Bogaram Srinivasa Rao: వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చే అసెంబ్లీ తీర్మానాన్ని రద్దు చేయాలి

ABN , First Publish Date - 2023-03-31T21:44:28+05:30 IST

వాల్మీకి బోయ జాతిని ఎస్టీ జాబితాలో కలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేయడాన్ని నిరసిస్తూ ...

Bogaram Srinivasa Rao: వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చే అసెంబ్లీ తీర్మానాన్ని రద్దు చేయాలి

ఏలూరు జిల్లా: వాల్మీకి బోయ (Valmiki Boyas) జాతిని ఎస్టీ జాబితాలో కలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేయడాన్ని నిరసిస్తూ ఆదివాసి జేఏసీ గిరిజన సంఘాలు, ప్రజా సంఘాలు, న్యూ డెమోక్రసీ (New Democracy), టీడీపీ (TDP) జనసేన (JANASENA) పార్టీల ఆధ్వర్యంలో మండల కేంద్రమైన బుట్టాయిగూడెంలో బంద్ చేపట్టారు. బస్టాండ్ సెంటర్‌లో రోడ్డు దిగ్బంధం చేసి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఆదివాసి సంఘాలు, ముస్లిం సంఘాలు మద్దతు తెలియజేస్తూ సంఘీభావంగా బంద్‌లో పాల్గొన్నాయి.

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కర్నూలు, అనంతపురంలో ఉన్న వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చి పుణ్యం కట్టుకోవాలని అనిపిస్తే శ్రీకాకుళం నుంచి ఏలూరు జిల్లా వరకు ఉన్న ఆదివాసి ప్రజలంతా వైసీపీకి తగిన బుద్ధి చెబుతారని పోలవరం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బొగరం శ్రీనివాసరావు (Bogaram Srinivasa Rao) అన్నారు. అసెంబ్లీ తీర్మానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆదివాసి ప్రజలంతా దశలవారీ కార్యక్రమాలు నిర్వహిస్తారని, ఎస్టీ ప్రజా ప్రతినిధుల ఇళ్ల ముట్టడి చేయడానికి కూడా వెనకాడమన్నారు. మండల కేంద్రమే కాకుండా మండలంలో ప్రతి గ్రామంలో కూడా బంద్ కార్యక్రమం సంపూర్ణంగా నిర్వహించారన్నారు. ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటే చూస్తూ ఊరుకోమన్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని షెడ్యూల్ ఏరియాలో ఉన్న గిరిజన గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవరిస్తోందన్నారు. రహదారులు నిర్మించడం లేదని, గిరిజన ప్రజల ఇళ్ల నిర్మాణాలు, గ్రామాల అభివృద్ధిని పట్టించుకోవడం లేదన్నారు. వ్యక్తిగత సంక్షేమ నిధులు ఇస్తే సరిపోదని వైసీపీ నేతలకు సూచించారు.

బంద్ సందర్భంగా ఆదివాసి జేఏసీ చైర్మన్ మొడియం శ్రీనివాసరావు, న్యూ డెమోక్రసీ నాయకులు ఎస్ రామ్మోహన్, జనసేన నియోజకవర్గం ఇంచార్జి సిరి బాలరాజు, ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ, అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎమ్ఎస్ జిల్లా నాయకులు కారం రాఘవ , ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు కాకి మధు, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు అందుకుల ఫ్రాన్సిస్, ఆదివాసి జేఏసీ వైస్ చైర్మన్ కురసం దుర్గారావు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసి గిరిజనలు తరతరాలుగా ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా వెనకబడి జీవిస్తున్నారని తెలిపారు. అలాంటి గిరిజన ప్రజల్లో ధనవంతులు అయినా బలమైన సామాజిక జాతి వర్గాన్ని వాల్మీకి బోయలను, ఎస్టీ జాబితాలో కలపడం తీవ్రమైన అన్యాయమన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ టి బాబురావు, కెచ్చల పోతు రెడ్డి, ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షులు వెట్టి భారతి, సీఐటీయు జిల్లా కార్యదర్శి మొడియం నాగమణి, గిరిజన సంఘం నాయకులు కారం భాస్కర్, సర్పంచ్ కారం లక్ష్మీ కొరస గంగరాజు, సరియం చెల్లయ్య దుర్గాప్రసాద్, తెల్లం దేవరాజ్, అంతర్వేది గూడెం ఎంపీటీసీ కొవ్వాసు గోవిందరాజు, పెద్ద ఎత్తున ఆదివాసి గిరిజన ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-31T21:51:59+05:30 IST