Odisha Train Accident : అత్యంత విషాదకర రైలు ప్రమాదం.. సంతాప దినాలు ప్రకటించిన తమిళనాడు, ఒడిశా ప్రభుత్వాలు..

ABN , First Publish Date - 2023-06-03T09:04:53+05:30 IST

భారతీయ రైల్వేల చరిత్రలో అత్యంత విషాదకర రైలు ప్రమాదం శుక్రవారం జరిగింది. బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, ఓ గూడ్స్ రైలు ఈ ప్రమాదంలో చిక్కుకున్నాయి.

Odisha Train Accident : అత్యంత విషాదకర రైలు ప్రమాదం.. సంతాప దినాలు ప్రకటించిన తమిళనాడు, ఒడిశా ప్రభుత్వాలు..

భువనేశ్వర్ : భారతీయ రైల్వేల చరిత్రలో అత్యంత విషాదకర రైలు ప్రమాదం శుక్రవారం జరిగింది. బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, ఓ గూడ్స్ రైలు ఈ ప్రమాదంలో చిక్కుకున్నాయి. ఒడిశాలోని బాలాసోర్ జిల్లా, బహంగా బజార్ స్టేషన్ సమీపంలో శుక్రవారం సాయంత్రం 6.55 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఈ దారుణం జరిగింది. ఈ దారుణ సంఘటనలో దాదాపు 233 మంది ప్రాణాలు కోల్పోయినట్లు, సుమారు 900 మంది గాయపడినట్లు తెలుస్తోంది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు హుటాహుటిన రంగంలోకి దిగి, సహాయ కార్యక్రమాలను నిర్వహించాయి.

మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు స్థానికులు చెప్తున్నారు. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం శనివారం అన్ని కార్యక్రమాలను రద్దు చేసింది. ఈ ఘోర ప్రమాదం దృష్ట్యా మృతుల ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ శనివారం సంతాప దినంగా పాటిస్తున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా తమిళనాడులో కూడా ఒక రోజు సంతాప దినంగా పాటిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు.

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ, జాతీయ విపత్తు స్పందన దళం (NDRF) బృందాలకు ధన్యవాదాలు తెలిపారు. బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదం నేపథ్యంలో హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టి, చురుగ్గా సహాయపడుతున్నందుకు ఎన్‌డీఆర్ఎఫ్ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. సహాయక చర్యలపైనే తాము ముఖ్యంగా దృష్టి సారించామని చెప్పారు. జిల్లా అధికార యంత్రాంగం నుంచి అనుమతి వచ్చిన తర్వాత పునరుద్ధరణ చర్యలు ప్రారంభమవుతాయని చెప్పారు. అత్యున్నత స్థాయి దర్యాప్తు నిర్వహిస్తామని, అదేవిధంగా రైల్వే భద్రతా కమిషనర్ స్వతంత్ర దర్యాప్తు చేస్తారని తెలిపారు. అంతకుముందు ఆయన ప్రమాదానికి గురైన రైలు బోగీలను క్షుణ్ణంగా పరిశీలించారు. సంఘటనా స్థలంలో అన్ని వైపులా నడుచుకుంటూ వెళ్లి పరిశీలించారు.

ఇదిలావుండగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ (West Bengal chief minister Mamata Banerjee) శనివారం సంఘటన స్థలానికి చేరుకుంటారని తెలుస్తోంది.

కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడానికి కారణాలేమిటో ఇంత వరకు తెలియడం లేదు. బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ మొదట పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది. ఈ రైలు బోగీలు పక్కనే ఉన్న పట్టాలపై పడ్డాయని, ఆ తర్వాత షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పి, బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌పై పడిందని, అంతేకాకుండా ఆ పక్కనే పార్క్ చేసి ఉన్న ఓ గూడ్స్ రైలుపై పడిందని తెలుస్తోంది. ఇదంతా కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే జరిగిందని చెప్తున్నారు. కోల్‌కతాకు దక్షిణ దిశలో 250 కిలోమీటర్ల దూరంలో, భువనేశ్వర్‌కు ఉత్తర దిశలో 170 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది.

ఇవి కూడా చదవండి :

Odisha Train Accidnt : రైలు ప్రమాదం కారణంగా నేడు, రేపు రద్దైన రైళ్లు ఏవంటే...

Odisha Train Accident : ఒడిశా రైలు ప్రమాదంలో 233కు చేరిన మృతుల సంఖ్య

Updated Date - 2023-06-03T09:04:53+05:30 IST