Share News

Avanigadda Issue: అవనిగడ్డలో ఉద్రిక్తత.. వీధుల్లో వజ్ర వాహనంతో పోలీసుల కవాతు

ABN , First Publish Date - 2023-10-21T10:12:58+05:30 IST

కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఉద్రిక్తత కొనసాగుతోంది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న జనసేన కార్యకర్తలపై వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ దాడి నేపథ్యంలో అవనిగడ్డ బంద్‌కు టీడీపీ, జనసేన పార్టీలు పిలుపునిచ్చాయి. దీంతో వందల సంఖ్యలో పోలీసులు మోహరించారు. భాష్పవాయువు గోళాలు ప్రయోగించే వజ్ర వాహనంతో అవనిగడ్డ వీధుల్లో పోలీసులు కవాతు నిర్వహించారు.

Avanigadda Issue: అవనిగడ్డలో ఉద్రిక్తత.. వీధుల్లో వజ్ర వాహనంతో పోలీసుల కవాతు

కృష్ణా: కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఉద్రిక్తత కొనసాగుతోంది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న జనసేన (Janasena) కార్యకర్తలపై వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు(YCP MLA Simhadri Ramesh babu) దాడి నేపథ్యంలో అవనిగడ్డ బంద్‌కు టీడీపీ, జనసేన పార్టీలు పిలుపునిచ్చాయి. దీంతో వందల సంఖ్యలో పోలీసులు మోహరించారు. భాష్పవాయువు గోళాలు ప్రయోగించే వజ్ర వాహనంతో అవనిగడ్డ వీధుల్లో పోలీసులు కవాతు నిర్వహించారు. బంద్‌కు అనుమతి లేదని వ్యాపారులు షాపులు తెరవాలని ఖాకీలు విజ్ఞప్తి చేస్తున్నారు. అవనిగడ్డలో టీడీపీ, జనసేన ముఖ్య నేతలను ఇళ్ళ నుంచి బయటకు రానీయకుండా నిర్బంధించారు. జనసేన కార్యకర్తలపై ఎమ్మెల్యే దాడి చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జనసైనికులపై దాడి జరిగిన నేపథ్యంలో అవనిగడ్డకు జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రాకుండా అవనిగడ్డ నలు వైపులా పోలీసులు పికెట్లు ఏర్పాటు చేశారు.


అసలేం జరిగిందంటే..

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అవనిగడ్డ వచ్చి నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.93 కోట్ల వరాలు కురిపించి నిన్నటి(శుక్రవారం)కి సంవత్సరం పూర్తి అయిన నేపథ్యంలో హామీల అమలు ఎప్పుడు అంటూ తెలుగుదేశం జనసేన పార్టీలు ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు కార్యాలయం ఎదుట మహా ధర్నాకు టీడీపీ, జనసేన పార్టీలు పిలుపునిచ్చాయి. అయితే 144వ సెక్షన్ అమలులో ఉందని ధర్నాకు అనుమతులు లేవని పోలీసులు ఇప్పటికే మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ సహా నియోజకవర్గ తెలుగుదేశం నేతలకు నిన్ననే నోటీసులు జారీ చేశారు. బుద్ధప్రసాద్ సహా పలువురు తెలుగుదేశం, జనసేన నేతలను ఇళ్ళ వద్ద నిర్బంధించారు. ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ ఇంటికి వెళ్ళే అన్ని దారుల్లో పికెట్లు ఏర్పాటు చేశారు. వందల మందితో కూడిన ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. అయినప్పటికీ పోలీసులను తప్పించుకుని మరీ వైసీపీ ఎమ్మెల్యే ఇంటిని టీడీపీ, జనసేన కార్యకర్తలు చుట్టుముట్టారు. దీంతో రెచ్చిపోయిన వైసీపీ ఎమ్మెల్యే.. పెద్ద సంఖ్యలో వచ్చిన జనసేన, టీడీపీ కార్యకర్తపై కర్ర తీసుకుని వెంటపడ్డారు. తన కార్యకర్తలతో కలిసి టీడీపీ, జనసేనపై బూతులతో రమేష్‌బాబు విరుచుకుపడ్డారు. దీంతో ఎమ్మెల్యేకు జనసేన, టీడీపీ నేతలకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే రమేష్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరసింహారావు జనసేన కార్యాలయం వరకు కర్రలతో వెళ్లి మరీ దాడి చేశారు. వైసీపీ ఎమ్మెల్యే తీరుపై జనసేన, టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులు కూడా ఎమ్మెల్యే వ్యవహారంపై మండిపడుతున్నారు. ప్రజాసమస్యలు పరిష్కరించలేని ఎమ్మెల్యే వీధి రౌడీలా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు.

Updated Date - 2023-10-21T10:12:58+05:30 IST