Odisha train accident : ఘోర రైలు ప్రమాద స్థలానికి చేరుకున్న మమత బెనర్జీ.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు సాయం..

ABN , First Publish Date - 2023-06-03T14:15:01+05:30 IST

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన స్థలానికి శనివారం చేరుకున్నారు.

Odisha train accident : ఘోర రైలు ప్రమాద స్థలానికి చేరుకున్న మమత బెనర్జీ.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు సాయం..

బాలాసోర్ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన స్థలానికి శనివారం చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితులను పరామర్శించారు. మీడియాతో మాట్లాడుతూ, ఈ ప్రమాదంలో మరణించిన పశ్చిమ బెంగాల్‌వాసుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. వీరికి రూ.10 లక్షలు నష్టపరిహారం చెల్లిస్తామని రైల్వే శాఖ చెప్పిందన్నారు.

మమత హౌరా జిల్లాలోని డుముర్జల నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఈ ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో గాయపడినవారిని పరామర్శించారు. ఆమె శుక్రవారం రాత్రి ఒడిశా ముఖ్యమంత్రి, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్‌తో ఫోన్‌ ద్వారా మాట్లాడారు. బాధితులకు సహాయం, చికిత్సకు సంబంధించి అన్ని విధాలుగా సహాయపడతామని హామీ ఇచ్చారు. శుక్రవారం రాత్రి ఓ బృందాన్ని బాలాసోర్‌కు పంపించారు.

మోదీ పరామర్శ

రైలు ప్రమాదంపై సమీక్షించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయన పరిస్థితిని స్వయంగా సమీక్షించేందుకు, సహాయ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు శనివారం ఈ ప్రమాద స్థలానికి చేరుకోబోతున్నారు. మొదట ప్రమాద స్థలాన్ని సందర్శించి, ఆ తర్వాత కటక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శిస్తారు.

ఒడిశాలోని బాలాసోర్ జిల్లా, బహనాగా బజార్ స్టేషన్ సమీపంలో శుక్రవారం సాయంత్రం 6.55 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఈ దారుణం జరిగింది. బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ మొదట పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది. ఈ రైలు బోగీలు పక్కనే ఉన్న పట్టాలపై పడ్డాయని, ఆ తర్వాత షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పి, బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌పై పడిందని, అంతేకాకుండా ఆ పక్కనే పార్క్ చేసి ఉన్న ఓ గూడ్స్ రైలుపై పడిందని తెలుస్తోంది. ఇదంతా కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే జరిగిందని చెప్తున్నారు. కోల్‌కతాకు దక్షిణ దిశలో 250 కిలోమీటర్ల దూరంలో, భువనేశ్వర్‌కు ఉత్తర దిశలో 170 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడానికి కారణాలేమిటో ఇంత వరకు తెలియడం లేదు. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 290కి చేరిందని, గాయపడినవారి సంఖ్య 1,000 దాటిందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి :

Odisha Train Accidnt : రైలు ప్రమాదం కారణంగా నేడు, రేపు రద్దైన రైళ్లు ఏవంటే...

Odisha Train Accident : అత్యంత విషాదకర రైలు ప్రమాదం.. సంతాప దినాలు ప్రకటించిన తమిళనాడు, ఒడిశా ప్రభుత్వాలు..

Updated Date - 2023-06-03T14:15:01+05:30 IST