Share News

Randeep- Lin: వివాహ బంధంతో ఒకటైన ప్రముఖ బాలీవుడ్ జంట

ABN , First Publish Date - 2023-12-12T12:51:32+05:30 IST

బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా, ప్రముఖ నటి, మోడల్ లిన్ లైష్రామ్ నవంబర్ 29న ఓ ఇంటివారయ్యారు. బంధువులు, స్నేహితుల సమక్షంలో ఈ జంట ఒక్కటైంది. ఈ జంట సోమవారం రిసెప్షన్ నిర్వహించింది.

Randeep- Lin: వివాహ బంధంతో ఒకటైన ప్రముఖ బాలీవుడ్ జంట

బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా, ప్రముఖ నటి, మోడల్ లిన్ లైష్రామ్ నవంబర్ 29న ఓ ఇంటివారయ్యారు. బంధువులు, స్నేహితుల సమక్షంలో ఈ జంట ఒక్కటైంది. ఈ జంట సోమవారం రిసెప్షన్ నిర్వహించింది. ముంబైలో జరిగిన ఈ రిసెప్షన్‌కు అనేక మంది బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖ నిర్మాత ఇంతియాజ్ అలీ, నటులు నసీరుద్దీన్ షా, రత్న పాఠక్, జాకీ ష్రాఫ్, విజయ్ వర్మ, తమన్నా భాటియా వంటి పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నవంబర్ 29న మణిపూర్‌లో సంప్రదాయం ప్రకారం రణ్‌దీప్, లిన్ వివాహం జరిగింది. వివాహ వేడుకలో వధువరులిద్దరూ సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను రణ్‌దీప్, లిన్ ఇన్‌స్ట్రాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘‘మా పెళ్లిలోని అందమైన క్షణాలు. మీ ప్రేమ, ఆశీర్వాదాలకు అందరికీ ధన్యవాదాలు’’ అని రణ్‌దీప్ రాసుకొచ్చాడు. దీంతో రణదీప్, లిన్ దంపతులకు బాలీవుడ్ ప్రముఖులతోపాటు అభిమానులు శుభాకాంక్షలు చెప్పారు.


కాగా రణ్‌దీప్, లిన్ తమ ప్రేమ వ్యవహారాన్ని ఎప్పుడు అధికారికంగా ధృవీకరించిక పోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం తరచుగా అభినందనలు తెలుపుకునేవారు. అక్టోబర్ 2022లో రణ్‌దీప్‌నకు లిన్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పింది. ‘‘హాపీ బర్త్ డే మై హాట్ ఫడ్జ్’’ అనే క్యాప్షన్‌తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడం గమనార్హం. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందనే వార్తలు అప్పట్లోనే వచ్చాయి. దీపావళి రోజు లిన్, ఆమె తల్లిదండ్రులతో దిగిన ఫోటోలను రణదీప్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారందరికీ ఈ దీపావళి ప్రేమ, వెలుగులు పంచాలని కోరుకుంటున్నాను అని క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మొత్తంగా కొంతకాలంపాటు రిలేషన్‌షిప్‌లో ఉన్న రణదీప్, లిన్ వివాహ వేడుకతో ఒకటయ్యారు. కాగా మేరీకోమ్, రంగూన్, జానే జాన్ వంటి చిత్రాల్లో లిన్ నటించింది. రణదీప్ విషయానికొస్తే చివరిసారిగా సార్జెంట్ అనే చిత్రంలో నటించాడు. ప్రస్తుతం స్వాతంత్ర్య వీర్ సావర్కర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు రణదీప్ హుడానే దర్శకత్వం వహిస్తుండడం గమనార్హం.

Updated Date - 2023-12-12T12:51:34+05:30 IST