Panchayat Polls : మమత బెనర్జీని ఏకిపారేసిన దిగ్విజయ సింగ్

ABN , First Publish Date - 2023-07-10T09:13:17+05:30 IST

పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలు హింసాత్మకంగా జరగడంతో సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ సింగ్ (Digvijaya Singh) ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ (Mamata Banerjee)పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇది ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కాదని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలను పరిశీలిస్తే చాలా భయమేస్తోందని చెప్పారు.

Panchayat Polls : మమత బెనర్జీని ఏకిపారేసిన దిగ్విజయ సింగ్
Mamata Banerjee, Digvijaya Singh

న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలు హింసాత్మకంగా జరగడంతో సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ సింగ్ (Digvijaya Singh) ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ (Mamata Banerjee)పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇది ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కాదని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలను పరిశీలిస్తే చాలా భయమేస్తోందని చెప్పారు. ఎన్నికలకు ముందు, తర్వాత తారస్థాయిలో హింస జరిగిన నేపథ్యంలో ఆయన సోమవారం ట్విటర్ వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశారు.

పంచాయతీ ఎన్నికల పోలింగ్ శనివారం జరిగింది. ఈ ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి పోలింగ్ రోజున, ఆ తర్వాత పెద్ద ఎత్తున హింస జరిగింది. పోలింగ్ బూత్‌ల ఆక్రమణ, బ్యాలట్ బాక్సులను ఎత్తుకెళ్లడం, హత్యలు, దహనాలు వంటి సంఘటనలు జరిగాయి. దీంతో బీజేపీ తదితర పార్టీలు నిరసన వ్యక్తం చేశాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ 696 బూత్‌లలో పోలింగ్‌ను రద్దు చేసి, సోమవారం రీపోలింగ్ నిర్వహిస్తోంది. ముర్షీదాబాద్ జిల్లాలో 175, మాల్డాలో 112, నాడియా జిల్లాలో 89, ఉత్తర 24 పరగణాల జిల్లాలో 46, దక్షిణ 24 పరగణాల జిల్లాలో 36 పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ నిర్వహిస్తామని ఆదివారం ప్రకటించింది.

ఈ హింసాత్మక సంఘటనలపై సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ సింగ్ సోమవారం ట్విటర్ వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు క్షమించరానివని చెప్పారు. తాను ముఖ్యమంత్రి మమత బెనర్జీని ప్రశంసిస్తూ ఉంటానని, అయితే ప్రస్తుత పరిస్థితి మన ప్రజాస్వామ్యానికి మంచిది కాదని తెలిపారు.

‘‘బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో జరుగుతున్నది అత్యంత భయానకం. మమత బెనర్జీ ధైర్యసాహసాలు, దృఢ సంకల్పాలను నేను ప్రశంసిస్తూ ఉంటాను. కానీ జరుగుతున్నది మాత్రం క్షమించరానిది. సీపీఎం పాలనలో ఇటువంటి పరిస్థితిని మీరు ధైర్యంగా ఎదుర్కొన్నారని మాకు తెలుసు. కానీ ఇప్పుడు జరుగుతున్నది మాత్రం మన ప్రజాస్వామ్యానికి మంచిది కాదు’’ అని దిగ్విజయ సింగ్ ట్వీట్ చేశారు.

ఇదిలావుండగా, పంచాయతీ ఎన్నికల్లో హింసకు కారణం కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలేనని టీఎంసీ ఆరోపించింది. శనివారం పోలింగ్ సందర్భంగా తీవ్రమైన హింస జరిగింది. ఈ ఎన్నికల్లో 2.06 లక్షల మంది అభ్యర్థులు పోటీ చేశారు. 61,636 బూత్‌లలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మూడు అంచెల పంచాయతీ వ్యవస్థలో 73,887 స్థానాల కోసం ఈ ఎన్నికలు జరిగాయి.

పోలింగ్ జరిగిన శనివారం హింసాత్మక సంఘటనల్లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. బాంబు పేలుడులో గాయపడిన వ్యక్తి ఆదివారం మరణించారు. దీంతో జూన్ 9న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి మరణించినవారి సంఖ్య 38కి చేరింది. దీంతో ప్రతిపక్షాలు ఆదివారం పెద్ద ఎత్తున నిరసన తెలిపాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదివారం సమావేశమై 696 పోలింగ్ బూత్‌లలో సోమవారం రీపోలింగ్ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపింది.

ఈ రీపోలింగ్‌కు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి బీఎస్ఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఈస్టర్న్ కమాండ్) ఎస్‌సీ బుడకోటికి లేఖ రాశారు.

ఇవి కూడా చదవండి :

Tomatoes Free: స్మార్ట్‌ఫోన్‌ కొంటే 2 కిలోల టొమాటోలు ఫ్రీ!

ఈ వారమే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ?

Updated Date - 2023-07-10T09:13:17+05:30 IST