BBC Documentary : మోదీపై డాక్యుమెంటరీని కేంద్రం నిషేధించడంపై సుప్రీంకోర్టు విచారణ

ABN , First Publish Date - 2023-01-30T12:10:55+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)పైనా, 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్లపైనా రూపొందించిన

BBC Documentary : మోదీపై డాక్యుమెంటరీని కేంద్రం నిషేధించడంపై సుప్రీంకోర్టు విచారణ
Supreme Court

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)పైనా, 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్లపైనా రూపొందించిన బీబీసీ డాక్యుమెంటరీని భారత దేశంలో నిషేధించడంపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించింది. అడ్వకేట్ ఎంఎల్ శర్మ (Advocate ML Sharma) దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)పై ఫిబ్రవరి 6న విచారణ జరుపుతామని తెలిపింది. ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన లింకులతో ఇచ్చిన ట్వీట్లను తొలగించడాన్ని సవాల్ చేస్తూ సీనియర్ జర్నలిస్ట్ ఎన్ రామ్, అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన పిటిషన్లపై కూడా అత్యున్నత న్యాయస్థానం సోమవారం విచారణ జరపబోతోంది.

‘ఇండియా : ది మోదీ క్వశ్చన్’ డాక్యుమెంటరీని నిషేధించడం దురుద్దేశపూర్వకం, నిరంకుశం, రాజ్యాంగ విరుద్ధం అని ఎంఎల్ శర్మ తన పిటిషన్‌లో ఆరోపించారు. దీనిపై విచారణ జరిపేందుకు భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ డీవై చంద్రచూడ్ (DY Chandrachud) అంగీకరించారు. ఫిబ్రవరి ఆరున విచారణ జరుపుతామన్నారు.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ డాక్యుమెంటరీని ప్రసారం చేయరాదని, దీనికి సంబంధించిన లింకులతో కూడిన ట్వీట్లను కూడా తొలగించాలని సామాజిక మాధ్యమాలకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇది కేవలం ప్రచారం కోసం రూపొందించిన డాక్యుమెంటరీ అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనిలో నిష్పాక్షికత లేదని, కేవలం వలసవాద మనస్తత్వం మాత్రమే కనిపిస్తోందని తెలిపింది.

ఈ విధంగా నిషేధించడం భారత రాజ్యాంగంలోని అధికరణ 19(1)(ఏ) ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యం హక్కులను ఉల్లంఘించడమేనని పిటిషనర్లు ఆరోపించారు.

Updated Date - 2023-01-30T12:10:58+05:30 IST