Farooq Abdullah: స్పీకర్ ఓం బిర్లా ఇచ్చిన టీ పార్టీలో ఏం జరిగిందంటే?

ABN , First Publish Date - 2023-04-06T15:07:27+05:30 IST

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు(Budget session of Parliament) ముగిశాక లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా (Lok Sabha Speaker Om Birla) ఇచ్చిన టీ పార్టీకి ప్రతిపక్ష పార్టీల ఎంపీల్లో...

Farooq Abdullah: స్పీకర్ ఓం బిర్లా ఇచ్చిన టీ పార్టీలో ఏం జరిగిందంటే?
Farooq Abdullah

న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు(Budget session of Parliament) ముగిశాక లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా (Lok Sabha Speaker Om Birla) ఇచ్చిన టీ పార్టీకి ప్రతిపక్ష పార్టీల ఎంపీల్లో ఒకే ఒక్కరు హాజరయ్యారు. ఆయనెవరో కాదు. నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా(National Conference chief Farooq Abdullah). ఆ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi), రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులు అక్కడే ఉన్నారు. ఫరూఖ్ అబ్దుల్లాతో కలిసి ముచ్చటించుకుంటూ అందరూ తేనీరు సేవించారు.

మరోవైపు మిగతా ప్రతిపక్ష నేతలంతా జాతీయ జెండాలు చేబూని పార్లమెంటు నుంచి విజయ్ చౌక్ వరకు తిరంగా మార్చ్ (Tiranga March) నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఆందోళన చేశారు. అదానీపై సమగ్ర విచారణకు గాను సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని (జేపీసీ)వేయాలని, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై వేసిన అనర్హత వేటును వెంటనే ఉపసంహరించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అదేవిధంగా ప్రతిపక్షాలకు చెందిన ప్రముఖులు, నాయకులపై ఐటీ,ఈడీ, సీబీఐలను ప్రయోగించి వేధింపులకు గురి చేయడాన్ని వెంటనే ఆపేయాలని బీఆర్ఎస్,కాంగ్రెసు, డీఎంకే, టీఎంసీ, ఎండీఎంకే,ఆప్, ఎస్పీ, ఆర్జేడీ, సీపీఐ, సీపీఎంలు ఆందోళనకు దిగాయి.

అంతకు ముందు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రతిపక్షాల ఎంపీలు నినాదాలివ్వడంతో ఉభయ సభలు స్తంభించిపోయాయి. అధికారపక్షం సభలను మధ్యాహ్నానికి వాయిదా వేయడంతో ప్రతిపక్షాల ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలిస్తూ బయటకు వచ్చి జాతీయ జెండాలు చేతబట్టి విజయ్ చౌక్ వరకు మార్చ్ నిర్వహించారు. రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నాయకులు మల్లికార్జున ఖర్గే, బీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కే.కేశవరావు, లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు, ఎంపీలు పార్థసారథి రెడ్డి, కే.ఆర్.సురేష్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, పీ.రాములు, డీఎంకేకు చెందిన బాలు, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తదితర ప్రముఖులు ఈ మార్చ్‌లో పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడండాలంటూ ఎంపీలు పెద్ద పెట్టున నినాదాలిచ్చారు. అనంతరం ప్రతిపక్ష నాయకులు కానిస్టిట్యూషనల్ క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను ఎండగట్టారు. ప్రధాని మోదీ పేరుకే ప్రజాస్వామ్యమని అంటుంటారని, ఆచరణలో ఉండదని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు(Congress National President) మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) ఆరోపించారు. అదానీపై జేపీసీ ఎందుకు వేయరని ఆయన ప్రశ్నించారు.

Updated Date - 2023-04-06T15:17:11+05:30 IST