IndiGo : ఇండిగో సిబ్బందిపై దాడి.. స్వీడిష్ జాతీయుడి అరెస్ట్..

ABN , First Publish Date - 2023-04-01T17:21:47+05:30 IST

మద్యం మత్తులో దుశ్చర్యలకు పాల్పడే విమాన ప్రయాణికులు తరచూ కనిపిస్తున్నారు. మైకంలో మహిళలపై మూత్ర విసర్జన చేయడం

IndiGo : ఇండిగో సిబ్బందిపై దాడి.. స్వీడిష్ జాతీయుడి అరెస్ట్..
Indigo Airlines

ముంబై : మద్యం మత్తులో దుశ్చర్యలకు పాల్పడే విమాన ప్రయాణికులు తరచూ కనిపిస్తున్నారు. మైకంలో మహిళలపై మూత్ర విసర్జన చేయడం వంటి చేష్టలతో తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టేవారు పెరిగిపోతున్నారు. తాజాగా బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇండిగో (Indigo Airlines) విమానంలో కేబిన్ క్రూ మెంబర్‌తో అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ ప్రయాణికుడిని ముంబై (Mumbai)లో అరెస్టు చేశారు.

ఓ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, క్లాస్ ఎరిక్ హరాల్డ్ జోనాస్ వెస్ట్‌బెర్గ్ (63)ను ఇండిగో విమానం సిబ్బంది ముంబై పోలీసులకు గురువారం అప్పగించారు. విమానంలో భోజనం సరఫరా చేస్తున్న సమయంలో ఈ వృద్ధ ప్రయాణికుడు అసభ్యకరంగా ప్రవర్తించడం ప్రారంభించారు. ఆ దుష్ప్రవర్తనను ముంబైలో విమానం దిగే వరకు కొనసాగించారు. ఒకానొక సమయంలో 24 ఏళ్ళ వయసుగల కేబిన్ క్రూ మెంబర్ కెప్టెన్‌ను అప్రమత్తం చేసి, వెస్ట్‌బెర్గ్‌కు రెడ్ వార్నింగ్ కార్డ్‌ను చదివి వినిపించారు.

బాధిత కేబిన్ క్రూ మెంబర్ (మహిళ) ఈ సంఘటన గురించి ఫిర్యాదులో వివరించారు. ఆమె ఓ పత్రికతో మాట్లాడుతూ, సీఫుడ్ లేదని తాను వెస్ట్‌బెర్గ్‌కు చెప్పానని, చికెన్ మీల్స్‌ను అందజేశానని చెప్పారు. అప్పటి నుంచి సమస్య ప్రారంభమైందన్నారు. పీఓఎస్ మెషీన్ ద్వారా సొమ్మును తీసుకునేందుకు ఆయన ఏటీఎం కార్డును అడిగానన్నారు. కార్డును స్వైప్ చేసే నెపంతో ఆయన తన చేతిని పట్టుకున్నారన్నారు. తన చేతిని వెనుకకు లాక్కున్నానని, కార్డ్ పిన్ నెంబరును టైప్ చేయమని కోరానని చెప్పారు. ఈసారి ఆయన హద్దులు మీరి, సీట్లోంచి లేచి నిల్చొని, తనను అసభ్యకరంగా తాకారని తెలిపారు. ప్రయాణికులందరి ముందు తనను అవమానించారన్నారు. అప్పుడు తాను పెద్దగా అరిచానని, దీంతో ఆయన తన సీట్లోకి వెళ్లిపోయారని చెప్పారు.

నిందితుని తరపు న్యాయవాది మాట్లాడుతూ, ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, ఆయన శరీరం వణుకుతుందని చెప్పారు. సహాయం లేకుండా దేనినీ పట్టుకోలేరన్నారు. పీఓఎస్ పేమెంట్ కార్డ్ మెషీన్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించినపుడు ఆయన ఆమె చేతిని తాకారని చెప్పారు. ఆయన ఉద్దేశపూర్వకంగా ఆమె చేతిని తాకలేదన్నారు.

దుర్వర్తన కారణంగా గత మూడు నెలల్లో అరెస్టయిన విమాన ప్రయాణికుల్లో వెస్ట్‌బెర్గ్ ఎనిమిదో వ్యక్తి అని అధికారులు చెప్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Jayamangala VenkataRamana: అమరావతి రైతులు ముందు నోరుజారిన వైసీపీ ఎమ్మెల్సీ..!

Hindus in danger : బీజేపీ ఆరోపణలపై మహువా మొయిత్రా మండిపాటు

Updated Date - 2023-04-01T17:21:47+05:30 IST