Congress : అందుకే రాహుల్ గాంధీకి శిక్ష : జైరామ్ రమేశ్

ABN , First Publish Date - 2023-03-23T15:01:37+05:30 IST

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి శిక్ష విధించడానికి కారణాన్ని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్

Congress : అందుకే రాహుల్ గాంధీకి శిక్ష : జైరామ్ రమేశ్
Rahul Gandhi , Jairam Ramesh

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి శిక్ష విధించడానికి కారణాన్ని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ (Jairam Ramesh) చెప్పారు. ప్రశ్నించే గొంతులపై సీబీఐ, ఈడీ, ఎఫ్ఐఆర్, పోలీసులను ఉసిగొలుపుతున్నారని మండిపడ్డారు. దొంగలందరికీ ఇంటి పేరు (surname) మోదీ (Modi) అని ఎందుకు ఉంటోందని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ (Congress MP Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై గుజరాత్‌లోని సూరత్ కోర్టు (Surat District Court) ఆయనకు రెండేళ్ల జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే.

రాహుల్ గాంధీ 2019లో కర్ణాటకలో మాట్లాడుతూ, దొంగలందరికీ ఇంటి పేరు మోదీ ఎలా అవుతోందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ(BJP MLA Purnesh Modi) పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన సూరత్ జిల్లా కోర్టు రాహుల్ గాంధీని దోషిగా నిర్థరించి, రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అపీలు చేసుకోవడానికి అనుమతిస్తూ, ఈ తీర్పు అమలును 30 రోజులపాటు నిలిపివేసింది. ఈ తీర్పును పూర్ణేశ్ మోదీ స్వాగతించారు. పరువు నష్టం కేసు(defamation case)లో తనకు రెండేళ్ల జైలు శిక్ష పడటంపై రాహుల్ గాంధీ స్పందించారు. సత్యమే తనకు గురువని చెప్పారు. తన ధర్మం సత్యం, అహింసలపై ఆధారపడిందన్నారు.

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మ్లలికార్జున ఖర్గే (Mallikharjun Kharge) మాట్లాడుతూ, ఇలా చేస్తారని తాము ముందే ఊహించామన్నారు. రాహుల్ నోరు నొక్కడానికే ఇలా చేశారని విమర్శించారు. చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా (Congress General Secretary Priyanka Gandhi Vadra) మాట్లాడుతూ, తన సోదరుడు భయపడే రకం కాదని, భయపడబోడని చెప్పారు. నిజం చెప్పడమే అలవాటని, నిజమే చెబుతామని అన్నారు. రాహుల్ నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భాగేల్ (Chhattisgarh CM Bhupesh Baghel), రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్(Rajasthan CM Ashok Gehlot) స్పందిస్తూ, బీజేపీ రాహుల్ గొంతు నొక్కే యత్నం చేస్తోందని విమర్శించారు.

ఈ నేపథ్యంలో జైరామ్ రమేశ్ గురువారం ఇచ్చిన ట్వీట్‌లో, సత్యం మాట్లాడినందుకు, ‘నియంత’కు వ్యతిరేకంగా గళమెత్తినందుకు రాహుల్ గాంధీని శిక్షిస్తున్నారని మండిపడ్డారు. ‘‘ఇది నవ భారతం. మీరు అన్యాయానికి వ్యతిరేకంగా గళమెత్తితే, ఈడీ (Enforcement Directorate), సీబీఐ (Central Bureau of Investigation), పోలీస్, ఎఫ్ఐఆర్‌ మీ మీద నమోదవుతుంది. సత్యం మాట్లాడినందుకు, నియంతకు వ్యతిరేకంగా గళమెత్తినందుకు రాహుల్ గాంధీకి శిక్ష పడుతోంది. దేశ చట్టాలు అపీలు చేసుకోవడానికి రాహుల్ గాంధీకి అవకాశం ఇస్తున్నాయి. ఆ హక్కును ఆయన వినియోగించుకుంటారు’’ అని తెలిపారు. తాము భయపడబోమని చెప్పారు.

ఇవి కూడా చదవండి :

Modi surname: ఊహించని పరిణామం... రాహుల్‌కు మద్దతుగా నిలిచిన కేజ్రీవాల్

TSPSC Leakage: రేవంత్‌ను గంటపాటు విచారించిన సిట్ .. అసలేం జరిగిందంటే...

Updated Date - 2023-03-23T15:06:16+05:30 IST