N Valarmathi: చంద్రయాన్-3 విజయవంతమైన వేళ ఇలాంటి విషాద వార్త వినాల్సి వస్తుందనుకోలేదు..

ABN , First Publish Date - 2023-09-04T10:01:19+05:30 IST

చంద్రయాన్ 3 విజయవంతమైన ఆనందంలో ఉన్న వేళ ఇస్రోలో తీవ్ర విషాదం నెలకొంది. చంద్రయాన్ 3 ప్రయోగ సమయంలో వాయిస్ ఓవర్ ఇచ్చిన, ఇస్రో శాస్త్రవేత్త ఎన్ వలర్మతి ఇక లేరు.

N Valarmathi: చంద్రయాన్-3 విజయవంతమైన వేళ ఇలాంటి విషాద వార్త వినాల్సి వస్తుందనుకోలేదు..

చంద్రయాన్ 3 విజయవంతమైన ఆనందంలో ఉన్న వేళ ఇస్రోలో తీవ్ర విషాదం నెలకొంది. చంద్రయాన్ 3 ప్రయోగ సమయంలో వాయిస్ ఓవర్ ఇచ్చిన, ఇస్రో శాస్త్రవేత్త ఎన్ వలర్మతి ఇక లేరు. ఈ పరిణామంతో ఇస్రో రాకెట్ ప్రయోగాల సమయంలో వాయిస్ ఓవర్ ఇచ్చే స్వరం మూగబోయింది. ఇస్రో రాకెట్‌లు నింగిలోకి ఎగిరే సమయంలో 10, 9, 8 అంటూ కౌంట్‌డౌన్ చెప్పే, ఇస్రో శాస్త్రవేత్త వలర్మతి గుండెపోటుతో శనివారం తుదిశ్వాస విడిచారు. చాలా కాలంగా ఇస్రో ప్రయోగించే రాకెట్ ప్రయోగాలన్నింటికి ఆమెనే వాయిస్ ఓవర్ ఇచ్చారు. అలాంటి వలర్మతి గుండెపోటుతో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మరణించారు. కాగా వలర్మతి చివరగా చంద్రయాన్ 3కి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇస్రో రాకెట్ ప్రయోగాల సమయంలో వచ్చే లైవ్ స్ట్రీమింగ్‌లో తన గంభీరమైన స్వరంతో వాయిస్ ఓవర్ ఇచ్చే వలర్మతి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. అలాంటి వలర్మతి లేరనే వార్త బాధాకరమనే చెప్పుకోవాలి.


కాగా భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహమైన RISAT-1 ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా కూడా వలర్మతి పని చేశారు. 1959లో తమిళనాడులోని అరియలూర్‌లో జన్మించిన వలర్మతి 1984లో ఇస్రోలో చేరారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరిట ఏర్పాటు చేసిన పురస్కారాన్ని వలర్మతి మొదటిసారిగా 2015లో అందుకున్నారు. కాగా వాలర్మతి మృతికి ప్రముఖులంతా సంతాపం తెలుపుతున్నారు. శ్రీహరి కోట నుంచి ఇస్రో భవిష్యత్‌లో ప్రయోగించే మిషన్ల కౌంట్‌డౌన్‌లకు ఇక నుంచి వాలర్మతి మేడమ్ వాయిస్ వినిపించదని ఇస్రో మాజీ డైరెక్టర్ డాక్టర్ పీవీ వెంకటకృష్ణన్ ట్విటర్‌లో ట్వీట్ చేశారు. ఇది ఊహించని మరణం అని, చాలా బాధగా ఉందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2023-09-04T10:02:48+05:30 IST