TSPSC Leakage: సిట్ విచారణ తర్వాత బయటకొచ్చి రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-03-23T14:24:22+05:30 IST

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సిట్ విచారణ ముగిసింది. గంటపాటు రేవంత్‌ను సిట్ విచారించింది.

TSPSC Leakage: సిట్ విచారణ తర్వాత బయటకొచ్చి రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) సిట్ విచారణ ముగిసింది. గంటపాటు రేవంత్‌ TPCC chief) ను సిట్ విచారించింది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ (TSPSC Leakage)కి సంబంధించి తన వద్ద ఉన్న ఆధారాలను సిట్ అధికారులకు రేవంత్ అందజేశారు. విచారణ ముగిసిన అనంతరం టీపీసీసీ చీఫ్ మీడియాతో మాట్లాడుతూ... ఆరు దశాబ్దాలు పోరాటం తరువాత తెలంగాణా సాధించుకున్నామన్నారు. తెలంగాణా ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది అమర వీరుల కుటుంబాలని తెలిపారు. 2009 మలి ఉద్యమం కూడా ఉద్యోగాల నియామాకాల పైనే జరిగిందని చెప్పారు. ప్రాణా త్యాగాలు చేసి తెలంగాణాను నిలబెట్టారని టీపీసీసీ చీఫ్ గుర్తుచేశారు.

తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒక దేవాలయం, మసీదు, ప్రార్థనా మందిరం లాంటిదని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసం నమ్మకం కలిగించాల్సిన బాధ్యత టీఎస్‌పీఎస్సీకి ఉందన్నారు. టీఎస్‌పీఎస్సీ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాల్సిన అధికారులు వైఫల్యం చెందారని విమర్శించారు. టీఎస్‌పీఎస్సీ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని ఆరోపించారు. పరీక్షల నిర్వహణలో అధికార పార్టీ నేతలు తల దూర్చారన్నారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నా పత్రాలు పల్లి బఠాణీలు అమ్మినట్లు అమ్మేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై కేటీఆర్ బాధ్యత వహించాలని.. వెంటనే ఆయనను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. టీఎస్‌పీఎస్సీ‌లో చైర్మన్ అలాగే వెంకట లక్ష్మీని జైలుకి పంపాలన్నారు. టీఎస్‌పీఎస్సీ పరీక్షలు రాసిన ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

బండి సంజయ్ పాత్ర ఉందని చెప్పా...

జగిత్యాల జిల్లా మాల్యాలకి చెందిన నిందితుడు రాజశేఖర్ రెడ్డికి కేటీఆర్ పీఏ (KTR PA) తిరుపతికి సంబంధాలు ఉన్నాయన్నారు. అదే జిల్లాల్లో ఎలాంటి మెరిట్ స్టూడెంట్స్ కాకున్నా 100 మందికి 100 మార్కులు వచ్చాయన్నారు. తమకు నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెట్టడం వలనే వచ్చేది ఏమీ లేదని.. లక్షలాది మంది నిరుద్యోగులు, యువకులను దృష్టిలో పెట్టుకొని అధికారుల నోటీసులకు స్పందించి, తన దగ్గర ఉన్న ఆధారాలు ఇచ్చానని చెప్పుకొచ్చారు. తన దగ్గర ఉన్న ఆధారాలను ఏఆర్ శ్రీనివాస్‌కు ఇచ్చానన్నారు. ఈ వ్యవహారంలో ముగ్గురు వ్యక్తులు దీనిపై స్పందించారని.. తనతో పాటు బండి సంజయ్ (Bandi Sanjay), కేటీఆర్ స్పందించారని తెలిపారు. తాము ముగ్గురం కూడా తమకున్న సమాచారాన్ని బయట పెట్టామని చెప్పారు. తనకు, బీజేపీ అధ్యక్షుడుకి నోటీసులు ఇచ్చి భయపెట్టే ప్రయత్నం చేశారన్నారు. ఇద్దరు వ్యక్తులే నేరం చేసినట్లు కేటీఆర్ క్లియరెన్స్ ఇచ్చారన్నారు.

ఈ కుట్రలో బండి సంజయ్, ఇద్దరు వ్యక్తుల పాత్ర ఉందని ఏఆర్ శ్రీనివాస్‌కు ఇచ్చినట్లు చెప్పారు. అలాగే కేటీఆర్‌ వద్ద కూడా పూర్తి సమాచారం ఉందని.. ఆయనను కూడా విచారించాలని డిమాండ్ చేశారు. టీఎస్‌పీఎస్సీకి పాత కంప్యూటర్లు మార్చి కొత్త కంప్యూటర్లను కేటీఆర్ అందజేశారని.. వాటి పర్యవేక్షణ బాధ్యతను రాజశేఖర్ రెడ్డికి అప్పగించారని తెలిపారు. బండి సంజయ్ పాత్ర, బీజేపీ (BJP)పాత్ర, టీఎస్‌పీఎస్సీలో ఉన్న ప్రవీణ్, రాజశేఖర్ పాత్రపై పూస గుచ్చినట్లు కేటీఆర్ తెలిపారన్నారు. కేటీఆర్‌కు ఎందుకు నోటీసులు ఇవ్వలేదని విచారణ అధికారిని అడిగానని.. అయితే ఇంకా తమ దృష్టికి రాలేదని ఏఆర్ శ్రీనివాస్ చెప్పారన్నారు. దీంతో ‘‘నేను కేటీఆర్‌పై ఫిర్యాదు చేశాను, కానీ తీసుకోలేదు. నా ఫిర్యాదు కాపీపై ఇన్ఫర్మేషన్‌ అని రాసుకున్నారు. నాకు నోటీసులు ఇచ్చి పోలీసులు వేధించారు అని ఏఆర్ శ్రీనివాస్‌కు చెప్పాను’’ రేవంత్ పేర్కొన్నారు.

ఏపీ అధికారి చేతిలో తెలంగాణ చేతి తాళాలు...

విచారణను ఏపీ అధికారికి అప్పగించడాన్ని రేవంత్ తప్పుబట్టారు. తెలంగాణాలో ఇంత మంది అధికారులు ఉన్నా ఏఆర్ శ్రీనివాస్‌కి ఇచ్చి ఏం సాధించారని ప్రశ్నించారు. తనకు సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్‌కి వ్యక్తిగత విభేదాలు ఏమి లేవన్నారు. ఏపీ ఐపీఎస్‌కు బాధ్యతలు అప్పించి తెలంగాణాను కేసీఆర్ అవమానించారన్నారు. తెలంగాణకు పట్టిన పీడ చంద్రశేఖర్ రావు (K.chandrashekar Rao(KCR))అంటూ దుయ్యబట్టారు. మన తెలంగాణా చేతి తాళాలు ఏపీ అధికారి చేతిలో పెట్టారన్నారు. తాను చేసిన ఆరోపణలపై ఆధారాలు అన్ని సిట్ అధికారికి అందజేసినట్లు చెప్పారు. వ్యాపం కుంభకోణం కూడా ఇలాగే జరిగిందని.. కాంగ్రెస్ దీనిపై న్యాయ పోరాటం చేస్తే కేసు సీబీఐకి బదిలీ అయిందన్నారు. ఈ కేసులో 2 వేల మందిని సీబీఐ అరెస్ట్ చేసిందని తెలిపారు. వ్యాపం కుంభకోణం విషయం కూడా ఏఆర్ శ్రీనివాస్‌కు తెలియజేశానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-03-23T14:51:15+05:30 IST