AP Assembly: ఏపీ అసెంబ్లీ ప్రారంభం.. వాయిదా తీర్మానంపై టీడీపీ పట్టు.. గందరగోళం

ABN , First Publish Date - 2023-03-18T09:28:10+05:30 IST

టీడీపీ సభ్యుల ఆందోళనల మధ్యే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఐదవ రోజు ప్రారంభమయ్యాయి.

AP Assembly:  ఏపీ అసెంబ్లీ ప్రారంభం.. వాయిదా తీర్మానంపై టీడీపీ పట్టు.. గందరగోళం

అమరావతి: టీడీపీ సభ్యుల (TDP MLAs) ఆందోళనల మధ్యే ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Budget Session) ఐదవ రోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం (Speaker Tammineni Sitharam) ప్రశ్నోత్తరాలను చేపట్టారు. విపక్ష సభ్యుల ఆందోళనల మధ్యే ప్రశ్నోత్తరాలు ప్రారంభమయ్యాయి. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వివరాలు బహిర్గతం చేయాలని టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. వాయిదా తీర్మానాలపై చర్చకు తెలుగు దేశం నేతలు పట్టుబడుతున్నారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి టీడీపీ ఆందోళనకు దిగింది. సీఎం ఢిల్లీ వెళ్లి ఏం సాధించుకొచ్చారని నిరసనకు దిగారు. వెనకబడిన జిల్లాల ప్యాకేజీ ఏమైందంటూ ఆందోళన చేపట్టారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసు (YS Viveka Case)లో సీబీఐ అడుగు ముందుకేస్తే సీఎం జగన్‌కు ఢిల్లీ గుర్తుకొస్తుందని టీడీపీ నేత అచ్చెన్నాయుడు (TDP Leader Atchannaidu) వ్యాఖ్యలు చేశారు. కేసుల మాఫీ కోసమే సీఎం జగన్ (AP CM) ఢిల్లీ వెళ్లారని ఆయన మండిపడ్డారు.

టీడీపీ సభ్యుల ఆందోళనపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Minister Buggan Rajendranath Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుల తీరును తప్పుబట్టారు. సీఎం ఢిల్లీ పర్యటనపై వాయిదా తీర్మానం ఇస్తారా.. అసలు వాయిదా తీర్మానం అర్ధం తెలుసా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడు అడిగినందుకే ఆదివారం కూడా సభ పెట్టామని మంత్రి తెలిపారు. గతంలో చంద్రబాబు 35 సార్లు ఢిల్లీ వెళ్లారని.. ఆ 35 సార్లు చర్చించి.. తరువాత ప్రస్తుత సీఎం ఢిల్లీ పర్యటనపై చర్చిద్దామా అంటూ సవాల్ విసిరారు. దానికి తాము సిద్ధమే అంటూ టీడీపీ సభ్యులు ప్రతిసవాల్ చేశారు. సీఎం ఢిల్లీ పర్యటన వివరాలు తెలపాలంటూ స్పీకర్ పోడియం వద్ద టీడీపీ సభ్యులు తీవ్ర ఆందోళన చేపట్టారు. ఈ గందరగోళం మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.

కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు

ఉద్దానం సమస్యపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి రజనీ సమాధానం ఇస్తున్నారు. మంత్రి రజనీ సమాధానం కొనసాగుతుండగానే స్పీకర్ పోడియం వద్ద టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. సీఎం ఢిల్లీ టూర్ రహస్యాలపై చర్చించాలని తమ వాయిదా తీర్మానాన్ని అనుమతించాలంటూ టీడీపీ సభ్యుల ఆందోళన చేపట్టారు. తమ వాయిదా తీర్మానాన్ని అనుమతించకపోవడంతో ఆ కాగితాలను చించి గాల్లోకి విసురుతూ టీడీపీ సభ్యులు నిరసన చేస్తున్నారు. దీంతో సభలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది.

అసెంబ్లీ ఆవరణలో టీడీపీ నిరసన...

సీఎం జగన్ దిల్లీ పర్యటన వివరాలు బహిర్గతం చేయాలని టీడీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఏపీ అసెంబ్లీ ప్రారంభానికి ముందు సచివాలయం అగ్నిమాపక కేంద్రం వద్ద టీడీపీ సభ్యులు నిరసన ప్రదర్శన చేశారు. ఢిల్లీ వెళ్లి ఏం సాధించుకొచ్చారని ప్రశ్నించారు. పోలవరానికి నిధులు ఎంత తెచ్చారంటూ ప్లకార్డుల ప్రదర్శించారు. అప్పర్ భద్ర ఆపారా?... విశాఖ రైల్వేజోన్ తెచ్చారా అంటూ తెలుగుదేశం నేతలు కాలినడకన అసెంబ్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. బాబాయ్ హత్య కేసులో సీబీఐ అడుగు ముందుకేస్తే సీఎంకు ఢిల్లీ గుర్తుకొస్తుందని మండిపడ్డారు. కేసుల మాఫీ కోసమే సీఎం ఢిల్లీ వెళ్లారని తమకు సమాచారం ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక జగన్మోహన్ రెడ్డి 18సార్లు ఢిల్లీ వెళ్లి 31రోజులు పాటు అక్కడ ఉన్నారని తెలిపారు. ఎందుకు అన్నిసార్లు ఢిల్లీ వెళ్లారో ప్రజలెవ్వరికీ తెలీదన్నారు. కీలక బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే ఆదరాబాదరాగా ఢీల్లీ ఎందుకు వెళ్లారో ప్రకటన చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

Updated Date - 2023-03-18T09:56:02+05:30 IST