YuvaGalam: 95వ రోజు యువగళం పాదయాత్ర... నందికొట్కూరు నియోజకవర్గంలోకి లోకేష్

ABN , First Publish Date - 2023-05-10T10:22:08+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.

YuvaGalam: 95వ రోజు యువగళం పాదయాత్ర... నందికొట్కూరు నియోజకవర్గంలోకి లోకేష్

కర్నూలు: టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ (TDP Leader Nara Lokesh) యువగళం పాదయాత్రకు (YuvaGalam Padaytra)ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో యువనేత పాదయాత్రకు (YuvaGalam) ప్రతీ ఒక్కరూ సంఘీభావం తెలుపుతున్నారు. లోకేష్‌తో (Nara Lokesh) కలిసి పాదయాత్ర చేస్తున్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా మహిళలు, యువత, రైతులు లోకే‌ష్‌కు ఘనస్వాగతం పలుకుతున్నారు. యువనేతకు (Lokesh YuvaGalam) తమ సమస్యలు చెప్పుకుంటూ పరిష్కరించాలని కోరుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని సమస్యలను తీర్చుతామని హామీ ఇస్తూ లోకేష్‌ ముందుకు సాగుతున్నారు.

ఈరోజు (బుధవారం) కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం గార్గేయపురం నుంచి 95వ రోజు యువగళం పాదయాత్రను లోకేష్ ప్రారంభించారు. కాసేపటికే కోడుమూరు నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తి అయ్యింది. నందికొట్కూరు నియోజకవర్గంలోకి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రవేశించింది. ఈ సందర్భంగా టీడీపీ నేతలు, ప్రజలు లోకేష్‌కు ఘనస్వాగతం పలికారు. ఈ రోజు సాయంత్రం నందికొట్కూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో యువనేత మాట్లాడనున్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలో బ్రాహ్మణకొట్కూరు, వడ్డెమాను, అల్లూరు, నందికొట్కూరులో యువగళం పాదయాత్ర కొనసాగనుంది. అల్లూరులో 1200 కిలోమీటర్ మైలురాయి వద్ద శిలాఫలకాన్ని లోకేష్ ఆవిష్కరించనున్నారు. నందికొట్కూరులో బహిరంగ సభ అనంతరం నందికొట్కూరు శివారు విడిది కేంద్రంలో నారా లోకేష్ రాత్రి బస చేయనున్నారు.

యువనేతను కలిసిన నందికొట్కూరు ఎస్సీలు

పాదయాత్రలో భాగంగా నందికొట్కూరు నియోజకవర్గం బ్రాహ్మణకొట్కూరులో నియోజకవర్గంలో దళితులు యువనేత లోకేష్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎస్సీలకు చెందాల్సిన సబ్ ప్లాన్ నిధులను వైసీపీ ప్రభుత్వం నవరత్నాలకు దారి మళ్లించి తీరని ద్రోహం చేస్తోందన్నారు. వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన 27సంక్షేమ పథకాలను పునరుద్దరించాలని కోరారు. గతంలో అమలు చేసిన అంబేద్కర్ స్టడీ సర్కిల్, విదేశీవిద్య, ఎన్ఎస్ఎఫ్‌డీసీ వంటి పథకాలను టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టాలన్నారు. గతంలో ఇంటర్, డిగ్రీ చదివిన ఎస్సీ విద్యార్థుల స్వయం ఉపాధికి ఇన్నోవాలు, ట్రాక్టర్లు అందించారని.. టీడీపీ వచ్చాక మళ్లీ సబ్సిడీపై వాహనాలను అందించాలని కోరారు. కేజీ నుంచి పీజీ వరకు ఎస్సీ నిరుపేదలకు ఉచిత విద్య అందించడంతో పాటు విదేశీవిద్య అందించేలా చర్యలు తీసుకోవాలని ఎస్సీలు యువనేతను విన్నవించారు.

లోకేష్ మాట్లాడుతూ... ఎస్సీలకు చెందాల్సిన రూ.28,147 కోట్లు దారి మళ్లించిన దళిత ద్రోహి జగన్ రెడ్డి అని మండిపడ్డారు. ఎస్సీ సంక్షేమ పథకాలను రద్దు చేయడమేగాక, అదేమని ప్రశ్నించిన దళితులపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ ప్రభుత్వం రద్దు చేసిన ఎస్సీ సంక్షేమ పథకాలన్నీ పునరుద్దరిస్తామని హామీ ఇచ్చారు. పేద ఎస్సీ విద్యార్థల కోసం స్టడీ సర్కిల్స్, అంబేద్కర్ విదేశీవిద్య పథకాలను అమలుచేస్తామన్నారు. దళితులపై దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించడమేగాక, ఎస్సీలపై పెట్టిన తప్పుడు కేసులను ఉపసంహరిస్తామన్నారు. దళితులకు తీరని అన్యాయం చేసిన జగన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో బుద్దిచెప్పాలని ప్రజలను లోకేష్ కోరారు.

Updated Date - 2023-05-10T10:26:45+05:30 IST