US: భారతీయ విద్యార్థులకు షాక్.. ఎయిర్‌‌పోర్టు నుంచే 21 మందిని వెనక్కి పంపించేసిన అమెరికా.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2023-08-18T07:40:40+05:30 IST

కెరీర్‌ మీద ఎన్నో కలలతో ఉన్నత విద్యాభ్యాసం కోసం వారు అమెరికాలో అడుగు పెట్టారు. కానీ, ఎయిర్‌పోర్ట్‌లో దిగీ దిగగానే అక్కడి అధికారులు వారి పత్రాలు సరిగా లేవంటూ గంటలపాటు నిర్బంధించి, తిరిగి ఢిల్లీకి పంపించివేశారు.

US: భారతీయ విద్యార్థులకు షాక్.. ఎయిర్‌‌పోర్టు నుంచే 21 మందిని వెనక్కి పంపించేసిన అమెరికా.. అసలేం జరిగిందంటే..

ఉన్నత కెరీర్‌ కోసం అమెరికాకు 21 మంది విద్యార్థులు

విమానాశ్రయాల నుంచే వెనక్కి పంపిన అధికారులు

బాధితుల్లో విజయవాడ యువతి, కొందరు తెలుగువారు

న్యూఢిల్లీ, ఆగస్టు 17: కెరీర్‌ మీద ఎన్నో కలలతో ఉన్నత విద్యాభ్యాసం కోసం వారు అమెరికాలో అడుగు పెట్టారు. కానీ, ఎయిర్‌పోర్ట్‌లో దిగీ దిగగానే అక్కడి అధికారులు వారి పత్రాలు సరిగా లేవంటూ గంటలపాటు నిర్బంధించి, తిరిగి ఢిల్లీకి పంపించివేశారు. 21 మంది భారతీయ విద్యార్థులకు అమెరికాలోని పలు విమానాశ్రయాల్లో ఈ చేదు అనుభవం ఎదురైంది. వీరిలో విజయవాడకు చెందిన ఒక యువతితోపాటు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భారతీయ విద్యార్థులందరికీ అమెరికాలోని గుర్తింపు పొందిన మంచి యూనివర్సిటీల నుంచి అంతకుముందే అడ్మిషన్‌ దొరికింది. అమెరికా వీసా కూడా ఉంది. స్వదేశంలో తల్లిదండ్రులు, బంధుమిత్రుల నుంచి వీడ్కోలు తీసుకొని హుషారుగా అమెరికా చేరుకున్నారు. కానీ, ఇమిగ్రేషన్‌ చెక్‌ పూర్తి కాగానే అక్కడి అధికారులు వారి డాక్యుమెంటేషన్‌ (అధికారిక పత్రాలు) సరిగా లేవంటూ నిర్బంధించారు. విద్యార్థుల ఈమెయిళ్లు, సోషల్‌ మీడియా అకౌంట్లు తనిఖీ చేశారు. వారి సెల్‌ఫోన్లను, ల్యాప్‌టా్‌పలను స్వాధీనం చేసుకున్నారు. ఇరుకు గదుల్లో దాదాపు 16 గంటలకుపైగా కూర్చోబెట్టారు. తక్షణం తిరిగి వెళ్లిపోవాలని ఆదేశించారు. ఏమిటీ అన్యాయం అని ప్రశ్నించిన విద్యార్థులపై అధికారులు కన్నెర్ర చేశారు.

ఆదేశాలను పాటించకపోతే జైలుకు పంపుతామని హెచ్చరించారు. సమస్య గురించి స్వదేశంలో ఉన్న తమ తల్లిదండ్రులకు చెప్పుకొందామని ప్రయత్నిస్తే కూడా విద్యార్థులకు ఆ అవకాశం ఇవ్వలేదు. అట్లాంటా, షికాగో, శాన్‌ఫ్రాన్‌సిస్కోతోపాటు మరికొన్ని విమానాశ్రయాల్లో దిగి న భారతీయ విద్యార్థులకు ఈ దారుణ అనుభవం ఎదురైంది. వీరిని ఆయా విమానాశ్రయాల నుంచే అధికారులు తిరిగి ఢిల్లీకి పంపించారు. అమెరికాలో వీసా నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. ఒకసారి ఆ దేశం నుంచి అధికారులు వెనక్కి పంపిస్తే తర్వాత ఐదేళ్లపాటు అమెరికాకు వెళ్లటానికి అనుమతి లభించదు. అంటే, ఈ 21 మంది విద్యార్థులకు అమెరికా వెళ్లే అవకాశాలు ఐదేళ్లపాటు మూసుకుపోతాయి. గతంలో నకిలీ వర్సిటీలలో అడ్మిషన్‌ పొందిన విద్యార్థులను ఈ విధంగా వెనక్కి పంపిన ఉదంతాలు ఉన్నాయి. కానీ, ఈసారి భారతీయ విద్యార్థులు సెయింట్‌ లూయిస్‌, డకోటా స్టేట్‌ వంటి ప్రముఖ యూనివర్సిటీల్లో అడ్మిషన్‌ తీసుకున్నారు. అయినప్పటికీ, అవమానకరంగా తిప్పి పంపించటం ఏమిటని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఈమెయిళ్లు, చాట్‌లపై జాగ్రత్త!

అమెరికాలోకి అనుమతించే ముందే విద్యార్థి కుటుంబం ఆర్థిక స్థితిగతులను ఆ దేశ అధికారులు తనిఖీ చేస్తారనేది తెలిసిన విషయమే. ఆర్థికంగా బాగుంటేనే అనుమతిస్తారు. పలువురు విద్యార్థులు తొలుత అనుమతి కోసం బ్యాంక్‌ బాలెన్స్‌ వంటివి చూపిస్తారు. అమెరికా వెళ్లిన తర్వాత ఖర్చుల కోసం పార్ట్‌టైమ్‌ జాబులు చేస్తుంటారు. విద్యార్థుల పార్ట్‌టైమ్‌ జాబులపై ఆంక్షలు ఉంటాయి. ఈ నేపథ్యంలో, అమెరికాలో దిగిన విద్యార్థుల ఈ-మెయిళ్లలో, వాట్సాప్‌ చాట్‌లలో పార్ట్‌టైమ్‌ జాబుల గురించి సమాచారం ఉంటే, ఆ వివరాలు చూసి వెనక్కి పంపిస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. అలాగే, అమెరికాకు వెళ్లాక ఫీజులను తట్టుకోలేక, తక్కువ ఫీజులుండే వర్సిటీలకు, కాలేజీలకు విద్యార్థులు మారుతుంటారు. ఈ విషయం గురించి ముందే ఏమైనా సమాచారం తెలిసినా వెనక్కి పంపిస్తున్నారని తెలుస్తోంది.

Updated Date - 2023-08-18T07:40:40+05:30 IST