Covid: తెలంగాణకు కేంద్రం ఏం సూచించిందంటే..!

ABN , First Publish Date - 2023-03-17T12:37:15+05:30 IST

కొవిడ్‌ కేసులు (Covid cases) పెరుగుతున్నాయని.. అప్రమత్తంగా ఉండాలంటూ తెలంగాణ (Telangana) సహా ఆరు రాష్ట్రాలకు

Covid: తెలంగాణకు కేంద్రం ఏం సూచించిందంటే..!
కేంద్రం సూచన

కేసులు పెరుగుతున్నాయి.. అప్రమత్తం

కొవిడ్‌ కట్టడికి చర్యలు తీసుకోండి

మరో 5 రాష్ట్రాలకూ కేంద్రం సూచన..!

కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుకూ

తెలంగాణ సహా 6 రాష్ట్రాలకు కేంద్రం సూచన

న్యూఢిల్లీ, మార్చి 16: కొవిడ్‌ కేసులు (Covid cases) పెరుగుతున్నాయని.. అప్రమత్తంగా ఉండాలంటూ తెలంగాణ (Telangana) సహా ఆరు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఈ జాబితాలో తెలంగాణ పొరుగునున్న మహారాష్ట్ర, కర్ణాటక కూడా ఉన్నాయి. వీటితో పాటు తమిళనాడు, కేరళ, గుజరాత్‌కూ గురువారం హెచ్చరికలు జారీ చేసింది. వైరస్‌ (Virus) కట్టడికి చర్యలు తీసుకోవాలని కోరింది. అకస్మాత్తుగా ఎందుకు పెరుగుతున్నాయో దృష్టిసారించాలని పేర్కొంది. ‘‘కొన్ని రాష్ట్రాల్లో స్థానిక వ్యాప్తి ద్వారా కేసులు పెరుగుతున్నాయి. ఇలాంటిచోట ముప్పు అంచనాతో ముందు జాగ్రత్త, కట్టడి కీలకం. నియంత్రణ చర్యల్లో ప్రస్తుత పరిస్థితిని కొనసాగించడం అత్యవసరం. ఎక్కడైనా వ్యాప్తి ఆందోళనకరంగా ఉంటే నిరోధానికి ముందస్తు చర్యలు తీసుకోండి. గతంలో విడుదల చేసిన మార్గదర్శకాలను పాటించండి’’ అని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ లేఖలో సూచించారు. కాగా, తెలంగాణలో చాలారోజుల తర్వాత బుధవారం పాజిటివ్‌ రేటు 1ు దాటింది. 54 కేసులు నమోదయ్యాయి. మరోవైపు గత ఏడాది నవంబరు 12న దేశవ్యాప్తంగా 734 కేసులు వచ్చాయి. నాలుగు నెలల విరామం తర్వాత మళ్లీ గురువారం కేసులు 700 దాటాయి. టెస్టులు గణనీయంగా తగ్గుతున్నాయంటూ.. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ సైతం అన్ని రాష్ట్రాలు/యూటీలను అప్రమత్తం చేస్తూ లేఖలు రాశారు. కొన్ని రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు పెరుగుదలపై హెచ్చరిక చేశారు.

Updated Date - 2023-03-17T12:42:37+05:30 IST