NRIs: అమెరికా విశ్వవిద్యాలయాలకు ఎన్నారైల భారీ విరాళాలు.. ఎవరెంత ఇచ్చారో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం!

ABN , First Publish Date - 2023-07-05T12:15:18+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో భారతీయ అమెరికన్ల (Indian Americans) హవా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

NRIs: అమెరికా విశ్వవిద్యాలయాలకు ఎన్నారైల భారీ విరాళాలు.. ఎవరెంత ఇచ్చారో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం!

ఎన్నారై డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలో భారతీయ అమెరికన్ల (Indian Americans) హవా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడ ఆ రంగం ఈ రంగం అని కాకుండా దాదాపు అన్ని రంగాల్లో మనోళ్లు దూసుకెళ్తున్నారు. ఐటీ, శాస్త్రసాంకేతికం, వైద్యం, రాజకీయం ఇలా ప్రతి రంగంలో ఇండో-అమెరికన్లు రాణిస్తున్నారు. దాంతో ఇప్పటికే చాలా మంది భారతీయ అమెరికన్లు వ్యాపారవేత్తలుగా, పేరొందిన వైద్యులుగా, లాయర్లుగా, పెద్ద కంపెనీల బాస్‌లుగా కొనసాగుతున్నారు. అలాంటి వారిలో కొందరు ప్రతిష్టాత్మకమైన అమెరికా విశ్వవిద్యాలయాలకు అగ్ర దాతలుగా కూడా మారారని తాజాగా వెలువడిన నివేదికల ద్వారా తెలిసింది. 'ఇండియాస్పోరా' (Indiaspora) అనే స్వచ్ఛంద సంస్థ నివేదిక ప్రకారం.. సుమారు 50 మంది ఇండో-అమెరికన్స్ అగ్రరాజ్యంలో ఉన్నత విద్య కోసం ఏకంగా 1.2 బిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చారు. ఇలా అక్కడి యూనివర్శిటీలకు భారీగా విరాళాలు అందించిన కొందరు ఎన్నారైల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

గురురాజ్ దేశ్‌పాండే..

గురురాజ్ దేశ్‌పాండే (Gururaj Deshpande ) ఒక వ్యవస్థాపకుడు. వెంచర్ క్యాపిటలిస్ట్. అతను మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (Massachusetts Institute of Technology) కి 20 మిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చాడు. ఈ డబ్బు దేశ్‌పాండే సెంటర్ ఫర్ టెక్నలాజికల్ ఇన్నోవేషన్‌ను స్థాపించడంలో సహాయపడింది. అలాగే కెనడాలోని యూనివర్శిటీ ఆఫ్ న్యూ బ్రున్స్విక్‌కి సైతం ఆయన 2.5 మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చారు.

మణి ఎల్. భౌమిక్..

మణి ఎల్.భౌమిక్ (Mani L Bhaumik) ఒక భౌతిక శాస్త్రవేత్త. ఆయన లాస్ ఏంజిల్స్ (Los Angeles) లోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో మణి ఎల్. భౌమిక్ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్ థియరిటికల్ ఫిజిక్స్‌ను స్థాపించాడు. ఈ సంస్థ థియరిటికల్ ఫిజిక్స్‌లో పరిశోధనలు నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా పరిశోధకులు, విద్యార్థులకు తనవంతు ప్రోత్సాహం అందిస్తుంది. భౌమిక్ UCLAలో థియరిటికల్ ఫిజిక్స్‌ను ప్రోత్సహించడానికి 2016లో 11 మిలియన్ డాలర్ల వరకు విరాళాలు అందించారు.

చంద్రికా టాండన్..

చంద్రికా టాండన్ (Chandrika Tandon) ఒక వ్యాపారవేత్త, సంగీత విధ్వాంసురాలు, ఆమె తన భర్త రంజన్ టాండన్‌తో కలిసి న్యూయార్క్ యూనివర్సిటీ (New York University) కి 100 మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చారు. వారి విరాళం ప్రధానంగా ఎన్‌వైయూ (NYU) లోని ఇంజనీరింగ్ పాఠశాలకు అందించారు. ఆపై దానిని ఎన్‌వైయూ టాండన్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్‌గా పేరు మార్చారు. అంతేగాక ఆమె పలు విద్యాసంస్థలతో కలిసి వివిధ బోర్డులలో సేవలు అందిస్తున్నారు.

కిరణ్ పల్లవి పటేల్..

డా. కిరణ్ పటేల్ (Kiran Patel) అతని భార్య పల్లవి పటేల్ (Pallavi Patel) ఫ్లోరిడాలోని నోవా సౌత్ ఈస్టర్న్ యూనివర్శిటీ (NSU)కి 50 మిలియన్ల డాలర్లు విరాళంగా ఇచ్చారు. ఒక మెడికల్ ఎడ్యుకేషన్ కాంప్లెక్స్‌లో 150 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టారు. పటేల్ సెంటర్ ఫర్ గ్లోబల్ సొల్యూషన్స్ అండ్ కాలేజ్ ఆఫ్ గ్లోబల్ సస్టైనబిలిటీ కోసం వారు సౌత్ ఫ్లోరిడా యూనివర్సిటీకి 30.5 మిలియన్ డాలర్లు విరాళంగా ఇవ్వడం జరిగింది.

ముకుంద్ పద్మనాభన్..

శాస్త్రవేత్త, పరిశోధకుడయిన ముకుంద్ పద్మనాభన్ (Mukund Padmanabhan) లాస్ ఏంజిల్స్ (Los Angeles) లోని కాలిఫోర్నియా యూనివర్సిటీకి 2.5 మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చారు. అలాగే ఇటీవల ఆయన మరో మూడు విరాళాలు (5లక్షల డాలర్ల చొప్పున) వివిధ విద్య సంస్థలకు ఇచ్చారు.

లక్ష్మీ మిట్టల్..

యూకే-ఆధారిత ఉక్కు వ్యాపారవేత్త అయిన లక్ష్మీ మిట్టల్ (Lakshmi Mittal) 2017లో హార్వర్డ్ యూనివర్సిటీ (Harvard University) కి 25 మిలియన్ డాలర్లు అందించారు. దక్షిణాసియాలో పరిశోధనపై దృష్టి సారించి లక్ష్మీ మిట్టల్ అండ్ ఫ్యామిలీ సౌత్ ఏషియా ఇన్‌స్టిట్యూట్‌గా పేరు మార్చిన సౌత్ ఏషియా ఇన్‌స్టిట్యూట్‌కి ఈ విరాళం సహాయ పడింది. తమ దాతృత్వం ద్వారా అమెరికాలో ఉన్నత విద్యకు సహాయం చేసిన మరికొంతమంది భారతీయ అమెరికన్లు.. విన్ గుప్తా, మదన్ లాల్ సొబ్తి చైర్, సుమిర్ చద్దా, మోంటే అహూజా, విజయ్ సంఘ్వీ, సునీల్ పురి, సతీష్ అండ్ యష్మిన్ గుప్తా, మోహిందర్ సాంభి, సికంద్ ఫ్యామిలీ తదితరులు ఉన్నారు.

NRI: అగ్రరాజ్యం అమెరికాలో విషాదం.. సముద్రంలో మునిగిపోతున్న పిల్లలను కాపాడుతూ తెలుగు ఎన్నారై మృతి!


Updated Date - 2023-07-05T12:16:58+05:30 IST