Army vs Terrorists: ఉగ్రవాదిని ఎన్‌కౌంటర్ చేసిన భద్రతా బలగాలు

ABN , First Publish Date - 2023-09-16T11:02:30+05:30 IST

జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. బుధవారం ప్రారంభమైన ఈ ఎన్‌కౌంటర్ శనివారంతో నాలుగో రోజుకు చేరుకుంది.

Army vs Terrorists: ఉగ్రవాదిని ఎన్‌కౌంటర్ చేసిన భద్రతా బలగాలు

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. బుధవారం ప్రారంభమైన ఈ కాల్పులు శనివారంతో నాలుగో రోజుకు చేరుకున్నాయి. బారాముల్లా జిల్లాలో గల నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) సమీపంలో శనివారం భద్రతా దళాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులు ట్విట్టర్(ఎక్స్) ద్వారా అధికారికంగా ప్రకటించారు. అనంత్‌నాగ్ జిల్లాలో కొండ ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో స్థావరాలను ఏర్పరచుకున్న ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు చేపట్టిన ఆపరేషన్‌లో భాగంగా ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని పేర్కొన్నారు. అయితే చనిపోయిన ఉగ్రవాది పేరు, అతను ఏ ఉగ్రవాద సంస్థకు చెందిన వాడనే వివరాలు ఇంకా తెలియరాలేదు. బారాముల్లా జిల్లాలోని ఉరి, హత్లాంగా ఫ్వార్వర్డ్ ఏరియాలో తీవ్రవాదులు, ఆర్మీ మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయని మొదటగా పోలీసులు ఎక్స్‌లో ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్ చేసిన 20 నిమిషాల తర్వాత మరో ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లోనే భద్రతాబలగాలు ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టినట్టు ప్రకటించారు. ఇంకా సెర్చింగ్ కొనసాగుతుందని, మరిన్ని వివరాలు తెలియజేస్తామని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Updated Date - 2023-09-16T11:02:30+05:30 IST