Varla Ramaiah: అక్రమ గంజాయి కేసులు జగన్ మెడకే చుట్టుకుంటాయి.. కారణం అదే..

ABN , First Publish Date - 2023-03-02T18:36:18+05:30 IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Andhra Pradesh Chief Minister YS Jaganmohan Reddy)పై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) విమర్శలు గుప్పించారు.

Varla Ramaiah: అక్రమ గంజాయి కేసులు జగన్ మెడకే చుట్టుకుంటాయి.. కారణం అదే..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Andhra Pradesh Chief Minister YS Jaganmohan Reddy)పై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) విమర్శలు గుప్పించారు. జగన్ అంటే గిట్టనివారిపై అక్రమ గంజాయి కేసులు పెట్టడం సిగ్గుచేటని, అక్రమ గంజాయి కేసులు జగన్ మెడకే చుట్టుకుంటాయని వర్ల రామయ్య అన్నారు. గంజాయి స్మగ్లర్లను శిక్షించడానికి వినియోగించాల్సిన పోలీస్ వ్యవస్థను ప్రశ్నించేవారి గొంతునొక్కడానికి వాడటం సరైనది కాదని వర్ల రామయ్య తెలియజేశారు. జగన్‌ను వ్యతిరేకించినందుకు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తప్పుడు కేసులకు బలయ్యారని వర్ల రామయ్య ఆరోపించారు.

ఇటీవల టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య (Varla Ramaiah) మాట్లాడుతూ మాజీ మంత్రి కెఎస్ జవహర్‌ (Jawahar)ను పోలీసులు అవమానించిన ఘటనపై డీజీపీ (DGP)కి లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ యువతకు రోల్ మోడల్స్‌గా నిలవాల్సిన పోలీసులు చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడటం శోచనీయమన్నారు. రోజు రోజుకు ఏపీ పోలీసులలో క్రమశిక్షణరాహిత్యం పెరిగిపోతోందని విమర్శించారు. చిత్తూరు జిల్లా నగరి సిఐ శ్రీనివాసంతి వ్యవహారశైలి ఇందుకు నిదర్శనమన్నారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) పాదయాత్రలో శ్రీనివాసంతి వాడిన అసభ్యకర భాష చూస్తుంటే అనాగరికులు కూడా తలదించుకునేలా ఉందని వర్ల రామయ్య అన్నారు. నాగరికులు ఎవరూ అలాంటి భాష మాట్లాడరని అన్నారు. ఫిబ్రవరి 17న కోనసీమ జిల్లా, అనపర్తి, రామచంద్రాపురం పోలీసులు ఇలాంటి మరో ఘటనకు పాల్పడ్డారన్నారు. చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)పర్యటనలో ఉన్న జవహర్‌ను పోలీసులు అరెస్టు చేసి నేలపై కూర్చోబెట్టారని, స్టేషన్‌కు వచ్చిన ఇతర సందర్శకులను కుర్చీలపై కూర్చోబెట్టి జవహర్‌ను మాత్రం నేలపై కూర్చోబెట్టి హింసించారని మండిపడ్డారు.

జవహర్ దళితుడని తెలిసి.. పోలీసులు కావాలనే కులవివక్ష చూపారని, అతని మొబైల్ పోను, పర్సును బలవంతంగా లాక్కున్నారని వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న నగరి సిఐ శ్రీనివాసంతిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. జవహర్‌ను అవమానించిన రామచంద్రాపురం పోలీసు అధికారులపై ఎస్సీ అట్రాసిటీ యాక్టు సెక్షన్ 3 ప్రకారం కేసు నమోదు చేసి విచారించాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి

అందుకే పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు

Updated Date - 2023-03-02T18:38:46+05:30 IST