Congress Vs BJP : రాహుల్ గాంధీపై అధికార పక్షం ఆగ్రహం

ABN , First Publish Date - 2023-03-14T13:48:03+05:30 IST

కాంగ్రెస్ (Congress) నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Congress Vs BJP : రాహుల్ గాంధీపై అధికార పక్షం ఆగ్రహం
Rajya Sabha

న్యూఢిల్లీ : కాంగ్రెస్ (Congress) నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పార్లమెంటు సభ్యుడు (MP) విదేశాలకు వెళ్లి, భారత దేశంలోని ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మాట్లాడితే, పార్లమెంటు చేష్టలుడిగి, చూస్తూ కూర్చోజాలదని స్పష్టం చేశారు. బ్రిటన్‌ (Britain)లో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రెండో రోజు మంగళవారం కూడా కొనసాగడంతో కార్యకలాపాలు ప్రారంభమైన కాసేపటికే లోక్‌సభ, రాజ్యసభ వాయిదా పడ్డాయి.

రాహుల్ గాంధీ ఇటీవల లండన్‌ (London)లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం (Cambridge University)లో ఇచ్చిన ప్రసంగాల్లో, భారత దేశంలో ప్రజాస్వామ్య నిర్మాణం దాడికి గురవుతోందని, ప్రతిపక్ష నేతలకు పార్లమెంటులో మైక్‌లు ఇవ్వడం లేదని ఆరోపించిన సంగతి తెలిసిందే. పార్లమెంటు, స్వేచ్ఛాయుత పత్రికా రంగం, న్యాయ వ్యవస్థ దాడికి గురవుతున్నాయన్నారు.

ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీపై బీజేపీ (BJP) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తోంది. అన్ని పార్టీల ఎంపీలు ఆయన వ్యాఖ్యలను ఖండించాలని కోరింది. అయితే కాంగ్రెస్ స్పందిస్తూ, బీజేపీ ఆరోపణలను తోసిపుచ్చింది. ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కుతున్నవారు దానిని కాపాడటం గురించి మాట్లాడుతున్నారని మండిపడింది.

రాజ్యసభ మంగళవారం ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలిపారు. పీయూష్ గోయల్ మాట్లాడుతూ, ప్రతిదాన్నీ చూస్తూ, మౌనంగా కూర్చోలేమని చెప్పారు. ఓ పార్లమెంటు సభ్యుడు విదేశాలకు వెళ్లి, భారత దేశంలోని ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మాట్లాడితే తాము చూస్తూ కూర్చోలేమన్నారు. కొన్ని పార్టీలు ఆయనను సమర్థించడం దిగ్భ్రాంతికరమని చెప్పారు. ఓ సీనియర్ ఎంపీ విదేశాలకు వెళ్లి, మన పార్లమెంటును కించపరచినందుకు అన్ని పార్టీలు ఆయనను విమర్శించాలని కోరారు.

కాంగ్రెస్ ఎంపీ శక్తిసింహ్ గోహిల్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. గాంధీకి వ్యతిరేకంగా గోయల్ ఆరోపణలు చేశారని, ఇది సభా హక్కులను ఉల్లంఘించడమేనని తెలిపారు. లోక్‌సభ సభ్యుని గురించి సత్యదూరమైన విషయాలను రాజ్యసభలో ప్రస్తావించారన్నారు. ఉద్దేశపూర్వకంగా కించపరిచే వ్యాఖ్యలు చేశారన్నారు.

ఇవి కూడా చదవండి :

AP Assembly: గవర్నర్‌తో అసత్యాలు పలికిస్తున్నారు... సభలో టీడీపీ సభ్యుల నినాదాలు.. వాకౌట్

అసెంబ్లీ లాబీల్లో పయ్యావుల, పేర్ని నాని ఆప్యాయంగా పలకరించుకున్నట్టు అనిపించినప్పటికీ..

Updated Date - 2023-03-14T13:48:03+05:30 IST