NRI: అగ్రరాజ్యం అమెరికాలో విషాదం.. సముద్రంలో మునిగిపోతున్న పిల్లలను కాపాడుతూ తెలుగు ఎన్నారై మృతి!

ABN , First Publish Date - 2023-07-05T10:38:42+05:30 IST

అగ్రరాజ్యం అమెరికా (America) లో విషాదం చోటు చేసుకుంది.

NRI: అగ్రరాజ్యం అమెరికాలో విషాదం.. సముద్రంలో మునిగిపోతున్న పిల్లలను కాపాడుతూ తెలుగు ఎన్నారై మృతి!

ఎన్నారై డెస్క్: అగ్రరాజ్యం అమెరికా (America) లో విషాదం చోటు చేసుకుంది. బీచ్‌లో మునిగిపోతున్న తన పిల్లలను కాపాడే క్రమంలో ఓ తెలుగు ఎన్నారై (NRI) ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని ఏపీలోని బాపట్ల జిల్లా అద్దంకి మండలానికి చెందిన వెంకట రాజేష్ కుమార్‌గా (Venkata Rajesh Kumar) గుర్తించారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు రాజేశ్ మృతిచెందినట్లు అతని తమ్ముడు పి విజయ్ కుమార్ (Vijay Kumar) తెలిపారు. కాగా, మృతుడు యూఎస్‌లోని ఓ స్టార్టప్‌లో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసింది. ఇక రాజేశ్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి సహాయం చేయాలని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్‌ (External Affairs Minister S Jaishankar) కు లేఖ రాశారు.

అందులో మృతుడి పాస్‌పోర్ట్ నెంబర్, ఇతర వివరాలను ఆయన తెలియజేశారు. మృతుడి సోదరుడు విజయ్ కుమార్ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఫ్లోరిడాలోని బ్రిడ్జ్ 7 వాటర్ కమ్యూనిటీలో నివసిస్తున్నారని చంద్రబాబు వెల్లడించారు. యూఎస్ ఇండిపెండెన్స్ డే అయిన జూలై 4వ తారీఖుున సెలవు రావడంతో రాజేశ్ ఫ్యామిలీ విహారయాత్ర కోసం ఫ్లోరిడాలోని జాక్సన్‌విల్లే బీచ్‌ (Jacksonville Beach) కు వెళ్లింది. కొద్దిసేపు కుటుంబం మొత్తం బీచ్‌లో సరదాగా గడిపారు. ఈ క్రమంలో పిల్లలు సముద్రంలో మరింత ముందుకు వెళ్లడాన్ని గమనించిన రాజేశ్ వారి వెనుకే పరిగెత్తి తన కుమారుడిని కాపాడేందుకు ప్రయత్నించాడు. ఈలోగా మరో పెద్ద అల వచ్చి రాజేష్‌ను లోపలికి లాక్కెళ్లిందని విజయ్ కుమార్ తెలిపాడు. ఇక రాజేష్ లోపలికి కొట్టుకుపోవడం గమనించిన సహాయక బృందాలు, తోటి పర్యాటకులు అతనిని రక్షించి ఒడ్డుకు చేర్చే సమయానికి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దాంతో అతడ్ని చికిత్స కోసం హూటాహూటిన హెలికాఫ్టర్‌లో హాస్పిటల్‌కి తరలించారు.

కాగా, ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడంతో తండ్రితో పాటు కుమారుడు కూడా స్పృహతప్పి పడిపోయాడని విజయ్ చెప్పుకొచ్చాడు. ఆస్పత్రిలో రాజేష్ కుమారుడు షాక్ ట్రీట్‌మెంట్‌కు స్పందించడంతో అతనికి వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. కానీ, రాజేష్ మాత్రం చనిపోయాడు. అతని మృతితో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. రాజేష్ స్వస్థలంలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. అతని మృతదేహాన్ని తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) స్వదేశానికి తరలించేందుకు ప్రయత్నిస్తోంది. అలాగే ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRTS) ని కూడా కుటుంబ సభ్యులు సంప్రదించారు.

Indian consulate in San Francisco: ఖలిస్థానీ వేర్పాటువాదుల దుశ్చర్య.. భారత కాన్సులేట్‌‌కు నిప్పు!


Updated Date - 2023-07-05T10:38:42+05:30 IST