Nakka Anand Babu: జగన్‌రెడ్డి నాలుగేళ్లలో దళితులకు సెంట్ భూమైనా ఇచ్చారా..?
ABN , First Publish Date - 2023-11-17T17:35:09+05:30 IST
నాలుగేళ్లలో ఒక్క దళిత, గిరిజనుడికి ఎక్కడా సెంటు భూమి ఇవ్వని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి హక్కులు కల్పించే అధికారం..అర్హత లేవని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ( Nakka Anand Babu ) అన్నారు.
అమరావతి: నాలుగేళ్లలో ఒక్క దళిత, గిరిజనుడికి ఎక్కడా సెంటు భూమి ఇవ్వని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి హక్కులు కల్పించే అధికారం..అర్హత లేవని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ( Nakka Anand Babu ) అన్నారు. శుక్రవారం నాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...తన తండ్రి ఆక్రమించుకున్న అసైన్డ్ ల్యాండ్స్ దళితులకు పంచే ధైర్యం జగన్‌రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. ఇడుపులపాయలో తమపరిధిలో అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయని అసెంబ్లీ సాక్షిగా దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి చెప్పి దాదాపు రెండు దశాబ్దాలు అవుతోంది. ఆక్రమించుకున్న భూముల్లో ఒక్క ఎకరమైనా రాజశేఖర్‌రెడ్డి దళితులకు తిరిగిచ్చాడని జగన్‌రెడ్డి నిరూపించగలడా అని నిలదీశారు. చీమల పుట్టల్లోకి పాములు దూరినట్టు నాలుగేళ్ల జగన్ పాలనలో వైసీపీనేతలు దళితులు..ఇతరవర్గాల భూముల్ని ఆక్రమించుకున్నారన్నారు. విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి, వైసీపీ నేతలు కొట్టేసిన 40వేల ఎకరాలను పేదలకు పంచే ధైర్యం జగన్‌కు ఉందా అని ప్రశ్నించారు.
రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతలు కొల్లగొట్టిన 14 లక్షల ఎకరాలపై వారికి సర్వహక్కులు కల్పించడానికే జగన్ భూహక్కు, భూ రక్ష అని కట్టుకథలు చెబుతున్నాడన్నారు. ఎప్పుడో 1954 నుంచి గతప్రభుత్వాలు దళితులకు ఇచ్చిన భూములపై జగన్ హక్కులు కల్పించేదేంటి అని ప్రశ్నించారు. ల్యాండ్ పర్చేజ్ స్కీమ్ కింద నాలుగున్నరేళ్లలో ఒక్క దళితుడికైనా జగన్ నాలుగు సెంట్లు ఇచ్చినట్లు నిరూపించగలరా అని సవాల్ విసిరారు. వైసీపీ నేతలు చుక్కలు పెడతారు..చుక్కల భూముల సమస్యలు పరిష్కరిస్తామని భూ యజమానుల నుంచి అందినకాడికి దోచేస్తారని మండిపడ్డారు. రెండుసార్లు తూతూ మంత్రంగా భూ సర్వే జరిపించి సర్వేరాళ్లపై.. పాసుపుస్తకాలపై తన బొమ్మలు వేసుకున్నాడని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మూడోవిడత సర్వే అంటూ మొత్తంగా రాష్ట్రంలో మిగిలిన అసైన్డ్.. 22ఏ.. చుక్కల భూములు.. గిరిజన భూములకే జగన్‌రెడ్డి ఎసరు పెట్టాడని నక్కా ఆనంద్ బాబు ధ్వజమెత్తారు.