Payyavula Keshav: ఫైబర్ నెట్ ప్రాజెక్టులో ఒక్క రూపాయి అవినీతి జరగలేదు

ABN , First Publish Date - 2023-10-08T16:23:07+05:30 IST

ఫైబర్ నెట్ ప్రాజెక్టులో ఒక్క రూపాయి అవినీతి జరగలేదు.. పక్కకు పోలేదని టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్(Payyavula Keshav) వ్యాఖ్యానించారు.

Payyavula Keshav: ఫైబర్ నెట్ ప్రాజెక్టులో ఒక్క రూపాయి అవినీతి జరగలేదు

అమరావతి: ఫైబర్ నెట్ ప్రాజెక్టులో ఒక్క రూపాయి అవినీతి జరగలేదు.. పక్కకు పోలేదని టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్(Payyavula Keshav) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘చంద్రబాబు ఈ ప్రాజెక్టులో అవినీతికి పాల్పడలేదు. ఫైబర్ నెట్ ప్రాజెక్టులో అవినీతి జరగలేదని వైసీపీ ప్రభుత్వానికి.. దర్యాప్తు సంస్థలకు ఛాలెంజ్ చేస్తున్నాను. రూ. 5 వేల కోట్లతో ఫైబర్ నెట్ ప్రాజెక్టు రిపోర్ట్ ఇచ్చారు. దాన్ని రూ. 330 కోట్లకు కుదించార. అవినీతి చేయాలనుకుంటే రూ. 5 వేల కోట్లకే ప్రాజెక్టును ఆమోదించే వారు. ఇన్ క్యాప్ నేతృత్వంలో టెండర్ ఎవాల్యూయేషన్ కమిటీ వేశారు. దానిపై ఐగుగురు సీనియర్ ఐఏఎస్‌లతో టెండర్ అప్రూవల్ కోసం హైపవర్ కమిటీ వేశారు. అవినీతి చేయాలనుకుంటే ఇన్ని కమిటీలు వేస్తారా..? ఆ తర్వాత ఇంప్లిమెంటేషన్ కమిటీ.. ప్రాజెక్టు మానిటరింగ్ కమిటీ వేశారు. రూ. 30 కోట్లు ప్రభుత్వం పెట్టుబడి పెడితే.. రూ. 300 కోట్లు అప్పులు తీసుకున్నారు.

ఇన్ని కమిటీలు వేస్తే అవినీతి జరిగిందనడానికి మీకు సిగ్గు లేదా..? చంద్రబాబు అవినీతి చేశాడని జగన్‌రెడ్డి తప్పుడు కేసులు పెట్టారు..? టీడీపీ హయాంలో పెట్టిన ఫైబర్‌నెట్ ప్రాజెక్టు ద్వారా రూ. 900 కోట్లు ఆదాయం వచ్చింది. ప్రాజెక్టును ఆమోదిస్తూ చంద్రబాబు సంతకం చేశారు. ప్రాజెక్టును అమలు చేసిన మిగిలిన అధికారుల పేర్లను ఎందుకు ప్రస్తావించడం లేదు. టెరాసాఫ్ట్ సంస్థకు క్వాలిఫికేషన్ ఉందని సిగ్నం సంస్థ ప్రతినిధి గౌరీశంకర్ సర్టిఫై చేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక గౌరీ శంకర్‌ను ప్రలోభ పెట్టి.. ఆ సంతకం తనది కాదని ఫోర్జరీ అని ఫిర్యాదు చేయించుకున్నారు. గౌరీ శంకర్‌ను ఈ ప్రభుత్వం ఫైబర్ నెట్ ప్రాజెక్టుకు ఈడీని చేసింది. ఆ తర్వాత గౌరీ శంకర్‌పై ఫిర్యాదులు చేస్తే తప్పించి.. వేరే కాంట్రాక్టులు ఇచ్చి నోరు మూయించింది. టెరాసాఫ్ట్ కంపెనీకి టెండర్ దక్కే నాటికి ఆ సంస్థ బ్లాక్ లిస్టులో లేదు. జగన్ ప్రభుత్వంలో టెండర్ గడువును పొడిగించలేదా..? ఎలాంటి ఎక్సపీరియన్స్ లేని సంస్థలకు టెండర్ గడువు పొడిగించి కట్టబెట్టిన దాఖలాలు జగన్ ప్రభుత్వంలో చాలా ఉన్నాయి.

ఈవీఎంల ద్వారా ఓట్లల్లో మార్పులు చేయవచ్చని చెప్పడమే హరిప్రసాద్ చేసిన తప్పిదమా..? సిస్కో వంటి సంస్థలు నాసిరకం మెటిరీయల్ సరఫరా చేస్తాయా..? హరి ప్రసాద్ - కనుమూరి కోటేశ్వరరావు మధ్య ప్రాజెక్టు పూర్తైన రెండేళ్ల తర్వాత లావాదేవీలు జరిగితే దాన్ని అవినీతి అంటారా..? అదీ రూ. 30 లక్షల మేర జరిగిన లావాదేవీలు చంద్రబాబుకు సంబంధం ఉందంటారా..? చంద్రబాబు లాంటి మనిషి మీద రూ. 30 లక్షల అవినీతి అంటూ ఆరోపణా..? సిగ్గుండాలి. ఫైబర్‌నెట్ ప్రాజెక్టులో ఎవరినైనా ప్రాసిక్యూట్ చేయాలనుకుంటే ముందుగా అధికారులనే ప్రాసిక్యూట్ చేయాలి. మేం రూ. 140కు ఫైబర్ నెట్ కనెక్షన్ ఇస్తే.. ఈ ప్రభుత్వం రూ. 300కు పెంచి ఇస్తోంది. మేం ఫైబర్ నెట్ ప్రాజెక్టును 100 మందితో నడిపితే.. ఈ ప్రభుత్వం పులివెందుల వాళ్లకి.. వైసీపీ సోషల్ మీడియా వాళ్లే ఫైబర్ నెట్ ప్రాజెక్టులో ఉద్యోగాలిచ్చారు’’ అని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.

Updated Date - 2023-10-08T16:23:07+05:30 IST