Rahul Gandhi Vs Rajnath Singh : రాహుల్ గాంధీకి శిక్షపై రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-03-23T16:58:50+05:30 IST

దొంగల ఇంటి పేరు మోదీ అని ఉండటం ఆశ్చర్యంగా ఉందన్న రాహుల్ గాంధీకి రెండేళ్ళ జైలు శిక్ష పడిన నేపథ్యంలో రక్షణ మంత్రి

Rahul Gandhi Vs Rajnath Singh : రాహుల్ గాంధీకి శిక్షపై రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలు
Rahul Gandhi , Rajnath Singh

న్యూఢిల్లీ : దొంగల ఇంటి పేరు మోదీ అని ఉండటం ఆశ్చర్యంగా ఉందన్న రాహుల్ గాంధీకి రెండేళ్ళ జైలు శిక్ష పడిన నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Defence Minister Rajnath Singh) గురువారం స్పందించారు. ఆయుధాల కన్నా మాటలు ప్రాణాంతకమైనవని గుర్తించాలని రాహుల్ గాంధీకి హితవు పలికారు.

రాహుల్ గాంధీ 2019లో కర్ణాటకలో మాట్లాడుతూ, దొంగలందరికీ ఇంటి పేరు మోదీ ఎలా అవుతోందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ(BJP MLA Purnesh Modi) పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన సూరత్ జిల్లా కోర్టు రాహుల్ గాంధీని దోషిగా నిర్థరించి, రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అపీలు చేసుకోవడానికి అనుమతిస్తూ, ఈ తీర్పు అమలును 30 రోజులపాటు నిలిపివేసింది. ఈ తీర్పును పూర్ణేశ్ మోదీ స్వాగతించారు. పరువు నష్టం కేసు(defamation case)లో తనకు రెండేళ్ల జైలు శిక్ష పడటంపై రాహుల్ గాంధీ స్పందించారు. సత్యమే తనకు గురువని చెప్పారు. తన ధర్మం సత్యం, అహింసలపై ఆధారపడిందన్నారు.

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మ్లలికార్జున ఖర్గే (Mallikharjun Kharge) మాట్లాడుతూ, ఇలా చేస్తారని తాము ముందే ఊహించామన్నారు. రాహుల్ నోరు నొక్కడానికే ఇలా చేశారని విమర్శించారు. ఈ కేసును విచారించే న్యాయమూర్తులను పదే పదే మార్చారన్నారు. తమకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందన్నారు. చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా (Congress General Secretary Priyanka Gandhi Vadra) మాట్లాడుతూ, తన సోదరుడు భయపడే రకం కాదని, భయపడబోడని చెప్పారు. నిజం చెప్పడమే అలవాటని, నిజమే చెబుతామని అన్నారు. రాహుల్ నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భాగేల్ (Chhattisgarh CM Bhupesh Baghel), రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్(Rajasthan CM Ashok Gehlot) స్పందిస్తూ, బీజేపీ రాహుల్ గొంతు నొక్కే యత్నం చేస్తోందని విమర్శించారు.

రాజ్‌నాథ్ సింగ్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, కత్తితో చేసిన గాయం కన్నా మాటల వల్ల జరిగే గాయం చాలా లోతుగా ఉంటుందని రాహుల్ గాంధీ అంగీకరించాలని చెప్పారు. ఈ సంఘటన ద్వారా మనమంతా ఓ విషయం నేర్చుకోవాలన్నారు. బహిరంగంగా మాట్లాడేటపుడు లక్ష్మణ రేఖను దాటకుండా జాగ్రత్తవహించాలన్నారు.

బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ (Ravi Shankar Prasad) కూడా రాహుల్ గాంధీకి విధించిన శిక్షపై స్పందించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. న్యాయ వ్యవస్థను కూడా తన జేబులో వేసుకోవాలని కాంగ్రెస్ కోరుకుంటోందన్నారు.

ఇవి కూడా చదవండి :

Modi surname: ఊహించని పరిణామం... రాహుల్‌కు మద్దతుగా నిలిచిన కేజ్రీవాల్

RJD Leader : శ్రీకృష్ణుడు స్వప్నంలో దర్శనమిచ్చాడు : తేజ్ ప్రతాప్ యాదవ్

Updated Date - 2023-03-23T16:58:50+05:30 IST