Kozhikode train arson case: నిందితుడి అరెస్ట్ సమాచారాన్ని లీక్ చేసిన ఐపీఎస్ అధికారి సస్పెన్షన్

ABN , First Publish Date - 2023-05-19T10:40:39+05:30 IST

కేరళలో రైలు దగ్ధం కేసు నిందితుడిని మహారాష్ట్ర నుంచి కేరళకు తీసుకెళ్లడానికి సంబంధించిన సమాచారాన్ని అక్రమంగా బయటకు వెల్లడించారనే ఆరోపణలతో కేరళ ఏటీఎస్ యూనిట్ మాజీ అధిపతి, ఇన్‌స్పెక్టర్ జనరల్ పీ విజయన్‌ను

Kozhikode train arson case: నిందితుడి అరెస్ట్ సమాచారాన్ని లీక్ చేసిన ఐపీఎస్ అధికారి సస్పెన్షన్
Kerala

తిరువనంతపురం : కేరళలో రైలు దగ్ధం కేసు నిందితుడిని మహారాష్ట్ర నుంచి కేరళకు తీసుకెళ్లడానికి సంబంధించిన సమాచారాన్ని అక్రమంగా బయటకు వెల్లడించారనే ఆరోపణలతో కేరళ ఏటీఎస్ యూనిట్ మాజీ అధిపతి, ఇన్‌స్పెక్టర్ జనరల్ పీ విజయన్‌ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. శాంతిభద్రతల విభాగం ఏడీజీపీ ఎంఆర్ అజిత్ కుమార్ సమర్పించిన నివేదిక ఆధారంగా ఈ చర్య తీసుకుంది. నిందితుడిని మహారాష్ట్రలోని రత్నగిరి నుంచి కేరళలోని కొజిక్కొడ్‌కు తరలించడానికి సంబంధించిన సమాచారాన్ని అక్రమంగా బయటపెట్టడం తీవ్ర భద్రతా లోపమని ఈ నివేదిక పేర్కొంది.

ప్రయాణికులపై పెట్రోలు జల్లి, నిప్పు పెట్టిన దుండగుడు

కేరళ పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం నమోదు చేసిన కేసులో తెలిపిన వివరాల ప్రకారం, షారూఖ్ సైఫీ ఏప్రిల్ 2న చాలా దారుణానికి పాల్పడ్డాడు. కొజిక్కోడ్ జిల్లా, ఎలత్తూరు సమీపంలో కోరాపుజ వంతెన వద్దకు రైలు చేరుకునేసరికి అదే రైలులో ప్రయాణిస్తున్న షారూఖ్ సైఫీ సహ ప్రయాణికులపై పెట్రోలు జల్లి, నిప్పు పెట్టాడు. ఈ సంఘటనలో తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన ఓ మహిళ, ఓ చిన్నారి, ఓ వ్యక్తి రైలు క్రింద పడిపోవడంతో ప్రాణాలు కోల్పోయారు.

నిందితుని తరలింపు సమాచారం లీక్

షారూఖ్ సైఫీ మహారాష్ట్రలో పట్టుబడ్డాడు. అతనిని ఏప్రిల్ ఐదున రత్నగిరి నుంచి కేరళకు రోడ్డు మార్గంలో తరలించారు. ఆ సమయంలో ఇన్‌స్పెక్టర్ జనరల్ ర్యాంక్ ఆఫీసర్ అయిన విజయన్, గ్రేడ్ ఎస్ఐ కే మనోజ్ కుమార్ ఈ కేసు దర్యాప్తుతో సంబంధం లేకపోయినప్పటికీ, ఈ కేసులో నిందితుడైన సైఫీని కొజిక్కోడ్‌కు రోడ్డు మార్గంలో తరలిస్తున్న పోలీసు అధికారులతో మాట్లాడారని ఈ సస్పెన్షన్ ఆర్డర్ పేర్కొంది. యాంటీ టెర్రరిజం స్క్వాడ్ విభాగం చాలా అప్రమత్తతతో పని చేయవలసి ఉంటుందని, అందువల్ల ఏడీజీపీ నివేదిక ఆధారంగా ఈ విభాగంలోని అధికారులపై క్షుణ్ణమైన దర్యాప్తు అవసరమని తెలిపింది. ఈ విషయంలో దర్యాప్తు పూర్తయ్యే వరకు విజయన్‌ను సర్వీస్ నుంచి సస్పెండ్ చేయడం అవసరమని తెలిపింది. పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ఏడీజీపీ కే పద్మ కుమార్ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది.

రైలును తగులబెట్టిన కేసులో నిందితుడైన షారూఖ్ సైఫీని రహస్యంగా ప్రైవేటు వాహనంలో తరలించాలన్న కేరళ పోలీసుల వ్యూహం బయటకు తెలిసిపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయని ఈ సస్పెన్షన్ ఆర్డర్ తెలిపింది. కన్నూరు జిల్లా గుండా వెళ్తున్నపుడు వాహనం టైర్ పేలిపోవడంతో రోడ్డు పక్కన చిక్కుకుపోయారని, స్థానికులు నిందితుడిని చూసేందుకు గుమిగూడారని తెలిపింది. ప్రయాణాన్ని కొనసాగించేందుకు మరొక వాహనం కోసం ప్రయత్నిస్తూ, పోలీసు అధికారులు దాదాపు ఓ గంటసేపు వాహనంలోనే చిక్కుకుపోయారని తెలిపింది.

ఇవి కూడా చదవండి :

The Kerala Story : కేరళ స్టోరీ సినిమాపై నిషేధం.. మమత బెనర్జీకి గట్టి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు..

UK parliament : బ్రిటన్ పార్లమెంటు భవనం కూలిపోబోతోందా?

Updated Date - 2023-05-19T10:40:39+05:30 IST