UK parliament : బ్రిటన్ పార్లమెంటు భవనం కూలిపోబోతోందా?

ABN , First Publish Date - 2023-05-19T09:18:04+05:30 IST

గట్టిగా గాలివాన వచ్చిందంటే బ్రిటన్‌ లోని 147 ఏళ్ళనాటి వెస్ట్‌మినిస్టర్ ప్యాలెస్‌ కూలిపోతుందని బ్రిటన్‌ హౌస్ ఆఫ్ కామన్స్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ హెచ్చరించింది.

UK parliament : బ్రిటన్ పార్లమెంటు భవనం కూలిపోబోతోందా?
Britain parliament complex

లండన్ : గట్టిగా గాలివాన వచ్చిందంటే బ్రిటన్‌ (Britain)లోని 147 ఏళ్ళనాటి వెస్ట్‌మినిస్టర్ ప్యాలెస్‌ కూలిపోతుందని బ్రిటన్‌ హౌస్ ఆఫ్ కామన్స్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ హెచ్చరించింది. ఈ ముప్పు నానాటికీ పెరుగుతోందని చెప్పింది. దీనిలోనే బ్రిటన్ పార్లమెంటు భవనం కూడా ఉంది. బ్రిటిష్ ప్రజాస్వామ్య పీఠం లీక్ అవుతోందని, పై కప్పు పెచ్చులు ఊడిపోతున్నాయని, అగ్ని ప్రమాదం సంభవించే ముప్పు కూడా ఉందని తెలిపింది. 2,500 చోట్ల ఆస్టెబస్టాస్ ఉబ్బిపోయిందని తెలిపింది.

పార్లమెంటు (Parliament) భవన సముదాయం భవిష్యత్తు కోసం తగిన చర్యలు తీసుకోకుండా సంవత్సరాల తరబడి జాప్యం చేస్తుండటాన్ని ఈ కమిటీ తీవ్రంగా తప్పుబట్టింది. పునరుద్ధరణ, ఆధునికీకరణ పనులు చాలా నెమ్మదిగా జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. వారానికి సుమారు రెండు మిలియన్ పౌండ్ల వరకు ఖర్చుపెడుతూ, కేవలం ప్యాచింగ్ పనులకే పరిమితమవుతున్నారని మండిపడింది.

ఈ పెద్ద పనిని చేయడానికి పట్టే సమయం, చేయవలసిన ఖర్చుల గురించి స్పష్టమైన సంకేతాలు ఇవ్వాలని రాజకీయ నేతలను, పార్లమెంటరీ అధికారులను కోరింది. ఈ పనులు చేయడం సాధ్యం కాదనే సమయం వచ్చే వరకు తాత్సారం చేయవద్దని కోరింది. ఇప్పటి వరకు ఎంపీలపైనే దృష్టి పెట్టారని, వేలాది మంది సిబ్బంది, సందర్శకుల గురించి పట్టించుకోలేదని దుయ్యబట్టింది.

సంవత్సరాల తరబడి తాత్సారం చేసిన తర్వాత 2018లో ఎంపీలు ఓ తీర్మానాన్ని ఆమోదించారు. ఈ భవనానికి కొన్ని సంవత్సరాలపాటు ప్రధాన మరమ్మతులు చేయడానికి వీలుగా పార్లమెంటు కార్యకలాపాలను వేరొక చోటుకు తరలించాలని తీర్మానించారు. పైకప్పు లీక్ అవుతుండటం, దాదాపు ఓ శతాబ్ద కాలం నాటి స్టీమ్ పైపులు బరస్ట్ అయిపోవడం, పెచ్చులు ఊడిపోతుండటం వంటివి జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మెకానికల్, ఎలక్ట్రికల్ సిస్టమ్స్‌ను చిట్టచివరిసారి 1940వ దశకంలో ఆధునికీకరించారు.

వెస్ట్‌మినిస్టర్ ప్యాలెస్‌ను భావి తరాల కోసం సురక్షితంగా కాపాడాలని నిర్ణయించామని అధికారులు చెప్తున్నారు. విస్తృత స్థాయిలో పునరుద్ధరణ పనులు చేయాలని ప్రణాళిక రచించినట్లు చెప్పారు. దీని కోసం హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యులు, హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యులు ఈ ఏడాది చివర్లో ఓ తీర్మానాన్ని ఆమోదిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

ది ప్యాలెస్ ఆఫ్ వెస్ట్‌మినిస్టర్ (The palace of Westminster) వాస్తుశిల్ప రీత్యా అద్భుతమైన కట్టడం. దీనికి యునెస్కో (UNESCO) ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు ఉంది. సంవత్సరానికి దాదాపు 10 లక్షల మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. దీనిని ఆర్కిటెక్ట్ చార్లెస్ బారీ డిజైన్ చేశారు. 1834లో పార్లమెంటు భవన సముదాయం అగ్ని ప్రమాదంలో ధ్వంసమవడంతో ఈ కొత్త భవనాన్ని నిర్మించారు.

ఇవి కూడా చదవండి :

The Kerala Story : కేరళ స్టోరీ సినిమాపై నిషేధం.. మమత బెనర్జీకి గట్టి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు..

Vande Bharat Express : ఒడిశా తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించిన మోదీ

Updated Date - 2023-05-19T09:18:04+05:30 IST