Akhilesh Yadav: టార్గెట్ 2024.. బీజేపీకి చెక్ పెట్టే యత్నాలు

ABN , First Publish Date - 2023-03-17T18:12:05+05:30 IST

సమాజ్‌వాదీ పార్టీ(SP) అధినేత అఖిలేష్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Akhilesh Yadav: టార్గెట్ 2024.. బీజేపీకి చెక్ పెట్టే యత్నాలు
Akhilesh Yadav

కోల్‌కతా: సమాజ్‌వాదీ పార్టీ(SP) అధినేత అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) పశ్చిమబెంగాల్ కోల్‌కతాలో జరుగుతోన్న తన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కమలనాథులను కాకుండా తృణమూల్(TMC) అధినేత్రి మమతాబెనర్జీని గెలిపించి మంచి పని చేశారని ప్రశంసించారు. ఈడీ(ED), సీబీఐ(CBI)లను ఉపయోగించుకుంటూ ప్రతిపక్ష పార్టీల నేతలను బీజేపీ(BJP) బెదిరిస్తోందని ఆయన ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ కూడా వీటిని ప్రత్యర్థులపై ఉపయోగించిందన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో (2024 Lok Sabha elections) బీజేపీని ఉత్తరప్రదేశ్‌లోనూ, దక్షిణ భారతదేశంలోనూ ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. అన్ని పార్టీలకూ చెందిన నేతలందరూ సమావేశమై బీజేపీని కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని చెప్పారు. భారత రాజ్యాంగాన్ని కాపాడేందుకు బీజేపీని ఓడించాల్సిందేనని అఖిలేష్ పిలుపునిచ్చారు.

కాంగ్రెసేతర పక్షాల్లో సమాజ్‌వాదీ పార్టీ అతి కీలకమైంది. ఉత్తరప్రదేశ్‌లో 80కి పైగా లోక్‌సభ స్థానాలు ఉండటంతో ఎక్కువ స్థానాలు గెలవడాన్ని బట్టి సమాజ్‌వాదీకి ప్రాధాన్యత ఏర్పడుతుంది. అయితే 2014, 2019లో బీజేపీ కేంద్రంలో సొంత మెజార్టీతో అధికారంలోకి రావడానికి ఉత్తరప్రదేశ్ కీలకంగా మారింది. 2024లో మరోసారి గెలిచి ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారం చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Modi) తలపోస్తున్నారు. దీంతో ఈసారి కూడా ఉత్తరప్రదేశ్‌పై కమలనాథులు పూర్తిగా ఫోకస్ చేశారు. 2024లో కూడా వీలైనన్ని ఎంపీ స్థానాలు గెలిచేలా వ్యూహాలు అమలు చేస్తున్నారు. యోగి(Yogi) నేతృత్వంలో యూపీలో బీజేపీ దూసుకుపోతోంది. వరుసగా రెండోసారి సంచలన విజయం సాధించిన యోగి 2024లో బీజేపీని గెలిపించేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఈ తరుణంలో అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీ మరింత కష్టపడాల్సి ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అఖిలేష్ మెజార్టీ స్థానాలు గెలిస్తే ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్ధిగా అవతరించినా ఆశ్చర్యపడాల్సింది లేదంటున్నారు.

మరోవైపు కాంగ్రెసేతర పక్షాల మధ్య పూర్తి స్థాయి ఐక్యత కనపడటం లేదు. కాంగ్రెస్‌తో కలిసి వెళ్లాలని కొన్ని పార్టీలు, వద్దని మరికొన్ని పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. ఉదాహరణకు ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి(TMC), పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee)కి కాంగ్రెస్ నేతృత్వం గిట్టడం లేదు. కేజ్రీవాల్ తన పార్టీని కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో తీసుకెళ్లేందుకు యోచిస్తున్నారు. ఢిల్లీ, పంజాబ్‌ను కాంగ్రెస్ పార్టీనుంచి గెలుచుకున్న ఆయన మరిన్ని రాష్ట్రాల్లో పాగా వేయడానికి యత్నిస్తున్నారు.

మమత కూడా కాంగ్రెసేతర ఫ్రంట్‌పైనే మమత మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం ఆమె కాంగ్రెసేతర, బీజేపీయేతర పక్షంగా ఉన్నారు. కాంగ్రెసేతర పక్షంవైపే మమత మొగ్గడానికి ఓ కారణం ఉంది. అది కూడా ఇటీవలి ఉప ఎన్నికల్లో జరిగిందే.

