YuvaGalam: లోకేష్‌‌కు కర్నూలు న్యాయవాదుల ధన్యవాదాలు..

ABN , First Publish Date - 2023-05-08T10:33:04+05:30 IST

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర 93వ రోజుకు చేరుకుంది.

YuvaGalam: లోకేష్‌‌కు కర్నూలు న్యాయవాదుల ధన్యవాదాలు..

కర్నూలు: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర (TDP Leader Nara lokesh Yuvagalam) 93వ రోజుకు చేరుకుంది. సోమవారం ఉదయం ఎస్‌టీబీసీ గ్రౌండ్ విడిది కేంద్రం నుంచి పాదయాత్రను ప్రారంభించిన లోకేష్‌ను ముందుగా మహాజన సోషల్ సమైక్యతా సంఘం ప్రతినిధులు కలిశారు. తమ సమస్యలను తెలియజేశారు. అనంతరం జిల్లా కోర్టు భవనం వద్దకు పాదయాత్ర చేరుకోగా.. యువనేతను జిల్లా న్యాయవాదుల కలిసి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన లోకేష్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. కర్నూలుకు కేటాయించిన జ్యూడిషియల్ అకాడమీని జగన్ తరలించారన్నారు. హైకోర్టు ఏర్పాటు చేస్తామని నాలుగేళ్లుగా మోసం చేశారని తెలిపారు. అమరావతిలోనే హైకోర్టు ఉంటుందని సుప్రీం కోర్టులో వైసీపీ ప్రభుత్వం తెలిపిందని.. విశాఖలో హైకోర్టు అని మంత్రి బుగ్గన చెప్పారన్నారు. జగన్ మాయ మాటలు విని మోసపోయామని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేశారు. యువనేత మాట్లాడుతూ.. జగన్ లా మాట మార్చి, మడమ తిప్పే బ్యాచ్ తమది కాదన్నారు. బెంచ్ ఖచ్చితంగా ఏర్పాటు చేసి తీరుతామని స్పష్టం చేశారు.

లోకేష్‌ను కలిసిన టిడ్కో బాధితులు...

అనంతరం యువనేతను 50వ డివిజన్ ప్రజలు కలిశారు. కర్నూలు 50వ డివిజన్ టిడ్కో బాధితులు యువనేత లోకేష్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తమ డివిజన్‌లో 1200 మంది గత ప్రభుత్వంలో టిడ్కో ఇళ్లకోసం రూ.లక్ష చొప్పున చెల్లించామని.. ఇంతవరకు ఇళ్లను పూర్తిచేసి ఇవ్వలేదన్నారు. వార్డుల్లో మంచినీరు సరిగా రావడంలేదని.. నీటి సమస్య ఇబ్బందిగా ఉందన్నారు. బీసీ కార్పొరేషన్‌లో లోన్లు తీసుకున్న 18 మంది రజకులు లోన్లు క్లియర్ చేస్తామని చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. 50వ వార్డులో పార్కు, లైబ్రరీ ఏర్పాటు చేయాలని కోరారు. తమ వార్డులో విద్యుత్ స్తంభాలు, విద్యుత్, డ్రైనేజి సమస్యలు ఉన్నాయన్నారు. సమస్యల పరిష్కారానికి చొరవచూపాలని యువనేతను కోరారు.

యువనేత లోకేష్ మాట్లాడుతూ... టీడీపీ ప్రభుత్వ హయాంలో 90 శాతానికి పైగా పూర్తి చేసిన టిడ్కో ఇళ్లను మిగిలిన పనులు పూర్తి చేసి ఇవ్వకుండా సైకో ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు. పట్టణాలు, నగరాల్లో పన్నుల బాదుడుపై ఉన్న శ్రద్ద, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంపై లేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక 50వ డివిజన్ తాగునీరు, డ్రైనేజి, విద్యుత్ వంటి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. 50వ డివిజన్‌లో ఖాళీస్థలాన్ని గుర్తించి పార్కు, లైబ్రరీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు.

Updated Date - 2023-05-08T10:39:28+05:30 IST