Afghanistan Earthquake: గత రెండు దశాబ్దాల్లో ఇదే ఘోర విషాదం.. 2 వేలు దాటిన భూకంప మృ‌తుల సంఖ్య

ABN , First Publish Date - 2023-10-08T12:24:00+05:30 IST

ఆప్ఘనిస్థాన్‌లో సంభవించిన భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. ఒక సారి రెండు సార్లు కాదు.. ఏకంగా ఏడు సార్లు భూమి కంపించడంతో పశ్చిమ ఆఫ్ఘనిస్థాన్ కకావికలమైపోయింది. అందులో ఐదు సార్లు భూప్రకంపనలు తీవ్ర స్థాయిలో వచ్చాయి.

Afghanistan Earthquake: గత రెండు దశాబ్దాల్లో ఇదే ఘోర విషాదం.. 2 వేలు దాటిన భూకంప మృ‌తుల సంఖ్య

ఆఫ్ఘనిస్థాన్‌లో సంభవించిన భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. ఒక సారి, రెండు సార్లు కాదు.. ఏకంగా ఏడు సార్లు భూమి కంపించడంతో పశ్చిమ ఆఫ్ఘనిస్థాన్ కకావికలమైపోయింది. అందులో ఐదు సార్లు భూప్రకంపనలు తీవ్ర స్థాయిలో వచ్చాయి. దీంతో వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి. పెద్ద పెద్ద భవనాలు సైతం నేలకూలాయి. వేలాది మంది ప్రాణాలు గాల్లో కలిశాయి. దీంతో ఎక్కడికక్కడ శవాల గుట్టలు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌లోని దారుణ పరిస్థితులను చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఇప్పటివరకు 2 వేల మందికి పైగా చనిపోయారని తాలిబన్ ప్రతినిధి అధికారికంగా ప్రకటించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. వేలాది మంది క్షత్రగాత్రులయ్యారు. క్షత్రగాత్రులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు. భూకంప బాధితులకు ఆసుపత్రుల్లో చికిత్స అందించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇళ్లు కూలిపోవడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కాగా గత రెండు దశాబ్దాల్లో ఆఫ్ఘనిస్థాన్‌లో సంభవించిన అత్యంత ఘోరమైన భూకంపం ఇదే కావడం గమనార్హం.


పశ్చిమ ఆఫ్ఘనిస్థాన్‌లో శనివారం సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైంది. భూకంపం వల్ల అనేక మంది మరణించారని ఆ దేశ జాతీయ విపత్తు అథారిటీ తెలిపింది. భూకంపం వల్ల హెరాత్‌లో మరణించిన వారి సంఖ్య ఎక్కువగా నమోదైందని దేశ సమాచార, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దుల్ వాహిద్ రేయాన్ తెలిపారు. భూకంపం తీవ్రతకు దాదాపు ఆరు గ్రామాలు ధ్వంసమయ్యాయని, వందలాది మంది పౌరులు శిథిలాల కింద సమాధి అయ్యారని చెప్పారు. అలాగే 465 ఇళ్లు ధ్వంసమయ్యాయని, మరో 135 ఇళ్లు దెబ్బతిన్నాయని యూఎన్ ఆఫీస్ ఫర్ కోఆర్డినేషన్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అఫైర్స్ తెలిపింది. కొంతమంది కూలిపోయిన భవనాల కింద చిక్కుకున్నారని, వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందోని, దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాాలున్నాయని యూఎన్ తెలిపింది. హెరాత్ ప్రావిన్స్‌లోని జెండా జాన్ జిల్లాలోని నాలుగు గ్రామాలు భూకంపం, ప్రకంపనల తీవ్రతతో దెబ్బ తిన్నాయని విపత్తు అధికార ప్రతినిధి మహ్మద్ అబ్దుల్లా జాన్ తెలిపారు. హెరాత్ నగరానికి వాయువ్యంగా 40 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. దీని తర్వాత మూడు అత్యంత బలమైన భూప్రకంపనలు 6.3, 5.9, 5.5 తీవ్రతతో వచ్చాయని పేర్కొంది. నగరంలో మధ్యాహ్నం సమయంలో కనీసం ఐదు బలమైన ప్రకంపనలు సంభవించాయని హెరాత్ నగర నివాసి అబ్దుల్ షాకోర్ సమాది తెలిపారు.

కాగా భూకంపంలో గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించడానికి ఆఫ్ఘనిస్తాన్‌లోని ప్రపంచ ఆరోగ్య సంస్థ 12 అంబులెన్స్ కార్లను పంపింది. భూకంపం కారణంగా హెరాత్‌లో టెలిఫోన్ కనెక్షన్‌లు దెబ్బతిన్నాయి. దీంతో కమ్యూనికేషన్ వ్యవస్థకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ప్రభావిత ప్రాంతాల నుంచి వివరాలను పొందడం కష్టమైంది. కాగా హెరాత్ ప్రావిన్స్ ఇరాన్ సరిహద్దులో ఉంది. స్థానిక మీడియా నివేదికల ప్రకారం, సమీపంలోని ఆఫ్ఘన్ ప్రావిన్సులైన ఫరా, బద్గీస్‌లో కూడా భూకంపం సంభవించింది. బరాదర్, హెరాత్, బాద్గీలలో మరణించిన వారికి తాలిబన్ ఆర్థిక వ్యవహారాల మంత్రి అబ్దుల్ ఘనీ తన సంతాపాన్ని తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించడానికి, నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించడానికి, ప్రాణాలతో బయటపడిన వారికి ఆహారం అందించడానికి వీలైనంత త్వరగా భూకంప ప్రభావిత ప్రాంతాలకు చేరుకోవాలని తాలిబాన్ ప్రభుత్వం స్థానిక సంస్థలను కోరింది. శిథిలాల కింద చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు భద్రతా సంస్థలు తమ వనరులను, సౌకర్యాలను ఉపయోగించుకోవాలని కోరింది.

Updated Date - 2023-10-08T12:38:07+05:30 IST