Mayavati: మాయకేమైంది? దళిత ఓటు బ్యాంక్ అంతా ఎటు పోయింది?

ABN , First Publish Date - 2023-04-03T20:33:53+05:30 IST

మాయావతి(Mayawati) ప్రభ క్రమంగా తగ్గుతూ వస్తోంది. 67 సంవత్సరాల మాయ గత పదేళ్లుగా ఉత్తరప్రదేశ్‌లోనే కాదు జాతీయ రాజకీయాల్లోనూ ఏ ప్రభావమూ చూపడం లేదు.

Mayavati: మాయకేమైంది? దళిత ఓటు బ్యాంక్ అంతా ఎటు పోయింది?
Mayawati

లక్నో: బహుజన్ సమాజ్ పార్టీ (Bahujan Samaj Party) అధినేత్రి ఉత్తరప్రదేశ్‌కు (Uttar Pradesh) నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మాయావతి(Mayawati) ప్రభ క్రమంగా తగ్గుతూ వస్తోంది. 67 సంవత్సరాల మాయ గత పదేళ్లుగా ఉత్తరప్రదేశ్‌లోనే కాదు జాతీయ రాజకీయాల్లోనూ ఏ ప్రభావమూ చూపడం లేదు.

2014 ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ గుజరాత్ నుంచి ఉత్తరప్రదేశ్‌ వారణాసికి మారడంతో యూపీ రాజకీయాల్లో హిందుత్వకు ప్రాధాన్యత పెరిగింది. వారణాసి నుంచి మోదీ గెలిచాక తన పట్టును కొనసాగించారు. ఉత్తరప్రదేశ్‌లో 80కి పైగా లోక్‌సభ స్థానాలు ఉండటంతో ఎక్కువ స్థానాలు గెలిచినవారిదే కేంద్రంలో హవా. దీంతో ఈసారి కూడా ఉత్తరప్రదేశ్‌పై కమలనాథులు పూర్తిగా ఫోకస్ చేశారు. దీనికి తోడు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా దూకుడుగా వ్యవహరిస్తుండటంతో బీజేపీకి తిరుగులేకుండా పోయింది. యూపీలో వరుసగా రెండుసార్లు అధికారం దక్కించుకున్న బీజేపీ కేంద్రంలోనూ వరుసగా రెండు సార్లు అధికారంలోకి రావడానికి యూపీ కీలకంగా మారింది. మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాని కావాలంటే కూడా ఉత్తరప్రదేశే కీలకం కానుంది.

2019 లోక్‌సభ ఎన్నికల్లో మాయావతి, అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుని మహాఘట్‌బంధన్ ఏర్పాటు చేసి బరిలోకి దిగింది. అయితే పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దళితులు, యాదవులు, ముస్లింల ఓట్లతో సులభంగా గెలుస్తామనుకున్న మహాఘట్‌బంధన్ కేవలం 15 స్థానాలు గెలుచుకుంది.

ఇప్పుడు 2024లో కూడా యూపీలో వీలైనన్ని ఎంపీ స్థానాలు గెలిచేలా వ్యూహాలు అమలు చేస్తున్నారు. 2024లో బీజేపీని గెలిపించేందుకు యోగి, మోదీ తీవ్ర కసరత్తు చేస్తున్నారు.

2014, 2019 లోక్‌సభ ఎన్నికలతో పాటు రెండుసార్లు యూపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ మాయావతి పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. చాలా సంవత్సరాలుగా మాయాకు తోడుగా నిలిచిన దళిత ఓటు బ్యాంక్ బీఎస్పీకి దూరమైంది. తన విమర్శలతో ప్రత్యర్థులను ఇరుకునపెట్టగలిగే సామర్థ్యం ఉన్నా మాయావతి మౌనంగా ఉంటున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీయేతర పార్టీలన్నీ ఏకమౌతున్నా మాయావతి ఉదాసీనంగా ఉంటున్నారు. బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీలకు దూరంగా ఉంటున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల నాటికైనా మాయావతి క్రియాశీలకంగా మారతారా లేక ఇలాగే మౌనంగా ఉంటారా అనేది రాజకీయ పరిశీలకులు కూడా అంచనావేయలేకపోతున్నారు.

Karnataka assembly polls: కర్ణాటకలో బీజేపీ గెలిచి తీరాల్సిందే... ఎందుకంటే?

Updated Date - 2023-04-03T21:16:03+05:30 IST