Bilateral Trade in Rupee: యూఏఈ, భారత్‌ మధ్య ఆర్థిక లావాదేవీల్లో కీలక పరిణామం.. ఇకపై వాణిజ్య చెల్లింపులన్నీ లోకల్ కరెన్సీల్లోనే..!

ABN , First Publish Date - 2023-07-16T07:39:03+05:30 IST

గల్ఫ్‌ దేశం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ), భారత్‌ మధ్య ఆర్థిక లావాదేవీల్లో కీలక పరిణామం.

Bilateral Trade in Rupee: యూఏఈ, భారత్‌ మధ్య ఆర్థిక లావాదేవీల్లో కీలక పరిణామం.. ఇకపై వాణిజ్య చెల్లింపులన్నీ లోకల్ కరెన్సీల్లోనే..!

దిర్హామ్‌.. రూపాయి భాయీభాయీ

భారత్‌-యూఏఈ కరెన్సీ మధ్య నేరుగా లావాదేవీలు

ఇకమీదట వాణిజ్య కార్యకలాపాలన్నీ ఈ విధంగానే

యూపీఐతో ఆ దేశ చెల్లింపుల వ్యవస్థ ఐపీపీ లింక్‌

ప్రధాని మోదీ పర్యటనలో ఇరు దేశాల ఒప్పందం

అబుధాబిలో ఐఐటీ ఢిల్లీ క్యాంపస్‌ స్థాపనకు నిర్ణయం

యుద్ధ విమాన ఇంజన్‌ తయారీలో భారత్‌!

ఫ్రాన్స్‌ కంపెనీతో కలిసి డీఆర్‌డీవో సంయుక్త ప్రాజెక్టు

మోదీ పర్యటనలో ఇరు దేశాల ఒప్పందం

అబుధాబి, న్యూఢిల్లీ, జూలై 15: గల్ఫ్‌ దేశం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ), భారత్‌ మధ్య ఆర్థిక లావాదేవీల్లో కీలక పరిణామం. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులకు మరింత ఊపునిచ్చే ముఖ్యమైన ఒప్పందం కుదిరింది. దీనికోసం భారత యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ ఫేస్‌ (యూపీఐ)తో యూఏఈకి చెందిన చెల్లింపుల వ్యవస్థ ఇన్‌స్టాంట్‌ పేమెంట్‌ ప్లాట్‌ఫాం (ఐపీపీ)ను అనుసంధానం చేయనున్నారు. తద్వారా రెండు దేశాలు తమతమ కరెన్సీల్లో వాణిజ్య లావాదేవీలు నిర్వహించనున్నాయి. ఫ్రాన్స్‌ నుంచి తిరిగి వస్తూ శనివారం యూఏఈలో ఒక రోజు పర్యటనకు ఆగిన ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయేద్‌ అల్‌ నహ్యాన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వాణిజ్య లావాదేవీల్లో స్థానిక కరెన్సీ వినియోగంపై ఒప్పందం కుదిరింది. యూఏఈ సెంట్రల్‌ బ్యాంక్‌, భారత రిజర్వ్‌ బ్యాంక్‌ల మధ్య కుదిరిన ఈ ఒప్పందం అత్యంత కీలకమైనదని, విస్తృత ఆర్థిక సహకారానికి దారి చూపుతుందన్నారు. అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలను సులభతరం చేస్తుందని వివరించారు.

‘‘మన మధ్య బలమైన ఆర్థిక సహకారం, విశ్వాసానికి ఈ ఒప్పందం ప్రతీక. గత ఏడాది చేసుకున్న సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంతో రెండు దేశాల నడుమ వాణిజ్యం 20 శాతం పెరిగింది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా 85 బిలియన్‌ డాలర్లను దాటింది. త్వరలోనే 100 బిలియన్‌ డాలర్లకు చేరుతుంది. మనం తలచుకుంటే భారత్‌ ఆతిథ్యం ఇవ్వనున్న జి-20 సమావేశాల కంటే ముందే ఈ లక్ష్యాన్ని చేరొచ్చు’’ అని వ్యాఖ్యానించారు. మోదీ-అల్‌నహ్యాన్‌ మధ్య సమగ్ర చర్చల్లో వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన, ఆహార భద్రత, శాస్త్ర-సాంకేతిక, విద్య, ఫిన్‌టెక్‌, రక్షణ, భద్రతకు సంబంధించిన అంశాల్లో ఒప్పందాలు కుదిరాయి. కాగా, ఫ్రాన్స్‌ నుంచి యూఏఈకి చేరుకున్న మోదీకి రాజప్రాసాదం కసర్‌-అల్‌-వతన్‌లో అల్‌నహ్యాన్‌ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రఖ్యాత బుర్జ్‌ ఖలీఫా త్రివర్ణమయమైంది. మోదీకి అల్‌నహ్యాన్‌ పూర్తి శాకాహార వంటలతో కూడిన భోజనం ఏర్పాటు చేశారు.

కాప్‌ సదస్సుకు వస్తా..

ఈ ఏడాది చివర్లో అల్‌నహ్యాన్‌ అధ్యక్షతన యూఏఈలో జరిగే కాప్‌-28 సదస్సులో పాల్గొనేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు మోదీ తెలిపారు. శక్తివంచన లేకుండా శ్రమిస్తూ, నిత్యం అభివృద్ధిని కోరుకునే అల్‌ నహ్యాన్‌ నుంచి తాను ప్రతిసారి సోదర ప్రేమను పొందినట్లు ట్వీట్‌ చేశారు. ఆయనతో సమావేశం కావడం చిరస్మరణీయమని.. సాంస్కృతిక, ఆర్థిక బంధాల బలోపేతం సహా పలు రంగాలపై చర్చించినట్లుగా తెలిపారు. పరస్పర సంబంధాలకు పటిష్ఠ పునాది వేసిన మిమ్మల్ని ప్రతి భారతీయుడు నిజమైన స్నేహితుడిగా భావిస్తారని అల్‌నహ్యాన్‌కు తెలిపారు. కాగా, భారత్‌ వెలుపల రెండో ఐఐటీ ఏర్పాటు కానుంది. టాంజానియాలో క్యాంపస్‌ నెలకొల్పేందుకు మద్రాస్‌ ఐఐటీ ఇప్పటికే సిద్ధమవుతోంది. అబుధాబిలో ఢిల్లీ ఐఐటీ క్యాంపస్‌ స్థాపనకు మోదీ పర్యటనలో అంగీకారం కుదిరింది.

Kuwait: కువైత్‌లోని ప్రవాసులకు హెచ్చరిక.. అలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలంటూ మినిస్ట్రీ వార్నింగ్..!


Updated Date - 2023-07-16T07:39:03+05:30 IST