Share News

Delhi: నిన్నటి వరకు కాలుష్యం.. ఇప్పుడు పొగమంచు.. చలి గుప్పిట్లో దేశ రాజధాని

ABN , Publish Date - Dec 27 , 2023 | 08:33 AM

నిన్నటి వరకు తీవ్ర వాయు కాలుష్యంతో విలవిలలాడిన దేశ రాజధాని ఢిల్లీని ప్రస్తుతం చలి వణికిస్తోంది. చలి గుప్పిట్లో చిక్కుకుని దేశ రాజధాని అతలాకుతలమవుతోంది. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. తీవ్ర చలితో ఢిల్లీ వాసులు వణికిపోతున్నారు.

Delhi: నిన్నటి వరకు కాలుష్యం.. ఇప్పుడు పొగమంచు.. చలి గుప్పిట్లో దేశ రాజధాని

ఢిల్లీ: నిన్నటి వరకు తీవ్ర వాయు కాలుష్యంతో విలవిలలాడిన దేశ రాజధాని ఢిల్లీని ప్రస్తుతం చలి వణికిస్తోంది. చలి గుప్పిట్లో చిక్కుకుని దేశ రాజధాని అతలాకుతలమవుతోంది. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. తీవ్ర చలితో ఢిల్లీ వాసులు వణికిపోతున్నారు. నగరంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 7 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవడంతో తీవ్ర చలిగాలులు వీస్తున్నాయి. మరోవైపు ఢిల్లీని దట్టమైన పొగమంచు కప్పేసింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కారణంగా దృశ్యమానత దాదాపు సున్నాకు పడిపోయింది. దీంతో తెల్లవారాక కూడా ఢిల్లీలో చీకట్లు కమ్ముకున్నాయి. వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్లాల్సి వస్తోంది. ఒకవైపు తీవ్ర చలి, మరోవైపు పొగమంచు కప్పేయడంతో బయటికి రావాలంటేనే ఢిల్లీ వాసులు గజగజ వణికిపోతున్నారు.


ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో ఉత్తర భారతదేశం మొత్తం చలిగాలులు వీస్తున్నాయి. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తర మధ్యప్రదేశ్‌లో ఉదయం 5:15 గంటల సమయంలో పొగమంచు వేగంగా వ్యాపిస్తున్నట్లు చూపించే ఒక ఉపగ్రహ చిత్రాన్ని కూడా వాతావరణ శాఖ విడుదల చేసింది. ఉపగ్రహ చిత్రాల ప్రకారం పంజాబ్, హర్యానా-చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తర రాజస్థాన్, ఉత్తర మధ్యప్రదేశ్‌తో సహా వాయువ్య భారతదేశం, దానికి అనుకుని ఉన్న మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో దట్టమైన పొగమంచు ఏర్పడింది. దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీలోని సఫర్‌జంగ్‌లో దృశ్యమానత 50 మీటర్లకు, పాలంలో 125 మీటర్లకు పడిపోయింది. పంజాబ్‌లోని అమృత్‌సర్ విమానాశ్రయంలో దృశ్యమానత సున్నాకు పడిపోయింది. అలాగే ఉత్తరప్రదేశ్‌లోని బరేలి, లక్నో, ప్రయాగ్‌రాజ్‌తోపాటు కొన్ని ప్రాంతాల్లో దృశ్యమానత 25 మీటర్లకు, రాజస్థాన్‌లోని గంగానగర్‌లో 50 మీటర్లకు పడిపోయింది. తీవ్ర పొగమంచు కారణంగా ఢిల్లీలో వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Updated Date - Dec 27 , 2023 | 08:33 AM