Google: మరో కఠిన చర్యకు సిద్ధమవుతున్న గూగుల్!

ABN , First Publish Date - 2023-01-29T17:18:28+05:30 IST

ఉద్యోగుల తొలగింపు (Tech layoffs) పరిణామం టెక్ రంగంలో ఆందోళనకర వాతావరణాన్ని సృష్టించింది. బడాబడా టెక్ దిగ్గజాలు (Tech companies) సైతం వేల సంఖ్యలో సిబ్బందిని తొలగించడం, ఇంకా కొనసాగిస్తుండడం ఉద్యోగులను కలవరానికి గురిచేస్తున్నాయి.

Google: మరో కఠిన చర్యకు సిద్ధమవుతున్న గూగుల్!

న్యూఢిల్లీ: ఉద్యోగుల తొలగింపు (Tech layoffs) పరిణామం టెక్ రంగంలో ఆందోళనకర వాతావరణాన్ని సృష్టించింది. బడాబడా టెక్ దిగ్గజాలు (Tech companies) సైతం వేల సంఖ్యలో సిబ్బందిని తొలగించడం, ఇంకా కొనసాగిస్తుండడం ఉద్యోగులను కలవరానికి గురిచేస్తున్నాయి. ఈ విధంగా ఉద్యోగులపై వేటువేసిన కంపెనీల జాబితాలో టెక్ దిగ్గజం గూగుల్ (Google) కూడా ఉంది. ఏకంగా 12 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికి సంచలనం సృష్టించింది.

అయితే.. అయ్యిందేదో అయ్యిందిలే తమ ఉద్యోగాలు సేఫ్ అని భావిస్తున్న గూగుల్‌ మిగతా ఉద్యోగులపై మరో రూపంలో పిడుగుపడే కనిపిస్తున్నాయి. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ (Sundar pichaiah) త్వరలోనే జీతాల కోతపై (pay cuts) ప్రకటన చేసే అవకాశాలున్నాయి. సీనియర్ ఎగ్జిక్యూటివ్స్‌కు గణనీయ వేతన కోతలు ఉండొచ్చునని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ స్థాయిపైన అన్ని స్థానాల్లో పనిచేస్తున్నవారందరి వార్షిక బోనస్‌లలో భారీ కోత ఉంటుందని ఇటివల జరిగిన ఓ మీటింగ్‌లో సుందర్ పిచాయ్ చెప్పినట్టు సమాచారం. కంపెనీ ప్రదర్శన ఆధారంగా పరిహారం చెల్లింపులు ఉంటాయని ఆయన పేర్కొన్నారట. అయితే ఈ ప్రభావం ఎవరెవరిపై ఉండబోతోంది?, జీతాల కోత పరిధిలోకి ఎంతమంది ఉద్యోగులు వస్తారనేది పూర్తిగా తెలియరాలేదు. ఇదిలావుండగా గతేడాది డిసెంబర్‌లో సుందర్ పిచాయ్‌కి ఈక్విటీ అవార్డ్ పెరిగింది. సీఈవోగా ‘స్ట్రాంగ్ ఫర్ఫార్మెన్స్‌’ చూపించారని కంపెనీ బోర్డ్ గుర్తింపునిచ్చిన విషయం తెలిసిందే. 2020 ఫైలింగ్ ప్రకారం.. జనవరి 20 నాటికి సుందర్ పిచాయ్ జీతం 2 మిలియన్ డాలర్లుగా ఉంది. అయితే ఐఐఎఫ్ఎల్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022 ప్రకారం.. పిచాయ్ సంపద 20 శాతం క్షీణించి రూ.5300 కోట్లకు పడిపోయింది.

కాగా గ్లోబల్ మాంద్యం నేపథ్యంలో వ్యయ భారాలను తగ్గించుకోవడమే లక్ష్యంగా 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు జనవరి 20న సుందర్ పిచాయ్ ప్రకటించిన విషయం తెలిసిందే. గట్టి పర్యవేక్షణ అనంతరం ఉద్యోగులను పక్కనపెట్టినట్టు తెలిపారు. అయితే తక్కువ జీతాలకైనా పనిచేసేందుకు సిద్ధమని చాలామంది ఉద్యోగులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-01-29T17:18:30+05:30 IST