Delhi Liquor కేసులో దూసుకెళుతున్న ఈడీ.. మరో కీలక వ్యక్తి అరెస్ట్

ABN , First Publish Date - 2023-02-08T12:08:14+05:30 IST

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ అధికారులు దూసుకెళుతున్నారు. నేటి ఉదయం ఎమ్మెల్సీ కవిత మాజీ సహాయకుడు, ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Delhi Liquor కేసులో దూసుకెళుతున్న ఈడీ.. మరో కీలక వ్యక్తి అరెస్ట్

ఢిల్లీ : ఢిల్లీ మద్యం కుంభకోణం (Delhi Liquor Scam) కేసులో ఈడీ (ED) అధికారులు దూసుకెళుతున్నారు. నేటి ఉదయం ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) మాజీ సహాయకుడు, ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ అరెస్ట్ విషయం బయటకు వచ్చిన కొద్ది సేపటికే ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ మరొకరి అరెస్టును ప్రకటించింది. ఢిల్లీకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ మల్హోత్రా (Gowtham Malhotra) అరెస్ట్ చేసిన ఈడీ అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. మద్యం విధానంలో మార్పులకు కీలకపాత్ర వహించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న గౌతమ్ మల్హోత్రాను ఈడీ అధికారులు అరెస్టు చేశారు.

ఈ రోజు మధ్యాహ్నం తర్వాత గౌతమ్ అల్హోత్రాను సీబీఐ ప్రత్యేక కోర్టు (CBI Special Court)లో ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు. గత రాత్రి మల్హోత్రాను ఈడీ కస్టడీలోకి తీసుకుంది. ఈ రోజు ఉదయం లాంఛనంగా ఈడీ అరెస్ట్ చేసింది. గౌతమ్ మల్హోత్రాకు మద్యం వ్యాపారులతో సన్నిహిత వ్యాపార సంబంధాలు ఉన్నట్లు పలు ఆధారాలు లభ్యమయ్యాయని ఈడీ తెలిపింది. ఓ రాజకీయ పార్టీకి చెందిన పలువురు నేతలతో డబ్బు లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయని ఈడీ వెల్లడించింది. మద్యం విధానం రూపకల్పన సమయంలో వ్యాపార లావాదేవీలు జరపడంతో పాటు... రాజకీయ పార్టీకి చెందిన వారితో డబ్బు లావాదేవీల్లో గౌతమ్ మల్హోత్రాకు భాగస్వామ్యం ఉన్నట్లు ఈడీ వెల్లడించింది.

అసలు ఎవరీ గౌతమ్ మల్హోత్రా?

ఢిల్లీకి చెందిన బ్రిండ్‌కో సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టరే గౌతమ్ మల్హోత్రా. ఆయన ఓయాసిస్ గ్రూపు వ్యవహరాలను సైతం నిర్వహిస్తున్నారు. ఓయాసిస్ గ్రూపు అనేది మద్యం తయారీ వ్యవహరాల్లో నిమగ్నమైన సంస్థ. ఇది గౌతమ్ వైన్స్‌ (Gowtham Wines)ను తయారు చేస్తోంది. గౌతమ్ మల్హోత్రా తండ్రి దీపక్ మల్హోత్రా శిరోమణి అకాళీదళ్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే. ఇప్పటి వరకూ ఢిల్లీ, తెలంగాణ (Telangana)కు చెందిన వ్యక్తులను అరెస్టు చేయగా తాజాగా పంజాబ్‌ (Punjab)కు చెందిన మల్హోత్రా ఈ కేసులో అరెస్టు అయ్యారు. మద్యం కుంభకోణంలో గ్రూపులుగా ఏర్పడటంలో గౌతమ్ మల్హోత్రా కీలక పాత్ర పోషించినట్లు ఈడీ అనుమానిస్తోంది. అక్రమ నగదు తరలింపు, నేరాల్లో నిందితుడిగా ఉన్నారు. అలాగే నిబంధనలు ఉల్లంఘించి మరీ మద్యం విధానాన్ని అక్రమంగా పొందినట్లు మల్హోత్రాపై ఆరోపణలున్నాయి.

Updated Date - 2023-02-08T12:08:16+05:30 IST