అధికారులు తాజాగా విడుదల చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నర్సులను విడిచిపెట్టారు. వారికి సంబంధించిన బంధువులు, యజమానులు ఉన్నతాధికారులను కలిసి వివరణ ఇవ్వడంతో భారతీయ నర్సులు విడుదలయ్యారు. వారంతా చట్టబద్ధంగానే దేశంలో ఉంటున్నట్లు ఉన్నతాధికారులకు వారి తాలూకు ధృవపత్రాలు చూపించడంతో విడిచిపెట్టారు. అంతకుముందు భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్, కువైత్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా వారి విడుదల కోసం జోక్యం చేసుకోవడం జరిగింది.

Kuwait: అన్నంత పని చేస్తున్న కువైత్.. 800 మంది ప్రవాసులు సర్వీస్ నుంచి తొలగింపు!

Updated Date - 2023-10-06T08:00:38+05:30 IST