త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పశ్చిమబెంగాల్‌లోని సాగర్దిగి(Sagardighi) అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో తృణమూల్ అభ్యర్ధిని కాంగ్రెస్ (Congress) పార్టీ ఓడించింది. తృణమూల్ అభ్యర్ధి దేబాశీష్ బెనర్జీని కాంగ్రెస్ బేరోన్ బిశ్వాస్ చిత్తుగా ఓడించారు. కాంగ్రెస్-సీపీఎం-బీజేపీ(Bharatiya Janata Party) అనైతిక పొత్తు వల్లే కాంగ్రెస్ అభ్యర్ధి గెలుపొందారని మమత ఆరోపించారు. బీజేపీ(BJP) ఓట్లన్నీ కాంగ్రెస్ అభ్యర్ధికి పడేలా కుట్ర చేశారని దీదీ ఆరోపించారు. సాగర్దిగి తమ పార్టీ అభ్యర్థి ఓటమితో షాక్‌లో పడిపోయిన దీదీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో(2024 Lok Sabha elections) ఎవ్వరితోనూ పొత్తు పెట్టుకోబోమని ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించారు. తద్వారా కాంగ్రెస్ పార్టీకి దీదీ అతి పెద్ద షాకిచ్చారు. తాము కాంగ్రెస్‌తో చేతులు కలిపేదే లేదన్నారు. మమత ఈ నెలాఖరులో ఢిల్లీలో పర్యటిస్తారని టీఎంసీ వర్గాలు తెలిపాయి. 2024 లోక్‌సభ ఎన్నికలే(2024 Lok Sabha elections) లక్ష్యంగా ఆమె పావులు కదపనున్నారు. ప్రతిపక్ష నేతలను కలిసి భవిష్యత్‌లో కలిసి చేపట్టాల్సిన అంశాలపై వ్యూహరచన చేయనున్నారు. ఢిల్లీ టూర్‌లో భాగంగా మమత ప్రతిపక్షనేతలను కలిసినా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని మాత్రం కలవబోరని ప్రచారం జరుగుతోంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఆమె కలవబోరని తెలుస్తోంది.

2024 లోక్‌సభ ఎన్నికల్లో(2024 Lok Sabha elections) ఒంటరిగా వెళ్తామంటూ మమత చేసిన ప్రకటన కాంగ్రెస్‌కు శరాఘాతంగా మారే అవకాశం ఉంది. అదే సమయంలో బీజేపీకి మేలు చేసే అవకాశం కూడా ఉంది. గత లోక్‌సభ ఎన్నికల్లో(2019) బీజేపీ 18 లోక్‌సభ స్థానాలు గెలుచుకుని తృణమూల్‌కు గట్టి సవాల్ విసిరింది. రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలు కూటమిగా నిలవకపోతే కమలనాథుల హవాను అడ్డుకోవడం కష్టమేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కాంగ్రెస్, తృణమూల్, వామపక్షాలు వేర్వేరుగా పోటీచేస్తే బీజేపీకి మేలు జరిగే అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(KCR) కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలయ్యే వరకూ కాంగ్రెస్‌తో చేతులు కలిపే అవకాశం లేదు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి కాంగ్రెస్‌తో చేతులు కలపాలా వద్దా అనేది నిర్ణయించనున్నారు.

బీహార్ ముఖ్యమంత్రి, జేడియూ అధినేత నితీశ్ కుమార్, ఆర్జేడీ(RJD) అధినేత, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీయాదవ్‌, ఎన్సీపీ(NCP) అధినేత శరద్ పవార్‌, శివసేన ఉద్ధవ్ వర్గం అధినేత ఉద్ధవ్ థాకరే, నేషనల్ కాన్ఫరెన్స్(NC) అధినేత ఫరూఖ్ అబ్దుల్లా, జేఎంఎం పార్టీ హేమంత్ సొరేన్ మాత్రమే కాంగ్రెస్ సారధ్యాన్ని కోరుకుంటున్నారు. బీహార్, జార్ఖండ్‌లో కాంగ్రెస్‌తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాలున్నాయి.

కాంగ్రెస్ పార్టీని కాదని మిగతా రాజకీయ పార్టీలను ఒకేతాటిపైకి తీసుకువచ్చేందుకు మమత, అఖిలేష్ యత్నించనున్నారు. కాంగ్రెస్‌తో ఒరిగేదేమీ లేదని వీరిద్దరూ అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2023-03-17T18:18:18+05:30 IST