Draupadi Murmu : మోదీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఊహాగానాలు.. రాష్ట్రపతితో నిర్మల సీతారామన్ భేటీ..

ABN , First Publish Date - 2023-07-10T15:16:05+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని మంత్రివర్గంలో భారీగా మార్పులు జరగబోతున్నాయనే ఊహాగానాల నడుమ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను రాష్ట్రపతి భవన్‌లో కలిశారు.

Draupadi Murmu : మోదీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఊహాగానాలు.. రాష్ట్రపతితో నిర్మల సీతారామన్ భేటీ..
Draupadi Murmu, Nirmala Sitharaman

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని మంత్రివర్గంలో భారీగా మార్పులు జరగబోతున్నాయనే ఊహాగానాల నడుమ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu)ను రాష్ట్రపతి భవన్‌లో కలిశారు. ఈ వారంలోనే మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించబోతున్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

మోదీ ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లే ముందే మంత్రివర్గంలో మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇటీవల కొందరు మంత్రులతో సమావేశాలు జరిపిన సంగతి తెలిసిందే. నడ్డాతో నిర్మల కూడా సమావేశమయ్యారు. ఆమెను మంత్రి పదవి నుంచి తొలగిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నెల 20 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ కూడా సమాయత్తమవుతోంది. పాత మిత్రులను దగ్గరకు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఎన్డీయే నుంచి విడిపోయిన పార్టీలను కూడా ఆకర్షించాలని ప్రయత్నిస్తోంది. ఈ నెల 18న ఎన్డీయే సమావేశానికి హాజరుకావాలని వివిధ పార్టీలను ఆహ్వానించింది. ఎస్ఏడీ, టీడీపీ, జేడీఎస్‌ కూడా ఈ సమావేశానికి హాజరవుతాయని జాతీయ మీడియా అంచనా వేస్తోంది. మరోవైపు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ కూడా ఎన్డీయేతో చెట్టపట్టాలు వేసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ప్రతిపక్షాల ఐక్యత కోసం నితీశ్ గట్టిగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీని గద్దె దించేందుకు ఆయన అనేక పార్టీలతో చర్చలు జరుపుతున్నారు.

ఇదిలావుండగా, నిర్మల సీతారామన్ వద్ద ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (OSD)గా పని చేస్తున్న వివేక్ సింగ్ పదవీ కాలాన్ని కుదించారు. జూలై 17తో ఆయన పదవీ కాలం ముగిసే విధంగా ఆదేశాలు జారీ చేశారు. ఆయన వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (DoPT) ఆఫీస్ మెమొరాండం తెలిపింది.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో నిర్మల సీతారామన్ భేటీ అయినట్లు రాష్ట్రపతి భవన్ సోమవారం ఓ ట్వీట్ చేసింది.

మోదీ ఈ నెల 13, 14 తేదీల్లో ఫ్రాన్స్‌లో పర్యటిస్తారు. పారిస్‌లో ఈ నెల 14న జరిగే బాస్టిల్లే డే పెరేడ్‌లో గౌరవ అతిథిగా పాల్గొంటారు.

ఇవి కూడా చదవండి :

Unusual heavy rains : ఉత్తరాదిలో ఎందుకు ఈ అసాధారణ భారీ వర్షాలు?

Panchayat Polls : మమత బెనర్జీని ఏకిపారేసిన దిగ్విజయ సింగ్

Updated Date - 2023-07-10T15:16:05+05:30 IST