NaraLokesh: ‘పెంచుకుంటూ పోతానన్నది పెట్రోలు రేట్లా జగన్?’

ABN , First Publish Date - 2023-04-21T16:02:01+05:30 IST

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో కొనసాగుతోంది.

NaraLokesh: ‘పెంచుకుంటూ పోతానన్నది పెట్రోలు రేట్లా జగన్?’

కర్నూలు: టీడీపీ యువనేత నారా లోకేష్ (TDP Leader Nara Lokesh) యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా లోకేష్ (Nara lokesh) వైసీపీ సర్కార్‌పై (YCP Government) లోకేష్ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పెట్రోల్ ధరలు పెరుగుతుండటంపై లోకేష్ మండిపడ్డారు. ‘‘పెంచుకుంటూ పోతానన్నది పెట్రోలు రేట్లా జగన్?!. రాష్ట్రంలో పెట్రోలు ధరలు జగన్ పాపాల చిట్టా మాదిరిగా రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆదోనిలోని భారత్ పెట్రోలు బంకు వద్ద లీటరు పెట్రోలు ధర రూ.111.31, డీజిల్ ధర రూ.99.09 రూపాయలు కాగా, పొరుగున ఉన్న కర్నాటకతో పోలిస్తే పెట్రోలు 13రూపాయలు, డీజిల్ ధర 10 రూపాయలు అధికం. ఎన్నికలప్పుడు జగన్ పెంచుకుంటూ పోతానంటే అమాయక ప్రజలు నమ్మి ఓట్లు గుద్దేశారు. అధికారంలోకి వచ్చాక ఆకాశమే హద్దుగా రోజురోజుకు పెంచుతూ పోతున్న పెట్రోలు, డీజిల్, నిత్యవసరాలు, ఇంటిపన్నులు, కరెంటు చార్జీలు చూశాక గానీ జలగన్న నిజస్వరూపమేమిటో జనానికి అర్థం కాలేదు. ఒక్కఛాన్స్‌తో నిండామునిగిన ఏపీ ప్రజలనోట ఇప్పుడు వస్తున్న మాట సైకో పోవాలి... సైకిల్ రావాలి!’’ అంటూ లోకేష్ వ్యాఖ్యలు చేశారు.

ఆదోని శివారు క్యాంప్ సైట్‌ నుంచి 77వ రోజు పాదయాత్రను లోకేష్ ప్రారంభించారు. ఆ వెంటనే ఆదోని టౌన్‌లోకి యువగళం పాదయాత్ర ప్రవేశించగా.. లోకేష్‌కు ప్రజలు, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మహిళలు పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చి లోకేష్‌కు తమ సమస్యలు చెప్పుకున్నారు. నిత్యావసరధరలు పెరిగిపోయాయని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిత్యావసర సరుకుల ధరలు, పన్నులు, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని, పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆపై యువనేతను ఆదోని బైపాస్ బాధితులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఆదోని బైపాస్ రోడ్డు ఎలైన్ మెంట్ -2 ఆదోని పట్టణ మాస్టర్ ప్లాన్‌కు విరుద్దమైని చెప్పగా.. దీనిపై హైవే అథారిటీకి లేఖరాస్తామన్నారు. అనంతరం యువనేతకు ఆదోని డివిజన్ మాలమహానాడు సంఘీభావం తెలియజేసి.. వినతిపత్రం చేసింది. ప్రైవేటురంగంలో ఎస్సీ రిజర్వేషన్ అమలుచేయాలి, సబ్ ప్లాన్ నిధులను దళితుల అభివృద్ధికే ఖర్చుచేయాలని మాలమహానాడు నేతలు కోరారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక గతంలో అమలుచేసిన ఎస్సీ సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ఆదోనిలో లోకేష్‌ను రాయలసీమ పరిరక్షణ స్టూడెంట్స్ ఫెడరేషన్ ప్రతినిధులు, ప్లెక్సీ ప్రింటింగ్ అసోసియేషన్ ప్రతినిధులు, ఎంఆర్ పిఎస్ ప్రతినిధులు, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, మెకానిక్స్ అసోసియేషన్ ప్రతినిధులు కలిసి తాము పడుతున్న బాధలను చెప్పుకున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని చెబుతూ లోకేష్ పాదయాత్రలో ముందుకు వెళ్తున్నారు.

Updated Date - 2023-04-21T16:02:01+05:30 IST