Delhi Liquor Scam Case: డాక్యుమెంటేషన్, వాంగ్మూలంపై కవిత సంతకాలు తీసుకున్న ఈడీ అధికారులు

ABN , First Publish Date - 2023-03-20T19:36:01+05:30 IST

డాక్యుమెంటేషన్, వాంగ్మూలంపై కవిత సంతకాలు తీసుకున్నారు.

Delhi Liquor Scam Case: డాక్యుమెంటేషన్, వాంగ్మూలంపై కవిత సంతకాలు తీసుకున్న ఈడీ అధికారులు
BRS MLC Kavitha

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi Liquor Scam Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను (BRS MLC Kavitha)ను ఈడీ అధికారులు దాదాపు 7 గంటలకు పైగా విచారించాక ఆమె సంతకాలు తీసుకున్నారు. డాక్యుమెంటేషన్, వాంగ్మూలంపై కవిత సంతకాలు తీసుకున్నారు. అయితే ఈడీ అధికారులు సంతకాలు ఎందుకు తీసుకున్నారనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. అరెస్ట్ చేసేందుకా లేక విచారణ ముగిసిందని చెప్పేందుకా అనేది తెలియాల్సి ఉంది.

మరోవైపు ఈడీ కార్యాలయం వద్ద తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కవిత అరెస్ట్ అవుతారా లేక బయటకు వస్తారా అనే విషయంలో టెన్షన్ కొనసాగుతోంది.

కవితను ఈ ఉదయం 11 గంటల నుంచి ఈడీ అధికారులు (ED Officers) విచారించారు. ఈడీ సంధించిన పలు ప్రశ్నలకు కవిత నుంచి ఎలాంటి రియాక్షన్ కూడా లేదని తెలిసింది. మొత్తం 20 ప్రశ్నలు కవితకు సంధించినట్లు తెలిసింది. కవిత, అరుణ్‌ పిళ్లైని కలిపి ఈడీ అధికారులు విచారించారు. ముఖ్యంగా పిళ్లైతో కవితకు ఉన్న వ్యాపార సంబంధాలు, లిక్కర్ స్కాంలో సౌత్‌ గ్రూప్ పాత్రపై కవితను ఈడీ ప్రశ్నించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కన్‌ఫ్రంటేషన్ పద్దతిలో కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. కవిత ఈడీ కార్యాలయం నుంచి ఇంకా బయటికి రాకపోవడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ పెరిగిపోతోంది.

ఈడీ కార్యాలయానికి తెలంగాణ అడిషనల్ ఏజీ, సోమా భరత్, గండ్ర మోహన్ రావు వెళ్లారు. కవితను అరెస్ట్ చేసే సూచనలు ఏమైనా ఉన్నాయా అనేది బీఆర్ఎస్ పెద్దలకు అర్థం కావట్లేదు. ఏం జరుగుతుందోనని బీఆర్ఎస్ కార్యకర్తలు టీవీలకు అతుక్కుపోయి చూస్తున్నారు.

మరోవైపు.. డాక్టర్లు కూడా ఈడీ కార్యాలయంలోకి వెళ్లడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ మరింత పెరిగిపోయింది. అయితే డాక్టర్లు ఎందుకు లోపలికి వెళ్లారనేది తెలియరాలేదు.

ఢిల్లీ ఈడీ కార్యాలయం వద్ద వర్షం కురుస్తోంది. వాన కురుస్తున్నా ఈడీ ఆఫీస్ వద్ద టెన్షన్ మాత్రం తగ్గడం లేదు.

Updated Date - 2023-03-20T19:36:51+05:30 IST