Parliament Session: నూతన భవనంలో లోక్‌సభ సమావేశాలు ప్రారంభం.. భారత రాజ్యంగంతో పార్లమెంట్‌లో అడుగుపెట్టిన అధీర్ రంజన్ చౌదరి

ABN , First Publish Date - 2023-09-19T13:39:49+05:30 IST

కొత్త పార్లమెంట్ కొలువుదీరింది. నూతన పార్లమెంట్‌లో లోక్‌సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. పాత పార్లమెంట్‌లో ఫోటో సెషన్ ముగిసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీతో సహా ఎంపీలంతా నూతన పార్లమెంట్‌లో అడుగుపెట్టారు.

Parliament Session: నూతన భవనంలో లోక్‌సభ సమావేశాలు ప్రారంభం.. భారత రాజ్యంగంతో పార్లమెంట్‌లో అడుగుపెట్టిన అధీర్ రంజన్ చౌదరి

ఢిల్లీ: కొత్త పార్లమెంట్ కొలువుదీరింది. నూతన పార్లమెంట్‌లో లోక్‌సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. పాత పార్లమెంట్‌లో ఫోటో సెషన్ ముగిసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీతో సహా ఎంపీలంతా నూతన పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. ఎంపీలంతా పాత భవనం నుంచి కొత్త భవనకు వరకు పాదయాత్రగా వెళ్లారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, నితిన్ గడ్కరీ, ఇతర సభ్యులు కొత్త పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. అలాగే లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అయినా నాయకుడు అధీర్ రంజన్ చౌదరి, ఎంపీలు రాహుల్ గాంధీ, గౌరవ్ గొగోయ్ తదితరులు మధ్యాహ్నం లోక్‌సభ సమావేశాల నిమిత్తం పార్లమెంటు కొత్త భవనంలోకి ప్రవేశించారు. కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు కొత్త భవనంలోకి ప్రవేశించినప్పుడు అధీర్ రంజన్ చౌదరి భారత రాజ్యాంగాన్ని తన చేతుల్లో పట్టుకుని కనిపించారు.


కాగా నూతన పార్లమెంట్‌లో అడుగుపెట్టడానికి కొన్ని గంటల ముందు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులంతా పాత భవనం లోపలి ప్రాంగణంలో సమావేశమయ్యారు. అందరూ కలిసి గ్రూప్ ఫోటో దిగారు. ఆ తర్వాత లోక్‌సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు వేర్వేరుగా గ్రూఫ్ ఫోటోలకు పోజులిచ్చారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, హెచ్‌డి దేవెగౌడ మొదటి వరుసలో కూర్చున్నారు. మరో ఫోటోలో ఉపరాష్ట్రపతి, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మధ్యలో ప్రధాని మోదీ కూర్చుకున్నారు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, కేంద్ర కేబినెట్ మంత్రులు, లోక్‌సభలో ఎనిమిది లేదా అంతకంటే ఎక్కువ మంది, రాజ్యసభలో ఐదు అంతకంటే లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యుల బలం కలిగిన పార్టీల నాయకులు, సీనియర్ సభ్యులు, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, లోక్‌సభ, రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ ముందు వరుసలో కూర్చున్నారు.

Updated Date - 2023-09-19T13:40:43+05:30 IST