Tragic Friday: వరుస విషాదాలు.. ఇంటర్నెట్ టాప్ ట్రెండ్స్ ఇవే!

ABN , First Publish Date - 2022-12-30T20:53:23+05:30 IST

పీలే.. హీరాబెన్ మోదీ, రిషభ్ పంత్.. ఈ రోజు (శుక్రవారం) ఇంటర్నెట్‌లో టాప్ ట్రెండ్స్. శుక్రవారం తెల్లవారుజాము

Tragic Friday: వరుస విషాదాలు.. ఇంటర్నెట్ టాప్ ట్రెండ్స్ ఇవే!
Pele, Heeraba, Rishabh Pant

న్యూఢిల్లీ: పీలే.. హీరాబెన్ మోదీ, రిషభ్ పంత్.. ఈ రోజు (శుక్రవారం) ఇంటర్నెట్‌లో టాప్ ట్రెండ్స్. శుక్రవారం తెల్లవారుజాము నుంచి ప్రజలు వరుసగా విషాద వార్తలు వినాల్సి వచ్చింది. అందులో మొదటిది బ్రెజిల్ సాకర్ దిగ్గజం పీలే (Pele) కన్నుమూత. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా సాకర్ అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆ తర్వాత కాసేపటికే భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ(Heeraben Modi) మృతి వార్త చాలామందిని కలచివేసింది. ఆ తర్వాత కొన్ని కొన్ని గంటలైనా గడవకముందే టీమిండియా స్టార్ క్రికెటర్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) రోడ్డు ప్రమాదం బారినపడి త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.

నూతన సంవత్సరానికి సమయం దగ్గరపడుతుండడంతో చాలామంది సెలబ్రేషన్స్ మూడ్‌లోనే ఉన్నారు. ఆ సమయంలో ఈ మూడు వరుస వార్తలు విషాదాన్ని నింపేశాయి. ఉదయం నిద్రలేవగానే ఈ వార్తలు వినాల్సి వస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు. విషయం తెలిసిన వెంటనే జనం ఈ ముగ్గురి గురించి ఇంటర్నెట్‌లో వెతకడం ప్రారంభించారు. దీంతో రిషభ్ పంత్, హీరాబెన్ మోదీ, పీలే టాప్ ట్రెండ్స్‌గా నిలిచాయి.

ఫుట్‌బాల్ లెజెండ్ మరణం

బ్రెజిల్ సాకర్ దిగ్గజం పీలే.. ప్రపంచకప్‌ను మూడుసార్లు సాధించిన జట్టులో సభ్యుడు. 82 ఏళ్ల వయసులో కన్నుమూశాడు. పీలే మొట్టమొదటి ఫుట్‌బాల్ గ్లోబల్ సూపర్‌స్టార్‌గా ఖ్యాతికెక్కాడు. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పీలే నవంబరు నుంచి ఆసుపత్రిలోనే ఉన్నాడు. ఆయన మరణించాడన్న వార్త ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. విషయం తెలిసిన వెంటనే ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు. #RIPKing హ్యాష్‌టాగ్ ట్విట్టర్‌లో మోతెక్కింది. దీంతో అది కాస్తా ట్విట్టర్ ట్రెండ్స్ లిస్ట్‌లో చేరింది.

ప్రధానమంత్రి మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూత

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ మోదీ 100 సంవత్సరాల వయసులో తుదిశ్వాస విడిచారు. శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. తన తల్లి ఇక లేరన్న విషయాన్ని ప్రధాని మోదీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. వందేళ్లు పూర్తి చేసుకున్న తన తల్లి దేవుని పాదాల చెంత విశ్రాంతి తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఆమె జీవిత ప్రయాణం తపస్సు లాంటిదని, సన్యాసిలా, కర్మయోగిలా, విలువలకు కట్టుబడిన నిస్వార్థ జీవితాన్ని గడిపారని అన్నారు. ఆమెలో త్రిమూర్తులు ఉన్నట్టు భావిస్తున్నానని ట్వీట్ చేశారు.

మోదీ తల్లి మరణవార్త తెలిసి దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు తమ సంతాపం తెలిపారు. అమిత్ షా, స్మృతి ఇరానీ, ఆనంద్ మహీంద్రా, అక్షయ్ కుమార్ తదితరులు హీరాబెన్ మృతికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ప్రమాదం నుంచి బయటపడిన పంత్

టీమిండియా స్టార్ క్రికెటర్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఢిల్లీ నుంచి రూర్కీ వెళ్తుండగా ఆయన కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. ఆ వెంటనే కారుకు మంటలు అంటుకున్నాయి. 25 ఏళ్ల పంత్ అదృష్టవశాత్తు గాయాలతో బయటపడ్డాడు. నుదురు, కాళ్లకు గాయాలయ్యాయి. పంత్‌కు ప్రమాదం జరిగిందన్న వార్త తెలిసిన వెంటనే అభిమానులు పోస్టులతో సోషల్ మీడియాను హోరెత్తించారు. పంత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దీంతో #Getwellsoonchamp ట్విట్టర్‌లో ట్రెండింగ్ అయింది.

Updated Date - 2022-12-30T23:42:45+05:30 IST